|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైదరాబాద్ ఉద్యోగులకు భారీ ఊరట! ఏప్రిల్ నుండి జీతాలు ఇక పైపైకి! కారణం ఇదే!

Published: 30-03-2026, 4:35 AM
హైదరాబాద్ ఉద్యోగులకు భారీ ఊరట! ఏప్రిల్ నుండి జీతాలు ఇక పైపైకి! కారణం ఇదే!
  • హైదరాబాద్‌లో హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు 50%కి పెంచడం వల్ల జీతం పెరిగే అవకాశం.
  • పాత పన్ను విధానంలో మాత్రమే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.
  • ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.
  • హెచ్‌ఆర్‌ఏతో పాటు ఇతర సెక్షన్ల కింద మినహాయింపులు పొందవచ్చు.

హైదరాబాద్, పూణె, బెంగళూరు వంటి నగరాల్లోని ఉద్యోగులకు ఇది శుభవార్త. ఏప్రిల్ 1 నుండి హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు 50%కి పెంచడం వల్ల టేక్-హోమ్ శాలరీ పెరిగే అవకాశం ఉంది. పాత పన్ను విధానంలో ఇది వర్తిస్తుంది.

హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పెంపుదల

భారతదేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్, బెంగళూరులలో నివసించే ఉద్యోగులకు ఆదాయపు పన్ను పరంగా గొప్ప వార్త అందింది. ఈ నగరాల్లో హెచ్‌ఆర్‌ఏ (హౌస్​ రెంట్​ అలొవెన్స్​) మినహాయింపు పరిమితిని 50 శాతానికి విస్తరించడం వల్ల, ముఖ్యంగా ఇంతకుముందు 40% పరిమితి వల్ల నష్టపోయిన వారికి ఇప్పుడు చేతికి వచ్చే జీతం పెరగనుంది! అయితే, ఈ ప్రయోజనం కేవలం పాత పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి, పన్ను చెల్లింపుదారులు రెండు విధానాలను జాగ్రత్తగా పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

ఒక ఉదాహరణ తీసుకుని దీనిని అర్థం చేసుకుందాము. హైదరాబాద్‌ లో మధ్యస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రియా బనిక్.. భారీగా అద్దె చెల్లిస్తోంది. ఆమె పొందే హెచ్‌ఆర్‌ఏ ఆమె ప్రాథమిక వేతనంలో దాదాపు సగం ఉంటుంది. కాగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే 50శాతం హెచ్‌ఆర్‌ఏ సీలింగ్ వల్ల, ఆమె పాత పన్ను విధానంలో తన పూర్తి హెచ్‌ఆర్‌ఏను క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి తోడు స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ వంటి ఇతర మినహాయింపులను కలిపి పక్కాగా ప్లాన్ చేసుకోవడం ద్వారా ఆమె తన పన్ను భారాన్ని తగ్గించుకుని, టేక్-హోమ్ శాలరీని పెంచుకోవచ్చు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(13ఏ) ప్రకారం, ఉద్యోగి పొందే హెచ్‌ఆర్‌ఏలో కొంత భాగానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ మినహాయింపు ఈ కింది మూడింటిలో ఏది తక్కువైతే అది వర్తిస్తుంది:

వాస్తవంగా పొందిన హెచ్‌ఆర్‌ఏ

చెల్లించిన అద్దెలో నుంచి జీతంలో 10% మైనస్ చేయగా వచ్చిన మొత్తం

జీతంలో 50% (మెట్రో నగరాలు) లేదా 40% (మెట్రోయేతర నగరాలు).

గతంలో కేవలం దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాలకు మాత్రమే 50% మినహాయింపు ఉండేది. అయితే ఏప్రిల్ 1 నుంచి హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్, బెంగళూరు లను కూడా ఈ జాబితాలో చేర్చారు. దీనివల్ల అధిక అద్దెలు చెల్లిస్తూ కూడా 40% పరిమితి వల్ల నష్టపోతున్న వారికి ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది.

సాధారణంగా మన జీతంలో పన్ను లెక్కించేటప్పుడు, మనం కట్టే ఇంటి అద్దెను (హెచ్​ఆర్​ఏ) మన ఆదాయం నుంచి మైనస్ చేస్తారు. అంటే, ఆ అద్దె మొత్తానికి మనం పన్ను కట్టక్కర్లేదు.

