
📌 Key Points
- 2024లో భారత్‌కు 137.67 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లు అందాయి, ఇది ప్రపంచ రికార్డు.
- ఏటా 100 బిలియన్ డాలర్ల మార్కు దాటిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
- రెండవ స్థానంలో ఉన్న మెక్సికో కంటే భారత్ రెట్టింపు రెమిటెన్స్‌లు అందుకుంది.
- భారత ఆర్థిక వ్యవస్థలో రెమిటెన్స్‌ల వాటా దాదాపు 3.5%.
ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్లిన భారతీయులు తమ కష్టార్జితాన్ని స్వదేశానికి పంపడంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. 2024లో ఏకంగా 137.67 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లను భారత్ అందుకుంది. ఇది ప్రపంచంలోనే ఒక దేశం 100 బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. భారత ఆర్థిక వ్యవస్థకు ప్రవాసుల మద్దతు ఎంత కీలకమో ఇది చాటిచెబుతోంది.
ప్రవాసుల కష్టార్జితం: భారత్‌కు అగ్రస్థానం
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు తమ కష్టార్జితాన్ని స్వదేశానికి పంపడంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) విడుదల చేసిన తాజా వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 ప్రకారం.. రెమిటెన్స్(Remittances) అనగా విదేశీ నిధుల స్వీకరణలో భారత్ తిరుగులేని అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత కార్మికుల, ప్రవాసుల ప్రాముఖ్యతను చాటిచెప్పే విశ్లేషణ..
భారత వలస కార్మికుల అసాధారణ మైలురాయి
IOM లెక్కల ప్రకారం.. 2024వ సంవత్సరంలో భారత్‌కు అందిన రెమిటెన్స్‌లు అక్షరాలా 137.67 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.11.5 లక్షల కోట్లు. ప్రపంచ చరిత్రలోనే ఒక దేశం ఏటా 100 బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఇవి కేవలం వట్టి లెక్కలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక చక్రంలో భారతీయుల శ్రమ ఎంత కీలకమో చాటిచెబుతోంది. దాదాపు 1.9 కోట్ల మంది భారతీయులు వివిధ దేశాలలో వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడి, అక్కడి అభివృద్ధిలో భాగస్వాములు అవుతూనే, తమ సంపాదనను స్వదేశానికి పంపి భారత విదేశీ మారక నిల్వలను బలోపేతం చేస్తున్నారు.
ఇంకో పదేళ్ళూ ఇండియాదే ఆధిపత్యం
100 బిలియన్ డాలర్ల మార్కు దాటిన తొలి దేశం
రెమిటెన్స్ విషయంలో గత దశాబ్దం కాలంగా భారత్ దరిదాపుల్లోకి ఏ దేశం చేరలేదు. మరో పదేళ్ల వరకు కూడా ఇదే ఆధిపత్యం కొనసాగించగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నివేదిక ప్రకారం.. రెండవ స్థానంలో ఉన్న మెక్సికో అందుకుంటున్న 67.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే భారత్ కు అందే మొత్తం రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. టాప్ 10 జాబితాలో ఫిలిప్పైన్స్ 40.3 బిలియన్ డాలర్లు, పాకిస్తాన్ 34.9బిలియన్ డాలర్లు, 31.4 బిలియన్ డాలర్లతో చైనా ఉన్నప్పటికీ, భారత్ దరిదాపుల్లో ఏ దేశం కూడా నిలవలేకపోయింది. ఒకప్పుడు రెమిటెన్స్‌లలో అగ్రస్థానంలో పోటీ పడే చైనా, ఇప్పుడు ఆరవ స్థానానికి పడిపోవడం విశేషం. దీనికి ప్రధాన కారణం భారతీయులు కేవలం కూలీలుగానే కాకుండా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సీఈఓలుగా అత్యున్నత స్థాయి వేతనాలు పొందుతుండటమే.
దేశ ఆర్థిక వ్యవస్థలో 3.5% వాటా
జీడీపీ (GDP) పరంగా చూస్తే, భారత్ అందుకునే రెమిటెన్స్‌లు దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 3.5% వాటాను కలిగి ఉన్నాయి. గ్వాటిమాలా (19.1%), నైజీరియా (11.3%) వంటి దేశాలతో పోలిస్తే ఈ శాతం తక్కువగా అనిపించినప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం దృష్ట్యా ఈ 137 బిలియన్ డాలర్లు అనేది దేశీయ ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడానికి ఈ వనరులు కీలక ఇంధనంగా పనిచేస్తాయి.
