|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒక్క అవమానం.. ఒక దేశాన్ని ఎలా మార్చిందో తెలుసా? చరిత్ర సృష్టించిన ‘ముష్టివాళ్ల’ విప్లవం!

Published: 23-06-2026, 11:58 PM
ఒక్క అవమానం.. ఒక దేశాన్ని ఎలా మార్చిందో తెలుసా? చరిత్ర సృష్టించిన 'ముష్టివాళ్ల' విప్లవం!
  • అవమానం సమాజాలను కదిలించి, ఉద్యమాలకు దారితీస్తుందని చరిత్ర చెబుతోంది.
  • సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఏర్పడిన “కాక్రోచ్ పార్టీ” ఈ పరిణామానికి తాజా ఉదాహరణ.
  • 16వ శతాబ్దంలో నెదర్లాండ్స్ కులీనులను ‘ముష్టివాళ్లు’ అనడం డచ్ స్వాతంత్ర్యానికి దారితీసింది.
  • స్పెయిన్ రాజు ఫిలిప్ నిరంకుశ పాలన, మత వివక్ష, అధిక పన్నులు తిరుగుబాటుకు కారణమయ్యాయి.

ఒక చిన్న అవమానం ఎలా పెను విప్లవానికి దారితీస్తుందో ఈ కథనం వివరిస్తుంది. ఇటీవల ‘కాక్రోచ్ పార్టీ’ ఉదాహరణతో పాటు, 16వ శతాబ్దంలో నెదర్లాండ్స్‌లో జరిగిన చారిత్రక సంఘటనను విశ్లేషిస్తుంది. పాలకులు ప్రజలను ‘ముష్టివాళ్లు’ అని సంబోధించడం డచ్ స్వాతంత్ర్యానికి ఎలా కారణమైందో తెలుసుకుందాం.

అవమానం నుండి ఉద్యమం: ‘కాక్రోచ్ పార్టీ’ నేపథ్యం

అవమానం కొన్నిసార్లు వ్యక్తులను మాత్రమే కాదు, సమాజాలను కూడా కదిలిస్తుంది. చరిత్రలో అవహేళనకు గురైన వర్గాలు అదే అవమానాన్ని ఆయుధంగా మార్చుకుని ఉద్యమాలు నిర్మించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల యువతరం పనీ పాటా లేని బొద్దింకల్లా, పరాన్నభుక్కుల్లా ఉన్నార’ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన అవహేళన నేపథ్యంలో ఏర్పడిన “కాక్రోచ్ పార్టీ” కూడా అలాంటి పరిణామాలనే గుర్తుకు తెస్తోంది.

ఈ ప్రత్యేక సందర్భం యూరప్ చరిత్రలో జరిగిన ఒకానొక ఘటనను గుర్తుకు తెస్తున్నది. వినతి పత్రం ఇవ్వ డానికి వచ్చిన కులీనులను, వారి నాయకత్వంలోని ప్రజలను పాలకులు ‘ముష్టివాళ్ల’ని సంభోదించారు. బాధ, అక్రోషం, ఆవేశంతో వారు తాము ముష్టివాళ్ల సైన్యం అని పిలుచు కోవడానికి నడుం బిగించారు. ఆ క్రమంలో కొనసాగిన ఉద్యమం చివరకు ప్రభుత్వాన్ని పడిపోయేంత స్థాయిలో జరిగి “డచ్”ను స్వతంత్ర దేశంగా ప్రకటించే పరిస్థితిని కల్పించింది.

డచ్ విప్లవానికి నాంది: స్పెయిన్ పాలనలో నెదర్లాండ్స్

నెదర్లాండ్స్‌లో 16వ శతాబ్దంలో నాటి స్పెయిన్ రెండో ఫిలిప్ పాలనలో ఉండేది. ప్రభువు ఫిలిప్ ఇటు పాలనాధికారాన్నీ దుర్వినియోగం చేస్తూ, నిరంకుశంగా మతాధికారాన్ని చెలాయించ సాగాడు. కులీన, వర్తక వర్గాల అధికారాల్లో కోత విధించి, కేంద్రీకృత అధికారాన్ని చలాయించ సాగాడు. ప్రజల అసంతృప్తిని అడ్డుకోవడానికి “స్పానిష్ సైన్యాన్ని” వినియోగించడం ప్రారంభించాడు. పరిపాలనా అధికారాల న్నింటిలో స్థానికులను తొలగించాడు. స్పానిష్ వారికే ఉన్నత పదవులు కట్టబెట్టాడు. ఆ నాటికే నెదర్లాండ్స్ ఉత్తరాది రాష్ట్రాలలో ప్రాచుర్యం పొందిన ప్రొటెస్టంట్ మత భావాలను అణచివేసి కాథలిజాన్ని ఏకైక మతంగా స్థాపించాలని ప్రయత్నించాడు. ‘ఒకే దేశం, ఒకే మతం’ వంటి నినాదాలు ప్రచారం‌లోకి తెచ్చాడు. ప్రజల మీద వివిధ రూపాల్లో రకాల పన్నులు విధించి, వచ్చిన సొమ్మును స్పెయిన్‌లో, తన సామ్రాజ్యంలోని పలు ప్రాంతాలలో వినియోగించడం మొదలు పెట్టాడు. ఈ విధమైన పాలనతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ప్రజలలో అసంతృప్తి పెరిగి పోయింది. 1566 ఏప్రిల్‌లో 400 మంది నెదర్లాండ్స్ కులీనులు, వ్యాపారులు, సామూహిక పెద్దలు సమావేశమై, తమ సమస్యలపై రాజుకు ఒక విజ్ఞప్తి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వారు సామంత ప్రభువైన మార్గరెట్ ఆఫ్ పర్మాను కలవడానికి అనుమతి తీసుకొని, తాము తయారు చేసుకున్న వినతి పత్రం తీసుకొని వెళ్లారు.

