
📌 Key Points
- 2026 టీ20 ప్రపంచకప్‌లో కెనడా, న్యూజిలాండ్ మ్యాచ్ ఫిక్సింగ్‌పై ఐసీసీ విచారణ ప్రారంభించింది.
- కెనడాకు చెందిన డాక్యుమెంటరీలో వెల్లడైన అవినీతి ఆధారంగా ఐసీసీ చర్యలు చేపట్టింది.
- కెనడా కెప్టెన్ బజ్వా బౌలింగ్‌పై అనుమానాలు, ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి.
- మ్యాచ్ ఫిక్సింగ్ నిజమని తేలితే ఆటగాళ్లు, అధికారులపై జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది.
ప్రపంచ క్రికెట్‌లో ఫిక్సింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2026 టీ20 ప్రపంచకప్‌లో కెనడా, న్యూజిలాండ్ మ్యాచ్ ఫిక్సింగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారం క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అవినీతి నిరోధక విభాగం (ACU) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కెనడా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అధికారికంగా విచారణ ప్రారంభించింది. ఒక డాక్యుమెంటరీలో వెల్లడైన దిగ్భ్రాంతికర విషయాల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కెనడాకు చెందిన ‘ది ఫిఫ్త్ ఎస్టేట్’ అనే ఇన్వెస్టిగేటివ్ ప్రోగ్రామ్ రూపొందించిన “కరప్షన్, క్రైమ్ అండ్ క్రికెట్” అనే డాక్యుమెంటరీ ఈ వివాదాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇందులో కెనడా క్రికెట్ బోర్డులో అవినీతితో పాటు, అంతర్జాతీయ మ్యాచ్‌లలో జరిగిన అవకతవకలను ప్రస్తావించారు.
విచారణ ప్రారంభించిన ఐసీసీ ఏసీయూ
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చెన్నై వేదికగా గత ఫిబ్రవరి 17న జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ కెనడా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా వేసిన 5వ ఓవర్‌పై ప్రధానంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి ఉన్న క్రీడాకారుడు వరుసగా నో బాల్స్ వేయడం, వైడ్ బాల్స్ వేయడంపై అనుమానం వ్యక్తమయింది. అప్పటికే న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా, బజ్వా వేసిన ఓవర్‌లో అనూహ్యంగా పరుగులు రావడంపై విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కెనడా మాజీ కోచ్ ఖుర్రం చోహన్ మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ లీక్ అయ్యింది. అందులో బోర్డు సభ్యులు కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, అలాగే మ్యాచ్‌లను ఫిక్స్ చేసే ప్రయత్నాలు జరిగాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను కాదని, కొందరు బోర్డు సభ్యుల ప్రయోజనాల కోసం జట్టు ఎంపికలో మార్పులు చేసారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కెనడా క్రికెట్‌లో అవినీతి గుట్టురట్టు
ఈ ఆరోపణలను ఐసీసీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. ఏసీయూ (Anti-Corruption Unit) ఇప్పటికే కెనడా క్రికెట్ బోర్డు నుంచి వివరాలను సేకరిస్తోంది. కేవలం ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాకుండా, దేశీయ క్రికెట్‌లో జరుగుతున్న ఇతర అక్రమాలపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ విచారణలో గనుక ఆరోపణలు నిజమని తేలితే, సంబంధిత ఆటగాళ్లు, అధికారులపై జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ఇలాంటి ఆరోపణలు రావడం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది.
ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ఫిక్సింగ్ ఆరోపణలు రావడం దురదృష్టకరం. ఐసీసీ విచారణ ఎంతవరకు నిజాలను వెలికితీస్తుందో వేచి చూడాలి. కఠిన చర్యలు తీసుకుంటేనే క్రీడకు గౌరవం నిలుస్తుంది.