90 శాతం రెమిటన్స్ కార్మికుల కష్టార్జితమే
భారత ఆర్థిక వ్యవస్థకు ప్రవాసుల బలం
అయితే మన దేశం నుంచి 19 మిలియన్లు అంటే దాదాపు కోటి మందికి పైగా కార్మికులు, ఉద్యోగార్థులు వివిధ దేశాలకు వలస వెళ్లినట్టు వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 చెబుతోంది. ఇక భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం ఏటా మన దేశం నుంచి 14 లక్షల మంది విదేశాలకు పనుల నిమిత్తం వలస వెళుతున్నారని చెబుతోంది. అంటే భారత్ కు చేరే రెమిటెన్స్ లో దాదాపు 80 శాతం వరకు విదేశాలకు వలస వెళ్లిన కార్మికుల కష్టమే అని చెప్పవచ్చు. భారత్ నుంచి ఎక్కువగా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, ఒమన్, కెనడా, సింగపూర్, రష్యా దేశాలకు అత్యధికంగా వలస వెళ్తున్నారు. ఇక మనదేశం నుంచి విదేశాలకు వెళ్లే వలసదారుల సంఖ్యలో కేరళ టాప్ ప్లేస్ లో ఉండగా.. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.
ఇక దేశాల విషయానికి వస్తే భారత్ తర్వాత మెక్సికో నుంచి 11 మిలియన్లు, చైనా 10 మిలియన్లు, ఫిలిప్పైన్ నుంచి 6 మిలియన్ల మంది విదేశాల బాట పడుతున్నారు. అయితే వీరిలో ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా చేరుకుంటుండగా.. భారత్ నుంచి మాత్రం దాదాపు 95 శాతం మంది పశ్చిమాసియా దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియాలకు వలస వెళ్తున్నారు. ఇక ఇలా వలస వెళ్తున్న కార్మికులు ఎక్కువగా ఆయా దేశాల్లో నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని సమాచారం. ఇటీవల బుర్జ్ ఖలీఫా నిర్మించిన నిర్మాణ సంస్థ అధినేత చెప్పిన దాని ప్రకారం.. భారత వలస కార్మికులకు విధేయంగా పనిచేయటం మాత్రమే తెలుసని, వారు ఎంతో నమ్మదగిన వారని, తమ అన్ని ప్రాజెక్టుల్లో ముందుగా భారత కార్మికులకే పెద్ద పీట వేస్తామని చెప్పడం విశేషం. ఇక వైట్ కాలర్ ఉద్యోగులు అమెరికా చేరుకుంటుండగా.. ఇతర నైపుణ్య రంగాలకు చెందిన నిపుణులు UK చేరుతున్నారని వరల్డ్ మైగ్రంట్స్ రిపోర్ట్ చెబుతోంది.
అయితే ఈ వివరాలన్నీ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అక్కడ భారత వలసదారులు తమ నైపుణ్యంతో రాణిస్తున్నారు. విదేశీ గడ్డపై వారు చిందిస్తున్న చెమట, స్వదేశంలో రూపాయి విలువ పడిపోకుండా కాపాడటమే కాకుండా, లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా మారుతున్నారు. కాని ప్రపంచంలో ఏ దేశంలో అలజడి రేగినా, ఉత్పాతాలు విరిచుకుపడ్డా.. అక్కడి బాధితుల్లో కచ్చితంగా భారతీయులు ఉండటమే కొద్దిగా బాధించే అంశం.
భారతీయ ప్రవాసుల అసాధారణ కృషి, వారి దేశభక్తికి ఈ రెమిటెన్స్‌ల రికార్డు నిదర్శనం. ఇది కేవలం ఆర్థిక విజయమే కాదు, ప్రపంచ వేదికపై భారత్ ప్రాముఖ్యతను, దాని కార్మికుల సామర్థ్యాన్ని స్పష్టంగా చాటిచెబుతోంది. ఈ ఆధిపత్యం భవిష్యత్తులోనూ కొనసాగనుంది.


