
📌 Key Points
- ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
- అనుమతులు లేకుండా రూ. 55 కోట్లు విదేశీ కరెన్సీలో చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి.
- కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో జరగాల్సిన రేసును రద్దు చేసింది, విచారణకు ఆదేశించింది.
- కేటీఆర్ గతంలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు, దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొనడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని కోర్టులో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జీషీట్ లోని వివరాల ప్రకారం… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను ఏ1గా ఉన్నారు.
ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ ఎన్ రెడ్డి పేర్లను పేర్కొన్నారు. ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్‌రావు, ఏ5గా యూకేకు చెందిన ఎఫ్‌ఈవో(ఫార్ములా-ఈ ఆపరేషన్స్) సంస్థను చేర్చారు.
కేటీఆర్‌ను ఏ1గా పేర్కొన్న ఏసీబీ
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్‌లో ఈ రేసు నిర్వహించారు. అనుమతులు లేకుండా రూ. 55 కోట్లు విదేశీ కరెన్సీలో చెల్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత… 2024లో నిర్వహించాల్సిన రేసును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. సుమారు రూ .55 కోట్ల చెల్లింపులలో అవకతవకలకు సంబంధించిన వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.
2024 డిసెంబరులో కేటీఆర్ , అర్వింద్ కుమార్ తో పాటు ఇతరులపై అవినీతి నిరోధక చట్టం, భారత శిక్షాస్మృతిలోని నిబంధనల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది.
విచారణకు ఆదేశించిన కాంగ్రెస్ ప్రభుత్వం
అప్పటి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గత ఏడాది నవంబర్లో కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు అనుమతి కూడా ఇచ్చారు. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ పై ప్రాసిక్యూషన్ ను కేంద్రం గత నెలలో క్లియర్ చేసింది. దీంతో ఈ కేసులో ఏసీబీ వేగంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఛార్జీషీట్ ను దాఖలు చేసింది.
ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్… ఏసీబీ ముందు హాజరై విచారణ ఎదుర్కొన్నారు. గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విచారణ చేశారు. 8 నుంచి 10 గంటల పాటు ప్రశ్నించారు. ఇందులో ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్లు, కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్, ఫెనాన్షియల్ రికార్డులను పరిశీలన చేశారు. అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు. ఈ రేస్ లో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంపొందించడానికే ఈ రేసును నిర్వాహించినట్లు తెలిపారు.
ఫార్ములా ఈ రేసు వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసు విచారణ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. కేటీఆర్ ఆరోపణలను ఖండిస్తున్నారు, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని అంటున్నారు.


