
📌 Key Points
- SIR ప్రక్రియను ఈసీ ప్రక్షాళనగా, ప్రతిపక్షాలు రాజకీయ కుట్రగా భావిస్తున్నాయి.
- DSE, PSE, De-Duplication సాఫ్ట్‌వేర్‌లతో అధునాతన సాంకేతిక వినియోగం జరుగుతోంది.
- తమిళనాడులో 74 లక్షల ‘ఘోస్ట్ ఓటర్ల’ తొలగింపుతో 11.5% ఓటర్ల సంఖ్య తగ్గింది.
- దక్షిణాది రాష్ట్రాలపై SIR ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.
భారత ఎన్నికల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన (SIR) ప్రక్రియ తీవ్ర చర్చకు దారితీసింది. ఈసీ దీనిని శాస్త్రీయ సవరణగా చెబుతుండగా, ప్రతిపక్షాలు రాజకీయ కుట్రగా ఆరోపిస్తున్నాయి. అధునాతన సాంకేతికతతో కూడిన ఈ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలిద్దాం.
SIR: ఈసీ వాదన vs ప్రతిపక్షాల ఆరోపణలు
భారత ఎన్నికల్లో ఓటర్ల జాబితా కేవలం పరిపాలనా అంశం కాదు.. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కీలక వ్యవస్థ. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న Special Intensive Revision (SIR) రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈసీ ఈ ప్రక్రియను ఓటర్ల జాబితా ప్రక్షాళనగా చెబుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ ఉద్దేశాలతో చేపడుతున్న ప్రక్రియగా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్ వెనుక ఉన్న శాస్త్రీయ విధానాలు, గణాంకాలు, దక్షిణాది రాష్ట్రాలపై దీని ప్రభావాన్ని పరిశీలించడం అవసరం.
సర్ లక్ష్యం డూప్లికేట్, మరణించిన, శాశ్వతంగా వేరే చోటుకు వెళ్లిన లేదా అనర్హులైన పేర్లను తొలగించి, అర్హులైన ప్రతి పౌరుడిని జాబితాలో చేర్చడం అని ఎన్నికల సంఘం చెబుతుంది. కానీ ప్రతిపక్షం మాత్రం బీజేపీ చేతిలో ఎన్నికల సంఘం పావుగా మారిపోయి బీజేపీ వ్యతిరేకుల ఓట్లను తీసేయడానికే చేస్తున్న మహా ప్రయత్నం అంటూ మండిపడుతుంది. దక్షిణాది రాష్ట్రాలలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నికల సంఘం, సర్ ప్రక్రియలో ఈ సారి కేవలం భౌతిక తనిఖీలపైనే ఆధారపడకుండా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓటర్ల జాబితాను స్కాన్ చేస్తోంది. దీనికోసం ప్రధానంగా మూడు పద్ధతులను వాడుతున్నారు. Demographically Similar Entries (DSEs) అంటే ఒకే పేరు, ఒకే తండ్రి/భర్త పేరు, ఒకే వయస్సు ఉన్న ఓటర్లను ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుంది. Photo Similar Entries (PSEs) అనగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వేర్వేరు నియోజక వర్గాల్లో లేదా ఒకే నియోజకవర్గంలో వేర్వేరు బూత్‌లలో ఉన్న ఒకే వ్యక్తి ఫోటోలను ఐడెంటిఫై చేస్తుంది. De-Duplication Software ఆధార్ కార్డ్ లింకేజ్ (స్వచ్ఛందంగా జరిగిన చోట) రేషన్ కార్డ్/సివిల్ సప్లైస్ డేటాబేస్‌లతో క్రాస్-వెరిఫికేషన్ చేయడం ద్వారా స్వచ్ఛత ఉంటుందని తటస్థులు ఆశిస్తున్నారు.
