|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అడవిలో ‘హనుమాన్’ అభయం: వన్యప్రాణుల రక్షణకు పవన్ కళ్యాణ్ సంకల్పం!

Published: 03-03-2026, 9:05 AM
అడవిలో 'హనుమాన్' అభయం: వన్యప్రాణుల రక్షణకు పవన్ కళ్యాణ్ సంకల్పం!
  • వన్యప్రాణుల సంరక్షణ కోసం ‘హనుమాన్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
  • అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రజల రక్షణకు 100 ప్రత్యేక రెస్క్యూ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.
  • మానవ-వన్యప్రాణి సంఘర్షణ నివారణకు సాంకేతిక, శాస్త్రీయ కార్యక్రమం ‘హనుమాన్’.
  • గ్రామ స్థాయిలో వన్య జీవి రక్షక్ (వజ్ర)లను నియమించి రెస్క్యూ కిట్లు అందజేత.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వన్యప్రాణుల సంరక్షణ కోసం ‘హనుమాన్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రజల రక్షణ కోసం 100 ప్రత్యేక రెస్క్యూ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యత చాలా ముఖ్యమని అన్నారు.

హనుమాన్ ప్రాజెక్ట్ ప్రారంభించిన పవన్ కల్యాణ్

మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత, వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్ట్(హీలింగ్ అండ్ నర్చూరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్) ముందుకు తీసుకొచ్చామన్నారు. ఇటీవల కాలంలో వన్య ప్రాణుల వల్ల పంట, పశు సంపదకి నష్టంతోపాటు మావన భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు పెరుగుతున్నందున ఈ నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో హనుమాన్ పేరుతో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. వీటిలో వన్య ప్రాణుల సంరక్షణతోపాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అంబులెన్స్, రెస్క్యూ వాహనాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

‘హనుమాన్ ప్రాజెక్ట్ మానవ-వన్యప్రాణి మధ్య ఉన్న సంఘర్షణను నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకువెళ్లబోతున్నాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ చేపట్టేలా హనుమాన్ ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు తక్షణ ప్రతిస్పందన, ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వర్తిస్తుంది. పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతోపాటు ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ అటవీశాఖ హనుమాన్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తుంది.’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక రెస్క్యూ వాహనాలు

ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్ (గిరిజన), పారా వెటరేనియన్స్ తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. గ్రామ స్థాయిలో వన్య జీవి రక్షక్ (వజ్ర)లను అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నామన్నారు. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తున్నామని వెల్లడించారు. గ్రామస్థాయిలో పాములు, ఇతర జంతువుల నుంచి ఎదురయ్యే సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇచ్చామన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ- వన్యప్రాణి సంఘర్షణలో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహారం కూడా చెల్లించేస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం. 2025-2026 ఆర్ధిక సంవత్సరంలో ఈ తరహా కేసులు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,107 వరకు నమోదు కాగా పరిహారం కింద దాదాపు రూ. 4 కోట్లు చెల్లించామన్నారు. జంతువుల దాడిలో మనిషి చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. గాయపడిన వారికి ఇచ్చే పరిహారం రూ.2 లక్షలు చేశామని తెలిపారు. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.

మానవ-వన్యప్రాణి సంఘర్షణ నివారణకు చర్యలు

‘వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో జంతువులు వచ్చే ముందు ముందస్తు హెచ్చరికలు ఇచ్చే విధంగా అలర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. వన్యప్రాణుల వల్ల మానవ భద్రతకు ముప్పు కలగకుండా హనుమాన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్ట్ కోసం అటవీశాఖ అధికారులు, ఫ్రంట్ లైన్ సిబ్బంది ఎంతో అంకితభావంతో కష్టపడి పని చేశారు.’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

వన్యప్రాణులు గాయపడిన సందర్భాల్లో వాటిని తరలించేందుకు వీలుగా పూర్తి స్థాయి సౌకర్యాలతో వాహనాల ను సిద్ధం చేశారు. వీటితోపాటు స్పాట్‌లో చికిత్స అందించేందుకు వీలుగా ఆంబులెన్స్‌లు, కాంపా వాహనాలు ఉన్నాయి. హనుమాన్ డిజిటల్ యాప్, అధునాతన సాంకేతికతతో అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం తీసుకువచ్చింది ప్రభుత్వం.

మొత్తానికి, హనుమాన్ ప్రాజెక్ట్ ద్వారా అటవీశాఖ వన్యప్రాణులను సంరక్షిస్తూనే ప్రజలకు రక్షణ కల్పించడానికి కృషి చేస్తుంది. ఇది మానవ మనుగడకు, ప్రకృతి సమతుల్యతకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.