|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రంప్ కాల్పుల విరమణ బూడిద.. ఇరాన్, ఇజ్రాయెల్ భీకర పోరు!

Published: 24-03-2026, 7:35 PM
ట్రంప్ కాల్పుల విరమణ బూడిద.. ఇరాన్, ఇజ్రాయెల్ భీకర పోరు!
  • ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన తర్వాత కూడా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి.
  • ఇరాన్ తన ఇంధన ప్రాజెక్టులపై దాడులు జరిగాయని ఆరోపించింది.
  • టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది.
  • ఇరాన్‌తో చర్చలు జరిగినా ఆంక్షలను అంగీకరించే అవకాశం లేదని ఇజ్రాయెల్ అభిప్రాయపడింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన చేసినప్పటికీ, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పోరు మాత్రం ఆగడం లేదు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పారు. దీనికి కారణాలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటనకు విఘాతం

– ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఆగని పోరు

– మా ఇంధన ప్రాజెక్టులపై దాడులు జరిగాయి: ఇరాన్

– టెల్ అవీవ్‌పై ఇరాన్ భీకర దాడులు

పశ్చిమాసియా యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు నువ్వానేనా అన్నట్లు ఒకదానిపై మరొకటి బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇటు టెహ్రాన్, అటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తుంటే.. నేరుగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై ఇరాన్ మిసైల్స్ పడ్డాయి. ఇదే సమయంలో ఇప్పటి వరకు డిఫెన్సివ్ అప్రోచ్‌తో ఉన్న యూఏఈ, సౌదీ, బహ్రెయిన్ తదితర దేశాలు.. ఇప్పుడు ఇరాన్‌పై దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ముగియడం అసాధ్యమని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన యుద్ధవిరామం పరిస్థితి ఏంటి? ఈ యుద్ధం అసలు ఆగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌తో డీల్ చేసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ నెరవేరడం కష్టమేనని ఇజ్రాయెల్ అంటోంది. మళ్లీ చర్చలు మొదలైనా కూడా యూఎస్ పెట్టే ఆంక్షలను ఇరాన్ ఒప్పుకోవడం దాదాపు అసాధ్యమని ముగ్గురు ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇరాన్ ఇంధన ప్రాజెక్టులపై దాడులు

పశ్చిమాసియా యుద్ధం మొదలవడానికి ముందు కూడా యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ దాడుల్లో 2 వేల మందికిపైగా మరణాలు సంభవించినట్లు సమాచారం. వీరిలో 1500 మందికిపైగా ఇరాన్‌లోనే మరణించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఇరాన్‌తో చర్చలు జరిగినా కూడా.. ఇరాన్ అణు ఆశయాలను నియంత్రించాలని అమెరికా ప్రయత్నిస్తుందని, అలాగే వారి బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాంపై కూడా ఆంక్షలు విధిస్తుందని ఇజ్రాయెల్ అధికారులు అంటున్నారు. యుద్ధం మొదలవడానికి ముందు కూడా యూఎస్ ఇవే ప్రతిపాదనలు చేస్తే ఇరాన్ తిరస్కరించింది. కాబట్టి ఈసారి కూడా ఇరాన్ ఈ డీల్‌ను తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇజ్రాయెల్ అంటోంది. ఒకపక్క చర్చలకు యూఎస్ ప్రయత్నాలు చేస్తుండగానే.. ఇరాన్‌పై యుద్ధం కోసం పశ్చిమాసియాలో 3 వేల మంది సైనికులను డిప్లాయ్ చేసేందుకు పెంటగాన్ సిద్ధమైనట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

ఇంధన ప్రాజెక్టులపై దాడులు..

డొనాల్డ్ ట్రంప్ యుద్ధవిరామం ప్రకటించినప్పటికీ.. తమ ఇంధన ప్రాజెక్టులపై దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇస్ఫాహన్‌లోని గ్యాస్ అడ్మినిస్ట్రేషన్ భవనం, గ్యాస్ ప్రెజర్ రిడక్షన్ సెంటర్‌పై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో స్థానికంగా నివశించే ప్రజల ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే ఖోర్రామ్‌షెహర్‌లో కూడా పవర్‌ప్లాంట్‌తో అనుసంధానించి ఉన్న సహజవాయువు పైప్‌లైన్‌ సమీపంలో ఒక మిసైల్ పడినట్లు స్థానిక అధికారులు చెప్పారు. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.

చర్చల ప్రతిపాదనలను తిరస్కరించనున్న ఇరాన్?

టెల్ అవీవ్‌పై ఎటాక్స్: ఇజ్రాయెల్

అదే సమయంలో ఇజ్రాయెల్ టార్గెట్‌గా ఇరాన్ విపరీతంగా దాడులు చేస్తోంది. టెల్ అవీవ్‌పై చేసిన దాడిలో ఆరుగురు గాయపడినట్లు ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. లెబనాన్, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు ఆ దేశంపై దాడులు ఆపబోమని ఐఆర్‌జీసీ ప్రకటించింది. అయితే తాము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, ఇరాన్ దాడుల తర్వాత లెబనాన్, టెహ్రాన్‌పై మరింత భీకరంగా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఈ క్రమంలో లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించారని, వీరిలో మూడు సంవత్సరాల పాప కూడా ఉందని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో ఐదుగురు గాయపడినట్లు తెలిపింది. కాగా, లెబనాన్‌పై దాడులు చేస్తున్న సమయంలో తమ దాడుల్లో తమ పౌరుడే మరణించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ధ్రువీకరించింది.

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్‌తో యూఎస్ బృందం చర్చలు జరుపుతోందంటూ వార్తలు వచ్చాయి. వీటిని స్వయంగా ఘాలిబాఫ్ ఖండించారు. అసలు అమెరికాతో చర్చలే జరగడం లేదని, ఇదంతా ఫేక్ న్యూస్ అని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘ఈ యుద్ధంతో యూఎస్, ఇజ్రాయెల్ ట్రాప్‌లో ఇరుక్కుపోయాయి. దాన్నుంచి బయటపడేందుకే ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు’ అని ఘాలిబాఫ్ పేర్కొన్నారు. తమపై దాడులు చేసిన దురాక్రమణదారులకు శిక్షపడాలని ఇరానియన్లు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. ఇదే సమయంలో తమకు మిత్రదేశాల ద్వారా చర్చల కోసం అమెరికా అభ్యర్థన తమకు చేరిందని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. అయితే నేరుగా అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఆ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాకే స్పష్టంచేశారు.

మొత్తానికి ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన ఆచరణలోకి వచ్చేలా లేదు. ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చర్చలు సఫలం అవుతాయో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.