
📌 Key Points
- అంతర్జాతీయ ఉద్రిక్తతలు గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
- దిగుమతి ఆధారిత దేశాలు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి.
- గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిల వాడకం పెరుగుతోంది, ఇది పర్యావరణానికి హానికరం.
- వాణిజ్య గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో హోటల్ రంగం సంక్షోభంలో ఉంది.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీని ప్రభావం సామాన్య ప్రజల జీవనంపై పడుతోంది. గ్యాస్ కొరత కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అంతర్జాతీయ రాజకీయాల ప్రభావం
అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు సాధారణ ప్రజల రోజువారీ జీవితాలపై ఎంతటి ప్రభావం చూపుతాయో ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఈ మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, మధ్యప్రాచ్య ప్రాంతం ప్రపంచ గ్యాస్, చమురు సరఫరాకు హృదయం లాంటిది కావడంతో అక్కడి అస్థిరత గ్లోబల్ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. ఇరాన్‌పై కొనసాగుతున్న ఆంక్షలు, యుద్ధ వాతావరణం, ముఖ్యంగా సముద్ర మార్గాల్లో భద్రతా సమస్యలు పెరగడం వల్ల చమురు, గ్యాస్ రవాణాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ, దిగుమతులపై ఆధారపడే దేశాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇక ఈ ప్రభావం భారత్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
భారత్ తన అవసరాల కోసం భారీగా LPG, క్రూడ్ ఆయిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో అంతర్జాతీయ ధరల పెరుగుదల నేరుగా దేశీయ మార్కెట్‌పై పడుతోంది. అధికారికంగా గ్యాస్ కొరత లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్ బుకింగ్స్ సరిగా నమోదు కాకపోవడం, బుక్ చేసిన సిలిండర్లు వారం నుంచి పది రోజుల వరకు డెలివరీ కాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు.
గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిల వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ ఇది తాత్కాలిక పరిష్కారమే తప్ప, దీర్ఘకాలికంగా ప్రమాదకరం. అటవీ సంపద తగ్గడం, గాలి కాలుష్యం పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు, నగరాల్లో నివసించే వారికి ఈ మార్గం సాధ్యం కాదు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో ఉండేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ ఇండెక్షన్ స్టౌవ్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే చిన్న కుటుంబాలు వీటితో కొంతవరకు సర్దుబాటు చేసుకుంటున్నప్పటికీ, పెద్ద కుటుంబాలకు ఇది పూర్తి స్థాయి పరిష్కారం కాదు.
భారత్‌లో గ్యాస్ కొరత పరిస్థితులు
ఇక హోటల్ రంగం కూడా ఈ గ్యాస్ సంక్షోభం నుంచి తప్పించుకోలేకపోతోంది. ఇప్పటికే ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సప్లైని నిలిపివేసింది. దీంతో కొన్ని హోటళ్లు కట్టెల పొయ్యిలతో కొనసాగుతుండగా, మరికొన్ని గ్యాస్ సరఫరా లోపం కారణంగా తాత్కాలికంగా మూతపడాల్సి వస్తోంది. దీనివల్ల ఉద్యోగాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలపై దృష్టి సారించడం అత్యవసరంగా మారింది. అందులో ముఖ్యంగా ఇంటి వద్దే బయోగ్యాస్ తయారీ ఒక సరళమైన, పర్యావరణ హితమైన పరిష్కారంగా ముందుకు వస్తోంది.
ఈ బయోగ్యాస్ అనేది కూరగాయల తొక్కలు, మిగిలిన ఆహారం, పశువుల చెత్త వంటి ఆర్గానిక్ పదార్థాలు ఆక్సిజన్ లేకుండా కరిగినప్పుడు ఉత్పత్తి అయ్యే గ్యాస్. ఇందులో ప్రధానంగా మెథేన్, కార్బన్ డయాక్సైడ్ ఉంటాయి. మన ఇంట్లో ప్రతిరోజూ వచ్చే కూరగాయల తొక్కలు, మిగిలిన ఆహారం వంటి తడి చెత్తను ఉపయోగించి ఈ గ్యాస్ తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం చెత్త సమస్యను తగ్గించడమే కాకుండా, వంటకు అవసరమైన ఇంధనాన్ని కూడా అందిస్తుంది. అంతేకాదు, బయోగ్యాస్ తయారీ ప్రక్రియ కూడా చాలా సులభం. పైగా పెద్దగా ఖర్చు అవసరం లేదు.
