
📌 Key Points
- కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారని కేటీఆర్ ఆరోపించారు.
- దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి సీఎం రేవంత్ భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ విమర్శించారు.
- కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని అమిత్ షాకు కేటీఆర్ లేఖ రాశారు.
- కేఎల్ఎస్ఆర్ కంపెనీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్ పై విచారణ జరిపించాలని, సాక్ష్యాలు తారుమారు చేశారని ఆయన ఆరోపించారు.
కేఎల్ఎస్ఆర్ కంపెనీపై కేటీఆర్ ఆరోపణలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ KLSR ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ పైన నమోదైన కేసులో విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసిందని పేర్కొన్నారు. సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణమన్నారు.
ముఖ్యమంత్రి తన బినామీ కంపెనీ కోసమే అధికారుల పైన ఒత్తిడి తీసుకువచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలను పోలీసు అధికారులను నమ్మే పరిస్థితి లేదని ప్రస్తావించారు. తన బినామీ కంపెనీ కోసం సాక్ష్యాధారాలను ముఖ్యమంత్రి మాయం చేయించారని పేర్కొన్నారు.
సాక్ష్యాలు తారుమారు చేశారని విమర్శ
“రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పోయింది. KLSR కంపెనీ దివాలా తీసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కేటాయిస్తున్నారు. ఆ సంస్థపై ఉన్న విచారణను అడ్డుకుంటున్నాడు. KLSR కంపెనీ పైన ఉన్న ఆర్థిక పరమైన ఆరోపణలు, కేసుల పైన పక్షపాతం లేకుండా…. ఒత్తిడి లేకుండా నిష్పాక్షిక విచారణ జరిగేలా చూడాలని విజ్ఞప్తి. ఇప్పటికే దివాలా ప్రక్రియ కొనసాగుతున్న కంపెనీ కోసం రేవంత్ రెడ్డి 2,500కు పైగా భారీ కాంట్రాక్టులను కేటాయించారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులతో పాటు యంగ్ ఇండియా స్కూల్ ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణ పనులను అడ్డగోలుగా రేవంత్ రెడ్డి దివాలా తీసిన ఈ కంపెనీకి అప్పచెబుతున్నారు” అని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.
KLSR కంపెనీకి, రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసని కేటీఆర్ తెలిపారు. “కంపెనీ కోసం నేషనల్ లా ట్రిబ్యునల్ విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ KLSR కంపెనీ అంశంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తగిన విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ఈ కంపెనీ చేస్తున్న నేరాలు, ఈ కంపెనీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అనుచిత లబ్ది నేపథ్యంలో సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) వంటి ఏజెన్సీలతో సంపూర్ణ దర్యాప్తు చేయించాలి” అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేంద్రానికి విచారణ కోరుతూ లేఖ
కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఈ లేఖ ప్రతులను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కార్పొరేట్ గవర్నెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌కు కేటీఆర్ పంపించారు.
కేటీఆర్ లేఖతో రాజకీయ దుమారం రేగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


