|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినీ విమర్శకులు అంటే మామూలోళ్లు కాదుగా.. బాధ్యత ఉండాలంటోoది!!

Published: 13-03-2026, 9:35 PM
సినీ విమర్శకులు అంటే మామూలోళ్లు కాదుగా.. బాధ్యత ఉండాలంటోoది!!
  • సినిమా విమర్శ ఒక కళ, బాధ్యత అని రోజర్ ఎబర్ట్ అభిప్రాయం – ఇది కేవలం అభిప్రాయం కాదు!
  • విమర్శకుడు ప్రేక్షకుల ప్రతినిధిగా సినిమా చూసి, అనుభవాన్ని పంచుకోవడం ప్రధానం!
  • సైద్ధాంతిక విమర్శలో మార్క్సిస్ట్, ఫెమినిస్ట్ కోణాల్లో సినిమా విశ్లేషణ జరుగుతుంది – లోతైన పరిశీలన!
  • దర్శకుడి శైలి, ఇతివృత్తాలే ప్రధానంగా ‘ఆటోర్ విమర్శ’ సాగుతుంది – ఇది దర్శకుడి ప్రత్యేకతను తెలుపుతుంది!

సినిమా విమర్శ గురించి ఒక సంచలన కథనం మీకోసం! సినిమా విమర్శ అంటే ఏమిటి? విమర్శకుడు ఎలా ఉండాలి? రోజర్ ఎబర్ట్ ఏం చెప్పారు? తెలుసుకోవాలంటే చదవండి!

సినిమా విమర్శ ఒక అభిప్రాయం మాత్రమే కాదు!

‘కళ’, ‘కళాత్మక వ్యక్తీకరణ’ అనగానే మనసులో వేలాది భావాలు ఉదయిస్తాయి. నవ్వూ, ఏడుపూ, ఉత్కంఠా, ప్రేమా, పోరాటం ఇవన్నీ కళల్లో జీవం పోసుకుంటాయి.. సినిమా, సాహిత్యం నాట్యం, పెయింటింగ్  ఇలా ఏ కళయినా కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అది సమాజాన్ని ప్రతిబింబించే అద్దంగా, మార్పును కలిగించే ఆయుధంగా, సంస్కృతిని కాపాడే భండారంగా పనిచేస్తుంది.

ఒకసారి ఏ కళాకారుడైనా తన సృజనను ప్రజల ముందుకు తెచ్చాకా ఇక దానిపై వివిధ రకాలైన స్పందనలు ప్రతిస్పందనలు వస్తాయి. పరిచయం, సమీక్ష, విమర్శ, జీవిత చరిత్రలు ఇలా అనేక రకాలుగా స్పందనలు ఎదురవుతాయి. అయితే ఇవన్నీ ఒకటి కాదు.. వాటిల్లో దేనికదే ప్రత్యేక సరళి స్థానం కలిగి ఉంటాయి. కానీ ఇవాల్టి రోజుల్లో ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలూ సినీ విమర్శ, సమీక్ష, చరిత్ర, జీవిత చరిత్ర వీటి అన్నింటినీ ఒకే గాటన కట్టేస్తున్నారు.. అవార్డులూ, రివార్డులూ ఇచ్చే సందర్భాల్లో కూడా వాటి నడుమ వున్న వైవిధ్యాన్ని, వైరుధ్యాన్నీ గమనించడం లేదు. అర్థం చేసు కోవడం లేదు. అంతా గుడ్డెద్దు చేనులో పడ్డట్టే.. అది సమంజసం కాదు. న్యాయం అంతకంటే కాదు. వాటి నడుమ ఇవ్వాల్టి భాషలో చెప్పాలంటే డేటా సెంటర్‌కి, అనలిటికల్ కేంద్రానికీ ఉన్న తేడా వుంది.

సినిమాల గురించి మాట్లాడుకుంటే రోజర్ ఎబర్ట్ సినిమా విమర్శ అంటే కేవలం అభిప్రాయం కాదు. అది ఒక కళ, ఒక బాధ్యత అంటాడు.. విమర్శ అంటే కేవలం తప్పుపట్టడం కాదు. విమర్శకుణ్ణి క్రిటిక్ అంటారు. విమర్శ అనే పదానికి అర్థం బాగా పరిశీలించడం. ఒక సినిమాను అన్ని కోణాల నుండి, అన్ని స్థాయిల్లో అర్థం చేసుకొని, దాని బలాలు బలహీ‌నతలు నిజాయితీగా చెప్పడమే విమర్శ. మంచి విమర్శ కుడు ప్రేక్షకుల ప్రతినిధి. అతడు సినిమాను చూసి ఆ అనుభవాన్ని మాటల్లో వ్యక్తం చేస్తాడు. అతని విమర్శ ఇతర ప్రేక్షకులకు ఆ సినిమాను అర్థం చేసుకోవడంలోనూ లేదా ఆ సినిమా చూడాలో వద్దో నిర్ణయించుకోవడంలో సహాయపడుతుంది.

విమర్శకుడి బాధ్యత ఏమిటి?