ఓటర్ల జాబితా ప్రక్షాళనలో సాంకేతికత
రెండో దశ, ప్రస్తుతం జరుగుతున్న మూడో దశ ఆధారంగా సేకరించిన శాస్త్రీయ గణాంకాల్లో తమిళ నాడులో ‘ఘోస్ట్ ఓటర్ల’ను భారీగా తొలగించారు. సవరణకు ముందు ఓటర్ల సంఖ్య 6.41 కోట్లు. సవరణ తర్వాత ~5.67 కోట్లు, తొలగింపు శాతం -11.5%. వలసల కారణంగా పాత నియోజకవర్గాల్లో ఓట్లు అలాగే ఉండిపోతే PSE సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తించి, దాదాపు 74 లక్షల ఓట్లను తొలగించారు. దీనివల్ల రాష్ట్ర సగటు, జాతీయ సగటుకు సమానంగా వచ్చింది. అలాగే కేరళలో సవరణకు ముందు ~2.78 కోట్లు. సవరణ తర్వాత ~2.69 కోట్లు. తొలగింపు శాతం-3.24% (సుమారు 9 లక్షల ఓట్లు). కేరళలో ‘అక్షరాస్యతతో పాటు పౌర అవగాహన’ ఎక్కువ ఉండటం వల్ల స్థానికంగానే ఓటర్లు మార్పులు చేసుకుంటారు. అయితే ఇక్కడ జరిగిన తొలగింపుల్లో అత్యధికం గల్ఫ్ దేశాలకు, ఇతర రాష్ట్రాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారివే, అయినప్పటికీ పై రెండు రాష్ట్రాల్లో తమ ఓట్ల తొలగించారనే ఫిర్యాదులు అందకపోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం.
జూన్ 2026 సర్వే ప్రాథమిక డేటా ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో ఎలక్టోరల్ రోల్స్‌లో పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్, ఏపీ సరిహద్దు జిల్లాల్లో ఉన్న ఉమ్మడి/డూప్లికేట్ ఓట్లను రెండు రాష్ట్రాల CEOs సమన్వయంతో తొలగిస్తున్నారు. దీంతో ఒక వ్యక్తికి ఒకే రాష్ట్రంలో మాత్రమే ఓటు ఉంటుంది. ఇది హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాల్లో పొలిటికల్ మైలేజ్‌ను డిసైడ్ చేస్తుంది. శాస్త్రీయ కోణంలో చూస్తే, SIR అనేది ఎలక్టోరల్ మ్యాథమెటిక్స్‌ను రీ-సెట్ చేస్తోంది. బోగస్ ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్యానికి మేలు చేసినా, అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగిపోకుండా ప్రజలు జూలై 27లోపు తమ ఓటు వివరాలను VHA యాప్ లేదా NVSP పోర్టల్‌లో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి.
దక్షిణాది రాష్ట్రాలపై SIR ప్రభావం
సర్ ప్రభావం కేవలం సంఖ్యలకే పరిమితం కాదు. ఇది ఎన్నికల ఫలితాల సరళిని మార్చగలదు. గతంలో 100 మంది ఓటర్లు ఉన్న బూత్‌లో 20 ఓట్లు నకిలీవి లేదా వలస వెళ్లిన వారివి ఉంటే, గరిష్టంగా 80 ఓట్లు మాత్రమే పోల్ అయ్యేవి. అంటే అక్కడ పోలింగ్ శాతం 80%గా చూపేది. సర్ తర్వాత ఆ 20 నకిలీ ఓట్లను తొలగిస్తే, మొత్తం ఓటర్ల సంఖ్య 80 అవుతుంది. ఇప్పుడు ఆ 80 మంది ఓటు వేస్తే పోలింగ్ శాతం 100% అవుతుంది. దీనివల్ల ఎన్నికల సంఘం ఆశించే “నిజమైన ఓటింగ్ సరళి” బయటపడుతుంది. అక్రమ ఓటింగ్ పూర్తిగా అదుపులోకి వస్తుంది. ‘మార్జిన్ ఆఫ్ విక్టరీ’ పై ప్రభావం అనగా దక్షి ణాదిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో అనేక అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటముల మార్జిన్ చాలా తక్కువగా (500 నుండి 3,000 ఓట్ల లోపు) ఉంటుంది. ఒక నియోజకవర్గంలో సగటున 15,000 నుండి 20,000 డూప్లికేట్ ఓట్లు తొలగించబడితే, అది సాంప్రదాయకంగా ఒక నిర్దిష్ట పార్టీకి ఉన్న “క్యాప్టివ్ ఓట్ బ్యాంక్”ను దెబ్బతీస్తుంది. నకిలీ ఓట్లపై ఆధారపడే స్థానిక నాయకుల గెలుపు అవకాశాలు తలకిందులవుతాయి.
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం
SIR ప్రక్రియ ఓటర్ల జాబితా స్వచ్ఛతకు అవసరమైనప్పటికీ, దాని అమలు తీరుపై రాజకీయ దుమారం రేగుతోంది. శాస్త్రీయ పద్ధతులు, సాంకేతికత వినియోగంపై పూర్తి పారదర్శకత అవసరం. ఇది ఎన్నికల ఫలితాలపై గణనీయ ప్రభావం చూపవచ్చు.


