
📌 Key Points
- జార్ఖండ్‌లోని రెండు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ ప్రారంభం.
- జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్ విజయం దాదాపు ఖాయం.
- రెండో సీటు కోసం కాంగ్రెస్, బీజేపీ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థి మధ్య పోటీ.
- క్రాస్ ఓటింగ్ భయాల నడుమ భారీ భద్రతా ఏర్పాట్లు.
జార్ఖండ్‌లో రెండు రాజ్యసభ స్థానాల భర్తీకి పోలింగ్ ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో, అధికార కూటమికి మెజారిటీ ఉన్నప్పటికీ, రెండో సీటు కోసం కాంగ్రెస్, బీజేపీ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
జార్ఖండ్‌లో రాజ్యసభ పోలింగ్ ప్రారంభం
జార్ఖండ్ లోని రెండు రాజ్యసభ స్థానాల భర్తీకి గురువారం ఉదయం.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్ ప్రారంభమయింది. ఈ రెండుస్థానాల కోసం ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి అయిన పరిమల్ నత్వానికి బీజేపీ మద్దతివ్వగా.. జేఎంఎం నుంచి బైద్యనాథ్ రామ్, కాంగ్రెస్ నుంచి ప్రణవ్ ఝా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలవ్వగా.. సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగనుంది. క్రాస్ ఓటింగ్ భయాల నడుమ.. భద్రతా ఏర్పాట్లు భారీగా చేశారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు.. తర్వాత ఫలితాన్ని ప్రకటించనున్నారు.
జార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఎగువసభకు ఎన్నికవ్వాలంటే.. ఒక్కో అభ్యర్థికి సుమారు 28 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు అవసరం. NDA కూటమికి ఇక్కడ 24 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇండియా కూటమికి 56 మంది సభ్యుల బలం ఉంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు తమదే అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే.. అధికార జేఎంఎం పార్టీకి ఒంటరిగానే 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఆ పార్టీ అభ్యర్థి బైద్యనాథ్ రామ్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్‌కు 16 మంది, ఆర్జేడీకి నలుగురు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో రాజ్యసభ స్థానంపైనే నెలకొంది. ఈ సీటు కోసం కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా, ఎన్డీయే మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వాని మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంది.
ఒక సీటు ఖాయం.. రెండో సీటుపై ఉత్కంఠ
క్రాస్ ఓటింగ్ భయాలు.. భద్రత కట్టుదిట్టం
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు స్పష్టంగా కనిపిస్తుండగా, రెండో సీటు విజయంపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, క్రాస్ ఓటింగ్ భయాలు, రాజకీయ సమీకరణాలు ఈ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చాయి.


