
ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు ‘8 వసంతాలు’ అనే తెలుగు రొమాంటిక్ సినిమాపై అభిప్రాయాలు వెల్లడించారు. ఆయన ప్రశంసలతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.
Key Points
ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి 8 వసంతాలు సినిమాను ప్రశంసించారు.
నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.
సినిమాలోని డైలాగులు, ముఖ్యంగా ఫీమేల్ లీడ్ పాత్ర మాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
8 వసంతాలు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
గరికపాటి ప్రశంసలు వైరల్
ప్రముఖ ప్రపచనకారుడు గరికపాటి నరసింహారావు తెలుసు కదా. తెలుగు రాష్ట్రాల్లో చాగంటి కోటేశ్వరరావుతోపాటు ఈయన కూడా చాలా పాపులర్. అలాంటి ప్రవచనకర్త ఓ తెలుగు రొమాంటిక్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అసలు ప్రేమంటే ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుందని అన్నారు. ఈ సినిమా పేరు 8 వసంతాలు.
గరికపాటి నరసింహారావు ప్రవచనాలను తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఫాలో అవుతారు. తనదైన స్టైల్లో విమర్శలు, ప్రశంసలు చేసే ఆయన ఇప్పుడో తెలుగు సినిమా గురించీ మాట్లాడారు. జూన్ 20న థియేటర్లలో రిలీజైన 8 వసంతాలు సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆ వీడియోను ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ మంగళవారం (సెప్టెంబర్ 16) తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది.
‘8 వసంతాలు’ సినిమా ప్రత్యేకతలు
“8 వసంతాలు సినిమా చూడండి. అసలు ప్రేమంటే ఏంటో తెలుస్తుంది. నేను చూశాను. శారీరక సౌఖ్యాలు, ఒకరి గురించి ఒకరు గొప్పలు చెప్పుకోవడాలు కాదు.. నిజమైన ప్రేమ అంటే ఓ ప్రేమికుడైనా, ప్రేమికులురాలైనా విడిపోయిన తర్వాత కూడా అవతలి వాళ్లు సుఖంగా ఉండాలని కోరుకోవడం” అని ఆ వీడియోలో గరికపాటి చెప్పడం వినొచ్చు.
“8 వసంతాలు మూవీ గురించి మీరు గొప్పగా మాట్లాడినందుకు పద్మశ్రీ గరికపాటి నరసింహారావుకు కృతజ్ఞతలు. మీలాంటి గొప్ప వ్యక్తి మా సినిమా గురించి మాట్లాడటం మాకు గౌరవం. మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ఈ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ షేర్ చేసింది.
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
8 వసంతాలు మూవీ జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనంతిక సనిల్ కుమార్, హను రెడ్డి, రవి దుగ్గిరాల, కన్నా పసుమూరి నటించారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా శుద్ది అనే ఓ యువ రచయిత్రి చుట్టూ తిరుగుతుంది. మ్యాడ్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి.. ఈ 8 వసంతాలు సినిమాతో మంచి పేరు సంపాదించింది.
ఈ సినిమాలో డైలాగులకు చాలా మంది నుంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ఫిమేల్ లీడ్ శుద్ధి పలికే మాటలు ప్రేక్షకులను హత్తుకున్నాయి. ఇదో మంచి ఫీల్ గుడ్ మూవీగా పేరుగాంచింది. జులైలో నెట్‌ఫ్లిక్స్ లోకి మూవీ అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి.
గరికపాటి ప్రశంసలతో ‘8 వసంతాలు’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రేమ గురించి ఆలోచింపజేసే ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ లో చూడండి.


