
📌 Key Points
- గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలకు సహాయం కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.
- ప్రజలు సంయమనం పాటించాలని, విమాన సర్వీసులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
- భారతీయ రాయబార కార్యాలయాలలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి, కేంద్రం భద్రతను పర్యవేక్షిస్తోంది.
- సమాచారం కోసం ఏపీ ఎన్నార్టీ హెల్ప్‌లైన్ నంబర్లు, వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచన.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సహాయం కోసం హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.
గల్ఫ్ దేశాల్లో ఏపీ ప్రజల కోసం ప్రభుత్వ చర్యలు
ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సర్కార్ చర్యలు చేపట్టింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…. రాష్ట్ర ఎన్.ఆర్.ఐ సాధికారిత వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటన విడుదల చేశారు.
గల్ఫ్ దేశాల్లో ఉంటున్న విద్యార్ధులు, ఉద్యోగులు, పర్యాటకులు సహా ఇతర రాష్ట్ర పౌరులు ఎవరూ కూడా,… ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సంయమనం పాటించాలని, త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
ప్రజలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి
ఇండియన్ ఎంబసీలో ఆయా దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులు అందరూ నమోదు చేసుకోవాలని మంత్రి కొండపల్లి కోరారు. ఇరాన్ , ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం మరియు భారత విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. కావున సరైన సమాచారం తెలుసుకుని, ఎప్పటికప్పుడు ఇండియన్ ఎంబసీలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
త్వరలోనే విమానయాన సేవలు పునరుద్దరిస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని రాష్ట్ర పౌరులను మంత్రి కోరారు.
హెల్ప్‌లైన్ నెంబర్లు, సంప్రదింపు వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభావిత దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులు అందరినీ కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితులలో ఏపీ ఎన్నార్టీ హెల్ప్ లైన్ నెంబర్లు +91 8500027678, +91 0863 2340678 నంబర్లకు, మరింత సమాచారం కోసం https://apnrts.ap.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఏ విధమైన తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా… స్థానిక అధికారులు, అధికారిక మీడియా ప్రకటనల సమాచారం మాత్రమే ఫాలో కావాలని కోరారు.
గల్ఫ్ దేశాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వం సూచనలను పాటించాలని కోరడమైనది. సహాయం కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి.


