|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రంప్ షాక్: అమెరికాకు ఇరాన్ 10 సంచలన షరతులు! అంగీకరిస్తారా?

Published: 07-04-2026, 10:05 PM
ట్రంప్ షాక్: అమెరికాకు ఇరాన్ 10 సంచలన షరతులు! అంగీకరిస్తారా?
  • యురేనియం సుసంపన్నం చేసుకునే హక్కును ఇరాన్ కోరుతోంది.
  • గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు ఇరాన్ డిమాండ్.
  • ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని అమెరికాకు ఇరాన్ విజ్ఞప్తి.
  • యుద్ధ నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్.

పశ్చిమాసియాలో యుద్ధం ముగిసేలా ఉంది. కాల్పుల విరమణకు అమెరికా ముందుకు రాగా, ఇరాన్ కొన్ని షరతులు విధించింది. ఈ షరతులను అంగీకరిస్తేనే హార్మూజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది.

ఇరాన్ ప్రధాన షరతులు ఏమిటి?

పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా 14 రోజుల కాల్పుల విరమణకు ముందుకు వచ్చింది. అలాగే కొన్ని షరతుల మీద హార్మూజ్ జలసంధి తెరవడానికి, కాల్పుల విరమణకు ఇరాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కాల్పుల విరమణకు, హార్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ అమెరికాకు 10 షరతులు విధించింది. ఈ షరతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “సూత్రప్రాయంగా” సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ షరతులు ఏమిటంటే..

1. యురేనియం ఎన్రిచ్మెంట్ హక్కు : ఇరాన్ తన భూభాగంపై శాంతియుత అవసరాల (విద్యుత్, వైద్యం) కోసం యురేనియంను ఎన్రిచ్మెంట్ చేసుకునే హక్కును అమెరికా గుర్తించాలి. ఇది తమ సార్వభౌమాధికారమని ఇరాన్ స్పష్టం చేసింది.

2. మళ్ళీ దాడి చేయబోమని గ్యారెంటీ: భవిష్యత్తులో ఇరాన్ భూభాగంపై అమెరికా గాని ఇజ్రాయెల్ గాని ఎలాంటి దాడులు చేయబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.

3. గల్ఫ్ నుంచి బలగాల ఉపసంహరణ : తక్షణమే గల్ఫ్ రీజియన్ నుంచి అమెరికా తన బలగాలను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలి.

అమెరికా స్పందన ఎలా ఉంది?

4. మిత్రపక్షాలపై దాడులు ఆపాలి: లెబనాన్‌లోని హిజ్బుల్లాతోపాటు, ఇరాన్‌కు మద్దతు ఇచ్చే గ్రూపులపై (Proxies) దాడులు చేయకూడదు.

5. ఆర్థిక ఆంక్షల ఎత్తివేత: ఇరాన్‌పై ఉన్న అన్ని రకాల ఆర్థిక ఆంక్షలను(Sanctions) అమెరికా పూర్తిగా రద్దు చేయాలి.

6. హర్మూజ్ జలసంధి నియంత్రణ: హార్మూజ్ జలసంధిని అంతర్జాతీయ రవాణాకు తెరిచినప్పటికీ, దాని పర్యవేక్షణ, భద్రతా నియంత్రణ ఇరాన్ వద్దే ఉండాలి. అలాగే హార్మూజ్ గుండా వెళ్ళే ప్రతి వాణిజ్య నౌక నుండి సుమారు $2 మిలియన్ల (సుమారు ₹16.5 కోట్లు) రుసుమును వసూలు చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం తెలపకూడదు.

7. పునర్నిర్మాణ నిధి: హార్మూజ్ లో వసూలు చేసిన ఈ నిధులను ఇరాన్, ఒమన్ దేశాలు పంచుకుంటాయి. ఈ మొత్తాన్ని యుద్ధంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి ఉపయోగిస్తారు.

యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేనా?

8. పరిహారం చెల్లింపు: యుద్ధం కారణంగా ఇరాన్‌కు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ తగిన పరిహారం అందజేయాలి.

9. ఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల : బ్యాంకుల వద్ద ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను వెంటనే రిలీజ్ చేయాలి.

10. శాశ్వత యుద్ధ నివారణ: కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా, ఈ యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలి.

అయితే ఈ షరతులపై ట్రంప్ సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ… యురేనియం విషయంలో మాత్రం వెనక్కితగ్గలేదని సమాచారం. ఇరాన్ వద్ద ఉన్న 60% పైబడిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ ఏజెన్సీలకు అప్పగించాలని, అణు కేంద్రాలను పూర్తిగా పర్యవేక్షించాలని ఆయన పట్టుబడుతున్నారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

ట్రంప్ ఈ షరతులపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అమెరికా అంగీకరిస్తే పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశం ఉంది. వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.