
కమల్‌హాసన్, రజనీకాంత్ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా కమల్‌హాసన్ తానే స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.
Key Points
కమల్, రజనీకాంత్ మల్టీస్టారర్ మూవీకి సన్నాహాలు ఖరారు.
దర్శకత్వంపై సస్పెన్స్; తొలుత లోకేష్ పేరు, ఇప్పుడు కమల్ డైరెక్షన్?
పాత్రలు, సన్నివేశాలపై శ్రద్ధ కోసం కమల్ తానే దర్శకత్వం వహించాలని ఆలోచన.
ఐశ్వర్య, శ్రుతీహాసన్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారని తాజా టాక్.
కమల్-రజనీ మల్టీస్టారర్: అంచనాలు
హీరోలు కమల్‌హాసన్ , రజనీకాంత్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీకి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కమల్‌తో కలిసి సినిమా చేస్తున్నట్లు రజనీ కూడా ఖరారు చేశారు. నాలుగు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి చేయనున్న ఈ మల్టీస్టారర్ మూవీపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తొలుత దర్శకుడు లోకేష్ కనగరాజ్, ఆ తర్వాత మరికొందరి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి.
కమల్‌హాసన్ దర్శకత్వంలో సినిమా?
తాజాగా ఈ చిత్రానికి కమల్‌హాసన్ దర్శకత్వం వహించనున్నారని కోలీవుడ్ టాక్. రజనీకాంత్‌తో పాటు తాను నటిస్తున్న చిత్రం కనుక క్యారెక్టరైజేషన్స్ , పాత్రల నడివి, సన్నివేశాలు.. వంటి అంశాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కమల్ భావిస్తున్నారట. ఇందుకోసం తానే దర్శకుడిగా రంగంలోకి దిగాలని కమల్ ఆలోచన అని కోలీవుడ్ భోగట్టా.
నిర్మాతలపై తాజా అప్‌డేట్
ఈ చిత్రాన్ని కమల్‌హాసన్ తో కలిసి ఉదయనిధి స్టాలిన్ నిర్మించనున్నారనే టాక్ గతంలో తెరపైకి వచ్చింది. కానీ, తాజాగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, కమల్‌హాసన్ కుమార్తె శ్రుతీహాసన్ నిర్మించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రచారంలో ఉన్నట్లు ఈ విషయాలపై స్పష్టమైన సమాచారం రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
మొత్తానికి కమల్-రజనీ మల్టీస్టారర్ చిత్రంపై రోజుకో వార్త వస్తోంది. దర్శకత్వం, నిర్మాతల పేర్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

