
📌 Key Points
- హార్ముజ్ జలసంధి గుండా రోజుకు 20 మిలియన్ బ్యారెల్స్ చమురు రవాణా అవుతుంది.
- ప్రపంచ చమురు వినియోగంలో 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది.
- చైనా, భారత్ వంటి ఆసియా దేశాలు ఈ మార్గంపై ఎక్కువగా ఆధారపడతాయి.
- హార్ముజ్ మూసివేతతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
హార్ముజ్ జలసంధి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది ప్రపంచంలోని ప్రధాన చమురు రవాణా మార్గం. దీని మూసివేత చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
హార్ముజ్ జలసంధి ప్రాముఖ్యత
హార్ముజ్ సముద్ర మార్గం (జల సంధి) ప్రపంచంలో అతి ముఖ్యమైన జలమార్గాల్లో ఒకటి. ఇరాన్ ఉత్తర భాగంలో, ఒమన్ దక్షిణ భాగంలో ఉంది. పర్షియా గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలిపే ఇరుకైన మార్గం. అత్యంత ఇరుకైన చోట కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఇది ఒక చిన్న మార్గం కావడం వల్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ‘గొంతు’ లాంటిది. ఏ చిన్న అడ్డంకి వచ్చినా ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి..
ఇప్పుడు జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత మార్చి 2న ఈ మార్గం మూసివేస్తున్నామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఏ ఓడ ఈ మార్గం నుండి వెళ్లినా దాడి చేస్తామని హెచ్చరించింది. ఫలితం.. వాణిజ్య ఓడలు ఆగిపోయాయి. పెద్ద షిప్పింగ్ కంపెనీలు రవాణా ఆపేశాయి. ట్యాంకర్లు దాదాపు జీరోకి తగ్గాయి. కొన్ని ట్యాంకర్లపై దాడులు జరిగి 5కి పైగా ఓడలు దెబ్బ తిన్నాయి. 150కి పైగా ఓడలు ఆగిపోయాయి. హార్మోజ్ జల సంధి వాస్తవంగా మూసివేయబడింది.
ప్రతి రోజూ సుమారు 20 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు, ఇతర ఇంధనాలు ఈ మార్గం గుండా ప్రపంచానికి వెళ్తాయి. ఇది ప్రపంచ మొత్తం చమురు వినియోగంలో సుమారు 20 శాతానికి సమానం. సముద్ర మార్గంలో వచ్చే చమురులో 25-30 శాతం ఇక్కడి నుంచే వస్తుంది. ద్రవ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ)లో కూడా సుమారు 20 శాతం ఈ మార్గం గుండా వెళ్తుంది. గల్ఫ్ దేశాలు – సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్, ఇరాన్ – వీటి చమురు ఎగుమతులు దాదాపు అన్నీ ఇక్కడి గుండానే వెళ్తాయి. ఆసియా దేశాలు ఎక్కువగా ఈ మార్గంపై ఆధారపడతాయి. చైనా అత్యధికం, ఆ తర్వాత భారత్, జపాన్, దక్షిణ కొరియా. ఈ మార్గం ద్వారా వెళ్లే చమురులో 84 శాతం ఆసియాకు వెళ్తుంది. ఇరాన్ ఉత్తర భాగాన్ని నియంత్రిస్తుంది కాబట్టి దాడి చేసి లేదా హెచ్చరించి మార్గాన్ని నియంత్రించగలదు. ఇది ఇరాన్‌కు పెద్ద వ్యూహాత్మక ఆయుధం. గతంలో కూడా ఇరాన్ ఇలాంటి హెచ్చరికలు చేసింది. కానీ ఈసారి అమలు చేసింది. దీని వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ తగులుతోంది. చమురు ధరలు ఇప్పటికే 7 నుంచి 13 శాతం పెరిగాయి. $100కి చేరే అవకాశం ఉంది.
మూసివేత ప్రభావం
మన దేశం 85-90 శాతం చమురు విదేశాల నుంచి తీసుకుంటుంది. అందులో సగం కంటే ఎక్కువ (సుమారు 50 శాతం) ఈ మార్గం గుండా వస్తుంది. రోజుకు 1.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెల్స్. ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచి వచ్చే నూనె దాదాపు అన్నీ ఇక్కడి గుండానే.. దీంతో పాటు వంట గ్యాస్ (ఎల్‌పీజీ)లో 85 శాతం, ద్రవ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ)లో 55 శాతం ఈ మార్గం గుండా వస్తాయి.. ఈ మార్గం మూసివేత కొనసాగితే మన చమురు స్టాక్ కేవలం 40-45 రోజులకు సరిపోతుంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు భారంగా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుల జీవన ఖర్చు ఎక్కువవుతుంది. రూపాయి విలువ తగ్గుతుంది. వాణిజ్య లోటు పెరుగు తుంది. ఇది కేవలం చమురు సమస్యే కాదు. ఎగుమతులు ఆలస్యమవుతాయి. షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి. గల్ఫ్‌లో పని చేసే 90 లక్షల మంది మనవాళ్ల భద్రత, సంపాదన ప్రమాదంలో పడతాయి. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడి పడుతుంది.
ఇరాన్‌కు ఇది ఏకైక ఆయుధం. అణు శక్తి, సైనిక బలం తక్కువైనా ఈ మార్గంతో ప్రపంచాన్ని బెదిరించగలదు. అమెరికా నావల్ ఫోర్సెస్ ట్యాంకర్లను రక్షించడానికి సిద్ధమవుతున్నాయి కానీ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉంది. ఇలాంటి చోక్‌పాయింట్లు (ఇరుకైన మార్గాలు) ఎంత బలహీనమైన దేశానికైనా పెద్ద శక్తిని ఇస్తాయని ఇది నిరూపిస్తోంది. అందుకే భారత్ తక్షణం రష్యా నుంచి చమురు ఎక్కువ దిగుమతి చేసుకోవడం ఒక ప్రత్యామ్నాయం. మన వ్యూహాత్మక చమురు నిల్వలను (SPR) ఉపయోగించాలి. దీర్ఘకాలంలో చమురు దిగుమతులను వైవిధ్య పరచాలి. సౌర శక్తి, గాలి శక్తి వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.. ఇరాన్ యుద్ధం మనకు ఒక పెద్ద హెచ్చరిక – ఎనర్జీ భద్రతను స్వయం సమృద్ధిగా మార్చుకోవాలి.
భారతదేశంపై పర్యవసానాలు
హార్ముజ్ సముద్ర మార్గం మూసివేత ప్రపంచానికి పెద్ద సంక్షోభం తెచ్చింది. భారత్ వంటి దేశాలు ఇంధన ధరల పెరుగుదలతో ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం అంచుకు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఐక్య రాజ్యసమితి ద్వారా తక్షణం సంభాషణలు జరిపి యుద్ధాన్ని ఆపాలి. ఈ మార్గం తెరవాలి. యుద్ధం కొనసాగితే ప్రపంచమంతా నష్టపోతుంది. శాంతి, సంభాషణలు, దౌత్యం ద్వారా మాత్రమే ఈ సంక్షోభాన్ని అధిగమించాలి. భారత్ ఈ విషయంలో నాయకత్వం వహించాలి!
-కాలగిరి శ్రీనివాస్ రెడ్డి,
హార్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాలుగా మారే అవకాశం ఉంది. చమురు ధరల పెరుగుదల సామాన్యులపై ప్రభావం చూపుతుంది. దీని పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు దృష్టి సారించాలి.


