
📌 Key Points
- గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
- ప్రభుత్వం విద్యార్థులకు భోజనం అందించాల్సిన అవసరం లేదని గరికపాటి అన్నారు.
- కోడిగుడ్లు ఇవ్వడం అర్థరహితమని, విద్యార్థులు ఇంటి నుండి తెచ్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
- గరికపాటి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం అందించాల్సిన అవసరం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
గరికపాటి నరసింహారావు వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత గౌరవనీయమైన, గొప్ప గుర్తింపు పొందిన వ్యక్తులలో ఒకరు. ఆయన హిందూ ధర్మ విలువలను, అలాగే సాధారణంగా మానవ ప్రవర్తనా విషయాలను బోధించే విధానం చాలా మందికి నచ్చుతుంది. జీవితానికి కావాల్సిన విషయాలను చక్కగా చెబుతుంటారు. ప్రస్తుత తరానికి కూడా అర్థమయ్యేలా.. ఫన్నీగా వివరిస్తారు.
అయితే ఈ తెలుగు పండితుడి తాజా వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. దానిపై అనేకమంది విమర్శలు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి గరికపాటి వివాదాస్పద వైఖరిని వ్యక్తం చేస్తూ కనిపించారు. విద్యార్థులకు ప్రభుత్వం ఇలాంటి భోజనం అందించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
‘విద్యార్థులకు యూనిఫారాలు, పుస్తకాలు, భోజనం అందించడానికి ప్రభుత్వం ఎందుకు డబ్బు ఖర్చు చేయాలి? అంతేకాక, ఈ మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు ఇవ్వడం అర్థరహితమైన నిర్ణయం. ఈ విద్యార్థులు చదువుకోవాలంటే వారి ఇళ్ల నుంచే ఆహారం తెచ్చుకోవాలి. వాళ్లు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు, లేకపోతే వెళ్లిపోవచ్చు. వాళ్లను ఎవరూ ఆపడం లేదు.’ అని గరికపాటి ప్రసంగంలో చెప్పారు.
మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి అభిప్రాయం
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ బాధ్యత కానీ, యూనిఫాంలు, పుస్తకాలు, ఆహారం ఇవ్వడం కాదని గరికపాటి వ్యాఖ్యలు ఉన్నాయి. ‘మీరు విద్యార్థులకు ఇవన్నీ అందిస్తే, వారు శోభనం పెళ్లికొడుకులాగా తయారవుతారు.’ అని కామెంట్స్ చేశారు.
ఈ విషయంలో గరికపాటి తన అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉండవచ్చు. కానీ కొడిగుడ్డు గురించిన వ్యాఖ్యలు, విద్యార్థులకు ప్రాథమిక మధ్యాహ్న భోజనం అందించాల్సిన అవసరాన్ని ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. చాలా మంది గరికపాటిని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం పరిపాలనా విధులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, పాఠశాలల్లోని నిరుపేద విద్యార్థులకు ప్రాథమిక భోజనం అందించడం సమస్య కాదని చాలా మంది అంటున్నారు.
పేదరిక సూచికను పరిగణనలోకి తీసుకుంటే, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను పాఠశాల లకు పంపించగలిగే స్థితిలో లేరని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. యూనిఫాం, ఆహారం, పుస్తకాలను అందించడం ద్వారా అధిక సంఖ్యలో నిరుపేద ప్రజలు తమ పిల్లలను పాఠశాలలకు పంపేలా ప్రోత్సహించవచ్చని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో గరికపాటిపై విమర్శలు
మధ్యాహ్న భోజన పథకంపై తెలుగు పండితుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి అభివర్ణించారు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంపై అలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరానిదని అన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల్లో విద్యార్థుల నమోదును మెరుగుపరచడానికి, డ్రాపౌట్ రేట్లను తగ్గించడానికి ప్రభుత్వాలకు సహాయపడిందని అనేక అధ్యయనాలు చూపించాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పిల్లలు గుడ్ల కోసమే పాఠశాలకు వెళ్తున్నారని, విద్య అర్థరహితంగా మారిందని గరికపాటి చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. మరోవైపు కొందరు గరికపాటి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.
మొత్తానికి గరికపాటి నరసింహారావు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై విభిన్న వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ముందు ముందు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.