చిన్న ప్రతినిధి వర్గం వస్తుందనుకున్న సామంత రాణి రిజెంట్ మార్గరెట్ వచ్చిన నాలుగు వందల మందిని చూసి ఆందోళనకు గురయ్యారు. ఆ సందర్భంలో ఆమె సలహా దారులలో ఒకరైన బెర్లేమోంట్, ‘భయపడాల్సిన పనిలేదు మహారాణీ, వాళ్లు కేవలం ముష్టివాళ్లు’ అని వివరించాడు. ఈ పదం వారిని బాగా బాధించింది. ఆత్మగౌరవం దెబ్బ తినెలా చేసింది. తమకు జరిగిన అవమానాన్ని తమ పతాకగా, తిరుగుబాటుగా మార్చుకున్నారు. కొద్దిరోజుల తర్వాత వినతి పత్రంలో సంతకందారులు అంతా కలిసి ఒక సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఒక విందు ఏర్పాటు చేసుకుని, ‘మనం అంతా ముష్టివాళ్లమే.. దేశ ప్రయోజనాల రక్షణ కోసం పార్టీ ప్రకటించుకున్నారు. ఆ పార్టీ పేరే ‘లీగ్ ఆఫ్ బెగ్గర్స్’. బిచ్చగాళ్ల చిహ్నాలైన జోలె, చిప్ప వంటివి తమ పార్టీ చిహ్నాలుగా ప్రకటించుకున్నారు. అవహేళన నుంచి, అవమానం నుంచి పుట్టిన ప్రతీకార భావాలు, సాయుధ పోరాటానికి బీజాలయ్యాయి. తర్వాతి కాలంలో 1588లో స్పెయిన్ నుంచి విడిపోయి స్వతంత్ర డచ్ రిపబ్లిక్ స్థాపనకు దారులు తీశాయి.

‘ముష్టివాళ్ల’ తిరుగుబాటు: స్వాతంత్ర్యం వైపు అడుగులు

నేపాల్‌లో జెన్ జీ పాలన మొదలైంది. కాక్రోచ్ పార్టీకి ఎన్నికల ప్రణాళిక లేదు. కాక్రోచ్ పార్టీ మాత్రం కేవలం నీట్ పరీక్ష రద్దుకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలని ఆందోళనకు దిగుతోంది. పైగా సమస్యలపైనే రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఉద్యమాలు చేస్తామని ప్రకటిస్తున్నది. ప్రస్తుతం రాజ్యాధికారం దిశగా అడుగులు పడటం లేదు కాబట్టి పాలకులు పెద్దగా ఆందోళన పడవలసిన పనిలేదు. అయితే కాక్రోచ్ పార్టీ ఉద్యమాలకే పరిమితం అవుతుందా? అవినీతిపై పోరాటం అంటూ ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీలాగా అధికారం కోసం పావులు కదులుతుందా? స్పైయిన్‌పై తిరుగుబాటు చేసి డచ్ రిపబ్లిక్ సాధించుకున్నట్లు పోరాటం చేసే స్థాయికి వెళుతుందా? భవిష్యత్ ఏ రూపు తీసుకుంటుందో ఇప్పుడే ఏమి చేప్పలేని స్థితి. అయితే అతి తక్కువ కాలంలో ఇంత పెద్దఎత్తున ప్రచారం జరిగి ఉద్యమంగా విస్తరించడంతో పలు రకాల అనుమానాలు, సందేహాలతో పాటు కూసింత ఆశ కలగుతుంది. ఏం జరుగుతుందనేది మాత్రం రాబోయే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, అది ప్రభుత్వాల పతనానికి దారితీస్తుందని చరిత్ర చెబుతుంది. అవమానం నుండి పుట్టిన ఉద్యమాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో ఈ కథనం స్పష్టం చేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.