|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Father’s Day Special: వెండితెరపై రియల్ హీరో

Published: 14-06-2025, 8:47 PM
Father's Day Special: వెండితెరపై రియల్ హీరో

ఫాదర్స్ డే సందర్భంగా, వెండితెరపై తండ్రి పాత్రల ప్రత్యేకతను చూద్దాం. తెలుగు సినిమాల్లో తండ్రుల త్యాగాలు, ప్రేమ ఎలా చూపించబడ్డాయో తెలుసుకుందాం.

వెండితెరపై తండ్రి-కొడుకు బంధం

జీవితానికి వెలుగు.. ప్రతి అడుగులో తోడు: నాన్న

వెలకట్టలేని ప్రేమ.. లెక్కించలేని భాద్యత: నాన్న

ఎప్పటికీ మరువలేని ఆప్యాయత.. జీవితంలో దొరికిన బెస్ట్ గిఫ్ట్: నాన్న

నాన్న.. పలికేందుకు రెండు పదాలే అయినప్పటికీ త్యాగం అనే పదానికి బహుళ నిర్వచనం నాన్న. తాను తిన్నా తినకున్న పిల్లలకు మూడు పూటల అన్నం పెట్టాలి అనుకునే ఏకైకా వ్యక్తి నాన్న. పిల్లల మాటలతో కడుపు నింపుకుని, వారి నవ్వులతో మనసు నింపుకుని ఎన్నో కష్టాలను ఎదురిస్తాడు నాన్న. ఏ కష్టం వచ్చిన.. కన్నీళ్లు ఎదిరించినా తన పిల్లలకు ఆనందాన్నే పంచుతాడు నాన్న. పిల్లలు ఏ దారిలో వెళ్లిన.. ఎన్నో అడ్డంకులు వారిని ఆపిన వెనుక ఉండి నేను ఉన్నాను అనే ధైర్యం ఇచ్చే వాడే నాన్న. మనం చేసే ప్రతి తప్పుని కడుపులో పెట్టుకుని మనసు నిండా ప్రేమతో మనల్ని హక్కున చేర్చుకునేవాడే నాన్న. నాన్న ప్రేమ ఓ అద్భుతం.. ఆయన త్యాగమే మన జీవితం.. ప్రతి ఒక్కరి రియల్ లైఫ్‌లో హీరో నాన్న. ఇలా రియల్ లైఫ్‌లో నాన్న కష్టాలకు అర్థం పట్టేలా రీల్ లైఫ్‌లో ఎన్నో చిత్రాలు మన కళ్లముందుకు వచ్చాయి.. అవేంటో చూద్దాం.

తెలుగు సినిమాల్లో తండ్రి పాత్రలు

ఫాదర్ సెంటిమెంట్ అనగానే మనకు గుర్తు వచ్చే సినిమా ‘నాన్నకు ప్రేమతో’. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు. తండ్రీ కొడుకు ప్రేమను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో.. చిన్న తనంలో తండ్రి మన కోసం ఎంతో చేశాడు.. అదే తండ్రి చివరి రోజుల్లో ముఖంపై చిరునవ్వు చూడాలనుకుంటాడు కొడుకు. ఆయన సంతోషంగా కన్ను మూయడానికి తండ్రిని మోసం చేసిన వ్యక్తిపై రివేంజ్ తీర్చుకునే క్రమంలో.. కొడుకు (ఎన్టీఆర్) తన తండ్రిపై (రాజేంద్ర ప్రసాద్) చూపించే ప్రేమ ఎమోషనల్‌గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది. అలాగే ఈ మూవీలో ‘నాన్నకు ప్రేమతో’ సాంగ్ హైలెట్‌గా నిలిచింది.

నేనురల్ స్టార్ నాని నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం.. తండ్రీకూతుళ్ల బ్యాక్ డ్రాప్‌లో వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని తండ్రిగా, మృణాల్ ఠాకూర్ తల్లి పాత్రలో నటించారు. పుట్టుకతోనే ఓ జబ్బుతో పుట్టిన తన కూతురు ఎంతో కాలం బతకదు అని డాక్టర్స్ నిర్ధారించగా.. తన ప్రాణాన్ని అడ్డం పెట్టి మరి తండ్రి కూతురుని కాపాడుకుంటాడు. ఈ సినిమా ఎంతో మందిని కదిలించింది. థియేటర్స్‌లో ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకున్నారు.

శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ఫాదర్ సెంటిమెంట్ చిత్రం ‘సైంధవ్’. యాక్షన్ విత్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించాడు. సైంధవ్ కోనేరు అలియాస్ సైకో (వెంకటేష్) తన ప్రాణానికి ప్రాణమైన కూతురు గాయత్రి‌తో కలిసి జీవిస్తుంటాడు. కూతురే ప్రపంచంగా బతుకే ఈ తండ్రికి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ అనే జబ్బుతో కూతురు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఆ జబ్బు నుంచి బయట పడాలంటే రూ. 17 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ అవసరమని సూచిస్తారు డాక్టర్లు. అంత డబ్బును తండ్రి ఎలా సంపాదించాడు.. కూతురు ప్రాణాల కోసం తను ఏం చేశాడు అనేది ఈ సినిమాలో హైలెట్‌గా ఉంటుంది.

