|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చరిత్ర మరుగున పడిన తొలి దళిత హీరోయిన్ పీ.కే. రోజి కన్నీటి గాథ!

Published: 20-12-2025, 10:04 AM
చరిత్ర మరుగున పడిన తొలి దళిత హీరోయిన్ పీ.కే. రోజి కన్నీటి గాథ!
  • పి.కె. రోజి భారతీయ సినిమా రంగంలో తొలి దళిత కథానాయికగా చరిత్రలో నిలిచింది.
  • జే.సి. డేనియల్ తీసిన తొలి మలయాళ మూకీ చిత్రం ‘విగతకుమారన్’లో ఆమె హీరోయిన్.
  • దళిత స్త్రీగా ‘నాయర్’ పాత్ర పోషించినందుకు సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది.
  • సినిమా షూటింగ్ సమయంలో రోజికి రోజుకు ఐదు రూపాయలు పారితోషికం, వంటగది శుభ్రం చేసే బాధ్యత ఉండేది.

భారతీయ సినీ చరిత్రలో తొలి దళిత కథానాయికగా పి.కె. రోజి నిలిచారు. ‘విగతకుమారన్’ సినిమాతో ఆమె చేసిన అద్భుత ప్రయాణం, సమాజం నుండి ఎదుర్కొన్న నిరసనలు, బాధలు ఆమె జీవితాన్ని ఓ విషాద గాథగా మార్చాయి. ఆమె సాహసం, త్యాగం నేటికీ స్ఫూర్తిదాయకం.

దళిత కుటుంబంలో పుట్టి.. కళా ప్రయాణం

మొట్టమొదటి హీరోయిన్‌గా రికార్డు

దళిత కుటుంబంలో పుట్టి నాటక, సినిమా రంగంలో రాణించాలని కలగన్న రోజీ సమాజం నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నది. తన కళా జీవన ప్రయాణంలో ఆమె అనుభావాలు, బాధామయ సందర్భాలు బహుభాషా భారతీయ సినిమా రంగంలోనే కాదు ప్రపంచ సినీ రంగంలో మరే నటికీ ఎదురై వుండవు. మలయాళ సినిమా చరిత్రలో రోజి ఒక రాలిన కన్నీటి బొట్టుగా తన స్థానాన్ని సంపాదించుకున్నది. వెండితెరపై నటించిన తొలి భారతీయ దళిత నాయకగా చరిత్రలో పి.కె.రోజి స్థానం సుస్థిరం.

జె.సి.డానియల్ కేరళలో తీసిన మొదటి సైలెంట్ సినిమా ‘విగతకుమారన్’ హీరోయిన్ పి.కె. రోజీది మరో కథ. తొలి మలయాళ సినిమా కథానాయికగా ఆమె చరిత్ర కెక్కింది. పూర్తి పేరు పౌల్ కుంజి రోజి. 1903లో నందన్ కోడే (త్రివేండ్రమ్ దగ్గర)లో జన్మించిందామె. తండ్రి పౌలోజి, తల్లి కుంజి. దళిత కులంలో పులియా శాఖకు చెందిన రోజి కుటుంబం క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. బాల్యంలోనే తండ్రి మరణించడంతో వారి కుటుంబం పేదరికంలో మగ్గిపోవలసి వచ్చింది. చిన్నతనం నుండి గడ్డి కోసుకుని వచ్చి అమ్ముకునే పని చేసినా ఆమెకు నటన అంటే ఇష్టం ఉండేది. అయితే స్త్రీలు నాటకాలు వేయడం అనేది సమాజం నుండి వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమే అయ్యేది ఆ కాలంలో. ఆమెను చెడు ప్రవర్తనగల ఆడదానిగా ముద్ర వేసేవారు. ఈ కారణాల వలన వారి కుటుంబం యావత్తు క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. అప్పటి నుండి రోజమ్మాళ్ పి.కె. రోజిగా మారింది. నాటి దళిత నాటక రంగం ‘కాకరాశి’లో ఆమె నటనలో మెళకువలను నేర్చుకున్నది.