ఇక బయో గ్యాస్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక ఎయిర్‌టైట్ ప్లాస్టిక్ డ్రమ్ లేదా ట్యాంక్‌ను తీసుకుని, దానికి రెండు పైపులు అమర్చాలి. ఒకటి తడి చెత్త వేసేందుకు ఇన్‌లెట్‌గా, మరొకటి గ్యాస్ బయటకు వచ్చే అవుట్‌లెట్‌గా ఉపయోగపడుతుంది. కిచెన్‌లో వచ్చే కూరగాయల తొక్కలు, మిగిలిన ఆహారాన్ని నీటితో కలిపి మిశ్రమంగా తయారు చేసి ఇన్‌లెట్ పైపు ద్వారా ట్యాంక్‌లో వేయాలి. ట్యాంక్‌ను గాలి లోపలికి వెళ్లకుండా బాగా మూసివేస్తే, కొన్ని రోజుల్లోనే ఫెర్మెంటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాధారణంగా 15 నుంచి 30 రోజులలో గ్యాస్ ఉత్పత్తి స్థిరంగా మొదలవుతుంది. ఇక అవుట్‌లెట్ పైపు ద్వారా వచ్చే ఈ గ్యాస్‌ను సేకరించి వంటకు ఉపయోగించవచ్చు. ఇలా ఇంట్లోనే బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా గ్యాస్ ఖర్చులు తగ్గడంతో పాటు, చెత్త నిర్వహణ సమస్య కూడా తగ్గుతుంది.
ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
బయోగ్యాస్ తయారీలో జాగ్రత్తలు
అయితే, ఇంట్లో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన అవసరాలను తీర్చుకోవడం సాధ్యమవుతున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. మొదటగా, బయోగ్యాస్ ట్యాంక్ పూర్తిగా ఎయిర్‌టైట్‌గా ఉండాలి. గాలి లోపలికి ప్రవేశిస్తే అనీరోబిక్ ప్రక్రియ సరిగ్గా జరగదు. దీంతో గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే ట్యాంక్‌లో ప్లాస్టిక్, లోహాలు లేదా ఇతర నాన్-బయోడిగ్రేడబుల్ పదార్థాలు వేయకూడదు. అధిక నూనె, ఉప్పు లేదా రసాయనాలు ఉన్న ఆహార మిగతాలను తగ్గించాలి. ఇవి సూక్ష్మజీవుల పనితీరును ప్రభావితం చేస్తాయి. అలాగే, ట్యాంక్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ గ్యాస్ లీకేజీ లేదని నిర్ధారించుకోవాలి. గ్యాస్ నిల్వ చేసే బ్యాగ్ లేదా పైపులు బలంగా, సురక్షితంగా ఉండాలి. ప్లాంట్‌ను ఎండలో కాకుండా నీడ ప్రదేశంలో ఏర్పాటు చేయడం మంచిది. పిల్లలు లేదా జంతువులు దానికి దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్‌ను ఉపయోగించే సమయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి.
ప్రస్తుత గ్యాస్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఇలాంటి స్వయం సమృద్ధి పరిష్కారాలు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. పర్యావరణాన్ని కాపాడుతూ, ఇంటి అవసరాలను తీర్చుకునే ఈ విధానం ప్రజల్లో అవగాహన పెరిగితే, ఇది ఒక చిన్న మార్పు కాదు.. ఒక పెద్ద ఉద్యమంగా మారే అవకాశముంది. అంతేకాదు, ఇది వేస్ట్ టు వెల్త్ సూత్రానికి మంచి ఉదాహరణ.
గ్యాస్ సంక్షోభం తాత్కాలిక సమస్య కాదు. దీనికి దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాలి.