టాలీవుడ్‌లో ఫాదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన చిత్రాల్లో ‘బొమ్మరిల్లు’ ఒకటి. భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రిగా ప్రకాష్ రాజ్.. తన పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా అడక్క ముందే అన్నీ సమకూర్చాలి అనుకుంటాడు. తన తండ్రి అతి ప్రముతో కొడుకు మదనపడుతూ ఉండే కుర్రవాడిగా సిద్ధార్థ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ తమ కొడుకులను తమ అదుపులో పెట్టుకునే తండ్రులను బొమ్మరిల్లు ఫాదర్ అంటూ సంబోధిస్తారు అంటే ఈ సినిమా ప్రేక్షకుల మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌లో ‘ఇప్పటికీ నా చేయి మీ చేతిలో ఉంది నాన్న’ అనే డైలాగ్ ఎంతో మంది తండ్రులను, కొడుకులను కదిలించింది.

నాన్నల త్యాగాలకు నిదర్శనం

నాన్న ప్రేమకు గుర్తుగా నిలిచిపోయే సినిమాల్లో ఒకటిగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ నిలుస్తుంది. విలువలే తన ఆస్తి అనే ట్యాగ్ లైన్‌తో తెరెకెక్కిన ఈ చిత్రంలో.. తన తండ్రి ఎంతో గొప్పవాడు అని నమ్మే అల్లు అర్జున్.. తండ్రి గురించి వందమంది మంచిగానే మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో కోట్ల రూపాయల ఆస్తిని కూడా క్షణాల్లో వదిలేస్తాడు. అలా తన తండ్రి అనుకోకుండా ఒకరికి నష్టం చేకూర్చారని తెలియడంతో ఆ నష్టం తీర్చేందుకు తాను కష్టంలో ఇరుక్కుంటాడు. తండ్రి ఇచ్చిన ఆస్తులే కాదు తండ్రి మీద మరకలు పడకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులదే అని చాటిచెప్పిన ఈ సినిమా ఇప్పటికే చాలా మంది కొడుకులకు ఫేవరెట్‌గా నిలుస్తుంది.

ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కిన ‘కొత్త బంగారు లోకం’ మూవీలో ఫాదర్ సెంటిమెంట్ హైలెట్‌గా నిలుస్తుంది. యుక్త వయసు వచ్చిన కొడుకుకి ఒక తండ్రి ఎలాంటి సపోర్ట్ అందిస్తాడు, ఆయన మరణించిన తర్వాత తండ్రి విలువ తెలుసుకున్న కొడుకు ఎలా ప్రయోజకుడు అయ్యాడు అనేది ఈ సినిమా స్టోరీ. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో నటించగా.. వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. ఇందులో వీరిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్, ‘నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులు ఇవ్వరుగా కన్నీళ్లు తెప్పిస్తాయి’ అనే సాంగ్ అందరికి కన్నీళ్లు తెప్పిస్తాయి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘డాడీ’. ఇందులో చిరంజీవి రాజ్ కుమార్ అనే పాత్రలో నటిస్తాడు. తన వద్ద డబ్బును సహాయం కోసం అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తుంటాడు. వాళ్లు రాజ్‌ను మోసం చేస్తారు. అయితే.. రాజ్‌కు ఆరేళ్ల పాప ఉంటుంది. పాపకు తీవ్రమైన అనారోగ్యం రావడంతో తండ్రి కాపాడుకోలేకపోతాడు. దీంతో ఆ పాప చనిపోతుంది. ఇక ఆరేళ్ల తర్వాత అదే రూపంలో ఉన్న మరో పాప రాజ్‌కు కనిపించడంతో.. ఆ పాప తన కూతురే అని తెలుసుకుంటాడు రాజ్. ఆ తర్వాత నుంచి సినిమాలో వచ్చే ప్రతీ సీన్ ప్రేక్షకులకు కంటతడి పెట్టించే విధంగా ఉంటాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా వస్తుందంటే ఎంతో మంది టీవీల ముందుకు కూర్చుంటారు.

ప్రకాశ్ రాజ్ – త్రిషల ‘ఆకాశమంత’, అజిత్ కుమార్ ‘విశ్వాసం’, విక్రమ్ ‘నాన్న’, మణిరత్నం ‘అమృత’ ఇలా చిత్రాలు తండ్రి సెంటిమెంట్‌తో వెండితెరపై దర్శనమిచ్చాయి. మన కోసం తండ్రి ఎంత చేస్తున్నాడో ఈ సినిమాలు అర్థం పట్టేలా చూపించాయి. రీల్ లైఫ్ అయినా.. రియల్ లైఫ్ అయినా ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ అమ్మ అయితే.. ఫస్ట్ హీరో నాన్నే..

చివరిగా, వెండితెరపై చూపించే తండ్రుల ప్రేమ, త్యాగాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతాయి. ఈ సినిమాలు మనల్ని మన తండ్రులను మరింతగా గౌరవించేలా చేస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.