విగతకుమారన్: తొలి సినిమా ప్రస్థానం

ఇదిలా ఉండగా జె.సి. డేనియల్ తన ‘విగతకుమారన్’ సినిమా నాయిక కోసం వెదుకుతుండగా జాన్సన్ అనే సహనటుని సూచన మేరకు రోజీని కలుసుకుని ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. జాన్సన్ ఇందులో విలన్ వేషం వేశాడు. రోజీ తనకు రోజువారి పారితోషికం చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నది. ఉదయం 9గంలకు షూటింగ్‌కి వెళ్ళి చీకటిపడే దాకా పనిచేసేది. షూటింగు పూర్తయ్యాక అక్కడి వంటగదిని శుభ్రం చేయడం కూడా ఆమె డ్యూటీలో భాగం. ఇందుకుగాను ఆమెకు రోజూ అయిదు రూపాయలు ఇచ్చేవారు. డేనియల్ సూచనలను గ్రహించి అవలీలగా నటించేది రోజి. ‘విగత కుమారన్’లో రోజి నటించినది ఒక ‘నాయర్’ మహిళ పాత్ర. ఇది ఆ కాలంలో పెద్ద సంచలనం. ఛాందస ప్యూడల్ నాయర్ సమాజం ఒక దళిత స్త్రీ ‘నాయర్’ మహిళ వేషం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. చాలామంది సినిమావారు ‘ఒకవేళ రోజీ గనుక వస్తే ఈ సినిమా ప్రారంభోత్సవానికి రాలేమ’ని తేల్చి చెప్పారు. దాంతో డేనియల్ సైతం భయపడి రోజీని సినిమా ఫస్ట్ షోకి ఆహ్వానించలేక పోయాడు. త్రివేండ్రలోని కాపిటల్ థియేటర్లో ‘విగతకుమారన్’ 1928 లో విడుదలైంది.

అగ్రకులాల ఆగ్రహం.. సినీ జీవితం మంగళం

మళ్లీ రోజీ విషయానికి వద్దాము. ఒక నాయర్ మహిళ వేషం దళితురాలు వేయడం హిందూ అగ్రవర్ణాల ఆగ్రహానికి కారణమైంది. సినిమా ప్రారంభం చేయడానికి నిరాకరించిన నాటి ప్రఖ్యాత న్యాయవాది మదూర్ గోవింద పిళ్లైకి బదులుగా ఏర్పాటు చేసిన రెండవ ప్రదర్శనకు రోజీ చూడటానికి వీలుకల్పించారు. కానీ థియేటర్లో ఛాందస వాదులు రెచ్చిపోయి తరువాత సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. థియేటర్లోని స్క్రీన్‌ను చించివేశారు. ఆ తర్వాత రోజీపై దాడికి పూనుకున్నారు. దాంతో ఆమె తన తల్లి వద్దకు ‘బాలా మార్కెట్’కి మారింది. నాటి ట్రావెన్కూర్ పాలకులు ఆమెకు రక్షణగా పోలీసులను నియమించారు. అయినా వారి పూరి గుడిసెను దుండగులు కాల్చివేశారు. వారి తల్లి సోదరి, సోదరులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను తట్టుకోలేని రోజి తన వారిని తీసుకుని నాగర్ కోయిల్‌కు తరలిపోయింది.

నాయర్ పాత్రపై అభ్యంతరాలు.. రోజికి కన్నీటి గాథ

60 ఏళ్ల అజ్ఞాతం.. అనామక మరణం

ఇక్కడితో రోజీ ఏమైందో దశాబ్దాల పాటు ఎవరికీ తెలియ లేదు. నాగర్ కోయిల్లో కేశవ పిళ్లై అనే లారీ డ్రైవర్‌ని పెళ్లి చేసుకున్న రోజి అక్కడ ‘రాజమ్మాళ్’గా కొత్త జీవితం ప్రారంభించింది. కొన్నేళ్ల క్రితం కొందరు సినిమా పరిశోధకులు రోజీ తరువాతి జీవితాన్ని గురించిన విషయాలను పరిశోధించి వ్యాసాలు రాశారు. ఆమెకు పద్మ, నాగప్పన్ ఇరువురు సంతానం. వారు మధురై, నాగర్ కోయిల్లో నివాసముంటున్నారు. చివరికి రోజీ తన 85 ఏట 1988లో నాగర్ కోయిల్ టౌన్లోని ఊట్టుపుర తెరువులో మరణించింది.

2013లో “సెల్యులాయిడ్ పేరున కమల్ తీసిన సినిమాతో మళ్ళీ పి.కె.రోజీ వార్తల్లోకి వచ్చింది. ఇది తొలి ‘విగతకుమారన్’ దర్శకుడి జె.సి. డేనియల్ జీవితం ఆధారంగా తీసిన సినిమా. విను అబ్రహాం రాసిన “నష్టనాయిక” నవల ఆధారంగా తీసారు. చాందినీ గీత అనే నూతన నటి రోజీ పాత్రను పోషించింది. ఇదే గాక ‘ దిలాస్ట్ చైల్డ్’, ‘ఇదు రోజియుడె కథ’ అనే రెండు సినిమాలు కూడా రోజ్ జీవితం ఆధారంగా రూపొందినవి.

పి.కె. రోజి సినీ చరిత్రలో ఓ విస్మరించలేని అధ్యాయం. సమాజ వ్యతిరేకతను ధిక్కరించి వెండితెరపై మెరిసిన ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం నేటి నటీనటులకు ఆదర్శం. ఆమె జీవితం ఎప్పటికీ ఒక గొప్ప పాఠం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.