
సహజ నటి జయసుధ తన సినీ ప్రస్థానంలో ఎంతో మంది లెజెండరీ హీరోయిన్లతో అనుబంధాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా, దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. జయలలిత కఠిన స్వభావం వెనుక ఉన్న కారణాలను జయసుధ వివరించారు.
Key Points
సహజ నటి జయసుధ వాణిశ్రీ, శ్రీదేవి, జయప్రద, జయలలిత వంటి పలువురు హీరోయిన్లతో తన అనుబంధాన్ని పంచుకున్నారు.
ఇండియన్ సినిమా 100 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో జయలలిత స్వయంగా జయసుధను సత్కరించారు.
జయసుధ అభిప్రాయం ప్రకారం, జయలలిత అంత కఠినంగా లేకుంటే ఎక్కువ కాలం జీవించేవారు కాదు.
జయలలిత జీవితం మొత్తం పోరాటం చేస్తూ, ఎన్నో అవమానాలను దాటుకుని ఉక్కుమనిషిగా మారారు.
జయసుధ – జయలలిత అనుబంధం
సహజ నటి జయసుధకి వాణిశ్రీ, శ్రీదేవి, జయప్రద లాంటి లెజెండ్రీ హీరోయిన్లందరితో మంచి అనుబంధం ఉంది. వాణిశ్రీ అయితే తన కెరీర్ బిగినింగ్ లో నటనలో మెళుకువలు నేర్పారని జయసుధ పేర్కొంది. జయప్రదతో ఎలాగూ జయసుధకి బాగా క్లోజ్. వీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించారు. అదే విధంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలితతో ఉన్న అనుబంధాన్ని కూడా జయసుధ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. జయలలిత ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు అని జయసుధ తెలిపారు.
జయసుధ మాట్లాడుతూ.. ‘గతంలో ఇండియన్ సినిమా 100 ఇయర్స్ సెలెబ్రేషన్స్ చెన్నైలో జరిగాయి. కొన్ని రోజుల పాటు ఆ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఆ సమయంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగు తమిళ నటీనటులంతా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రెసిడెంట్ సమక్షంలో కొందరు నటీనటులకు సత్కారాలు జరిగాయి. అందులో మా పేరు లేదు. ఆ తర్వాత రోజు జరిగిన సెలబ్రేషన్స్ కి మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. ఆ కార్యక్రమంలో జయలలిత కొందరిని సన్మానించాలి అని అనుకున్నారట. లిస్ట్ రెడీ చేశారు.
జయలలిత కఠినంగా మారడానికి కారణం
జయలలిత గెస్ట్ ల గురించి తెలుసుకున్నారు. గెస్ట్ ల లిస్ట్ లో నా పేరు కూడా ఉంది. కానీ సన్మానం అందుకునే వారి లిస్ట్ లో నా పేరు లేదు. జయలలిత గారు స్వయంగా నాపేరు ఆ లిస్ట్ లో యాడ్ చేయించారు. ఇప్పటికే లిస్ట్ ఎక్కువైంది అని ఎవరో చెబితే.. ఏం పర్వాలేదు జయసుధ తప్పకుండా ఉండాల్సిందే అని అన్నారట. ఆ రోజు జయలలిత గారి చేతుల మీదుగా సత్కారం అందుకునే అవకాశం దక్కింది. ఆమెని అంత దగ్గరగా చూసే అవకాశం ఎవరికీ రాదు.
ఆమె ఎవ్వరినీ తన దగ్గరికి కూడా రానివ్వరు. తనకి బాగా సన్నిహితులైన వారిని మాత్రమే దగ్గరకు రానిస్తారు. ఆమె పాదాలకు నమస్కారం చేయాలన్నా దూరంగా ఉందో నమస్కరించి వెళ్ళిపోవాలి. జయలలిత గారి అంత కఠినంగా ఉండడం సరైనదే. లేకుంటే ఆమె అన్ని రోజులు బ్రతికుండేవారు కాదు. జయలలిత గారు తన జీవితం మొత్తం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆమెకి పెద్ద పెద్ద పదవులు పొందాలనే కోరిక ఏమాత్రం లేదు. కానీ ఎంజీఆర్ గారి పార్టీని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో మాత్రమే పార్టీ పగ్గాలు చేపట్టారు.
జయలలిత జీవిత పోరాటం, రాజకీయ ప్రస్థానం
ఎన్నో అవమానాలు దాటుకుని ఉక్కుమనిషిలా మారారు. ఒకసారి జయలలిత గారిని చంపడానికి కుట్ర కూడా జరిగింది. మీనం బాకం విమానాశ్రయంలో తృటిలో తప్పించుకున్నారు. అందుకే జయలలిత గారు కఠినంగా మారారు. పార్టీ వాళ్ళు, మంత్రులు ఆమెకి వంగి నమస్కారాలు చేస్తారు. అలా చేయడాన్ని జయలలిత గారు వద్దని చెప్పలేదు. దాని వెనుక ఉన్న కారణం చాలా బలమైనది. ఆమె ఒంటరి మహిళ.. అందరినీ అలా కంట్రోల్ చేయకపోతే పార్టీని ఇంతకాలం నడిపేవారు కాదు’ అని జయసుధ పేర్కొన్నారు.
జయసుధ వ్యాఖ్యలు జయలలిత జీవితంలోని పోరాటాన్ని, ఆమె ఎందుకు అంత కఠినంగా మారాల్సి వచ్చిందో స్పష్టం చేస్తున్నాయి. ఆమె ఉక్కు సంకల్పం, నాయకత్వ లక్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ వ్యాఖ్యలు సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.