ఈ సినీ విమర్శలో కూడా రకాలున్నాయి ‘సైద్ధాంతిక విమర్శ’లో సినిమాను సైద్ధాంతిక చట్రాల్లో విశ్లేషించడం. మార్క్సిస్ట్ దృష్టితో, ఫెమినిస్ట్ దృష్టితో, పోస్ట్-కొలోనియల్ దృష్టితో సినిమాను అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇక ‘ఆటోర్ విమర్శ’లో దర్శకుడే సినిమా రచయిత అని భావించే పద్ధతి. ఒక దర్శకుడు తీసిన అన్ని సినిమాల్లో పునరావృత మయ్యే ఇతివృత్తాలు, శైలి, దృష్టి వీటిని పరిశీలించడం ఈ పద్ధతి. మరో పద్ధతి ‘స్వరూప విమర్శ’ సినిమాను దాని జానర్ విశ్లేషించడం. ఇంకా యాక్షన్, రొమాన్స్, హారర్, కామెడీ ఇలా ఒక్కో స్వరూపానికి ఒక్కో ప్రమాణాలు ఉంటాయి. ‘సాంస్కృతిక విమర్శ’లో ఆ సినిమా సమాజాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో, సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలించడం చేస్తుంది. ‘జనరంజక విమర్శ’ కేవలం సాధారణ ప్రేక్షకుల కోసం రాసే విమర్శ. సినిమా చూడాలా వద్దా అని చెప్పే స్థూలమైన సమీక్ష ఈ రకానికి చెందుతుంది.

మంచి విమర్శకునికి కొన్ని లక్షణాలుంటాయి. అవేమిటంటే విస్తృతమైన సినిమా జ్ఞానం, నిజాయితీ, పక్షపాతం లేకుండా చూడగల దృష్టి, భాషపై పట్టు, విభిన్న సంస్కృతులను అర్థం చేసుకోగల సామర్థ్యం. అన్నిటికంటే ముఖ్యంగా, సినిమాపై ప్రేమ. విమర్శకు ఇవన్నీ కావలిసి వస్తే ‘సినిమా సమీక్ష’ రాయడం మారో స్థాయి. సమీక్ష రాసే రచయితను సమీక్షకుడు అంటారు. అంటే సినిమా సంక్షిప్త పరిచయం, కథాసారం నటన, దర్శకత్వం, సంగీతం, ఛాయాగ్రహణం మొదలైన వాటి వివరాలివ్వడం ఇందులో రాసే అంశాలు, మంచి సమీక్ష ముఖ్యంగా మూడు లక్ష్యాలను నెరవేర్చాలి. సినిమా గురించి తగినంత సమాచారం అందించడం, వ్యక్తిగత అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పడం, చదివే వారిని ఆలోచింపజేయడం.. సమీక్షకుడు ఆ సినిమాకు రేటింగ్ కూడా ఇవ్వవచ్చు కానీ సమీక్షకుడు ఒక సూచన చేసేవాడు మాత్రమే. తుది నిర్ణయం ప్రేక్షకులదే.

విమర్శలలో రకాలు – మీకు ఏది తెలుసు?

సినిమా కేవలం తెరపై కనిపించే కథ మాత్రమే కాదు. అది కాలం, సమాజం, మనసుల ప్రతిబింబం. ఆ ప్రతిబింబం ఎక్కడ మసకబారిందో, ఎక్కడ వెలుగుని కోల్పోయిందో చూపించే అద్దం ‘సినీ విమర్శ’. నిజమైన విమర్శ సినిమాను దెబ్బతీయదు. అది దారిచూపుతుంది. అది సినిమాలోని తప్పును ఎత్తిచూపుతూ, విశ్లేషిస్తూ దాని అందాన్ని మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. ఒక మంచి విమర్శకుడు సినిమాను కేవలం చూడడు దాని లోపలికి ప్రవేశిస్తాడు. ఫ్రేమ్‌ల మధ్య నిశ్శబ్దాన్ని వినిపిస్తాడు, పాత్రల వెనుక దాగిన బాధను చదువుతాడు, ఒక సమాజం ఎలా ఊపిరి తీసు కుంటుందో ఆ తెరపై గుర్తిస్తాడు. అందుకే విమర్శ ఒక తీర్పు కాదు. అది ఒక సంభాషణ.

సినిమా ముందుకు నడవాలంటే కేవలం కెమెరా కదలిక సరిపోదు. ఆ కదలికకు అర్థం చెప్పే ఆలోచన కూడా కావాలి. ఆ ఆలోచనకు మారుపేరు ‘సినీ విమర్శ’. మంచి విమర్శ ఒక సినిమాను కూలదోసే గాలి కాదు. అది దాని రెక్కలకు దశ దిశ చూపించే గాలి. అందుకే సినీ విమర్శ, సమీక్ష, చరిత్ర, జీవిత చరిత్రలను ఒకే రీతిన అర్థం చేసుకోకుండా విజ్ఞతతో పరిశీలించాలి. అప్పుడే సినిమాల కంటెంట్ మరెంతో మెరుగు‌పడుతుంది. విమర్శకు సార్థకత కలుగుతుంది.

సినిమా విమర్శ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా! ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి. త్వరలో మరిన్ని అప్డేట్లతో మీ ముందుకు వస్తాం!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.