పాత పన్ను విధానంతో లాభాలు

హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఈ మార్పు వల్ల మీ ‘టేక్-హోమ్’ (చేతికి వచ్చే జీతం) ఎలా పెరుగుతుందో ఈ 3 పాయింట్లలో చూడండి:

పాత రూల్ (40%): ఇంతకుముందు మీ బేసిక్ శాలరీలో కేవలం 40% వరకు మాత్రమే అద్దె మినహాయింపు ఇచ్చేవారు. ఒకవేళ మీ అద్దె అంతకంటే ఎక్కువ ఉన్నా, మీరు ఆ 40% వరకే పన్ను ఆదా చేసుకోగలిగేవారు. మిగిలిన మొత్తంపై పన్ను కట్టాల్సి వచ్చేది.

కొత్త రూల్ (50%): ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి, ఈ పరిమితిని 50% కి పెంచారు. అంటే, మీ బేసిక్ శాలరీలో మరో 10% అదనపు మొత్తంపై మీరు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

ఫలితం: ప్రభుత్వం మీ జీతం నుంచి కట్ చేసే ‘ఇన్​కమ్​ ట్యాక్స్​’ తగ్గుతుంది. పన్ను రూపంలో ప్రభుత్వానికి వెళ్లాల్సిన డబ్బు ఇప్పుడు మీ జీతంతో కలిపి మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వస్తుంది. అదే మీ టేక్-హోమ్ శాలరీ పెరగడం.

మీ బేసిక్ శాలరీ నెలకు రూ. 50,000 అనుకుందాం.

ముందు: రూ. 20,000 (40%) వరకు మాత్రమే అద్దె మినహాయింపు ఉండేది.

ఇప్పుడు: రూ. 25,000 (50%) వరకు మినహాయింపు లభిస్తుంది.

అంటే ఆ అదనపు రూ. 5,000 పై మీరు పన్ను కట్టక్కర్లేదు. మీరు 30% టాక్స్ స్లాబ్‌లో ఉంటే, నెలకు సుమారు రూ. 1,500 అదనంగా మీ చేతికి వస్తుంది.

టేక్-హోమ్ శాలరీని పెంచుకోవడం ఎలా?

ధ్రువ అడ్వైజర్స్ పార్ట్నర్ దీపేష్ ఛడ్డా అభిప్రాయం ప్రకారం, “చాలా సందర్భాల్లో వ్యక్తులు ఎక్కువ మినహాయింపును క్లెయిమ్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, తక్కువ థ్రెషోల్డ్ (40%) వల్ల కష్టపడుతుంటారు. ఈ మార్పు ఇప్పుడు వారి పూర్తి హెచ్‌ఆర్‌ఏను వినియోగించుకోవడానికి అనుమతిస్తుంది.”

బి. శంకర్ అడ్వకేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ బీ. శ్రవంత్ శంకర్ మాట్లాడుతూ.. “మధ్య- అధిక ఆదాయం కలిగిన ఉద్యోగులు, ఎవరి హెచ్‌ఆర్‌ఏ అయితే బేసిక్ పేలో 50 శాతానికి దగ్గరగా ఉండి, భారీగా అద్దె చెల్లిస్తున్నారో వారికి ఇది ప్రధానంగా ప్రయోజనం చేకూరుస్తుంది. వీరికి రూ. 60,000 నుంచి రూ. 1.2 లక్షల వరకు అదనపు మినహాయింపు లభించే అవకాశం ఉంది,” అని పేర్కొన్నారు.

అయితే, హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనం కేవలం పాత పన్ను విధానంలోనే ఉంటుంది కాబట్టి, మీరు తీసుకునే నిర్ణయం మీ శాలరీ స్ట్రక్చర్, ఇతర మినహాయింపులపై ఆధారపడి ఉండాలి.

ఎప్పుడు పాత విధానం మేలు?: మీ మొత్తం మినహాయింపులు (హెచ్​ఆర్​ఏ, 80సీ, 80డీ, హోమ్ లోన్) రూ. 3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఉంటే పాత విధానం లాభదాయకం.

ఎప్పుడు కొత్త విధానం మేలు?: అద్దె తక్కువగా ఉన్నవారికి లేదా తక్కువ ఆదాయం ఉన్నవారికి (సెక్షన్ 87ఏఏ రిబేట్ వల్ల) కొత్త విధానం సరళంగా ఉంటుంది.

ఈ సంస్కరణ వల్ల అద్దె ఒప్పందాలు మరింత పారదర్శకంగా ఉండాల్సి ఉంటుంది. కేవలం పన్ను తగ్గించుకోవడమే కాకుండా, డాక్యుమెంటేషన్, కంప్లయన్స్ భారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఏటా మీ పన్ను విధానాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More

హైదరాబాద్‌లో హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పెంపుదల ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిచ్చే అంశం. పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. సరైన ప్లానింగ్‌తో జీతం పెంచుకునే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.