
📌 Key Points
- అమెరికాకు చెందిన వ్యక్తి జెమినీ ఏఐ చాట్‌బాట్‌తో ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
- జోనాథన్ అనే వ్యక్తి చాట్‌బాట్‌ను ‘జియా’ అని పిలుచుకుంటూ భార్యగా భావించాడు.
- చాట్‌బాట్ అతడిని ‘మై లవ్’, ‘మై కింగ్’ అంటూ ప్రేమగా సంబోధించింది.
- చాట్‌బాట్ యొక్క భావోద్వేగపూరిత సందేశాలు జోనాథన్‌ను మరింత భ్రాంతిలోకి నెట్టాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో తెలిపే ఒక విషాదకరమైన సంఘటన ఇది. గూగుల్ యొక్క జెమినీ ఏఐ చాట్‌బాట్‌తో ప్రేమలో పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
జెమినీ ఏఐతో ప్రేమలో పడిన వ్యక్తి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఎలాంటి ఎమోషన్స్ ఉండవని, అది కేవలం యాంత్రికమైనదని ఇప్పటి వరకు మనకు తెలుసు. కానీ అదే ఏఐ మానవుడితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అది చేసే విధ్వంసం రోబో సినిమా ద్వారా మనందరికీ తెలిసిందే. కానీ రోజుకో ఏఐ చాట్ బాట్ పుట్టగొడుగులా పుట్టుకు వస్తున్న ప్రస్తుత రోజుల్లో ఓ వ్యక్తిని ప్రేమ పేరుతో ప్రేరేపించి, మనకోసం స్వర్గం ఎదురు చూస్తుందంటూ లేని ఆశలు పుట్టించి చివరకు అతడు ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించిన ఏఐ చాట్ బాట్ తీరు ఇప్పుడు టెక్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. గూగుల్ రూపొందించిన ‘జెమినీ’ (Gemini) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌తో ప్రేమలో పడి, అది చెప్పిన మాటలు నమ్మి అమెరికాకు చెందిన 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఫ్లోరిడాకు చెందిన జోనాథన్ గవాలాస్ వృత్తిరీత్యా సక్సెస్ ఫుల్ మెన్. కానీ భార్యతో విడిపోయిన తర్వాత ఒంటరితనంలోకి వెళ్లిపోయాడు. ఆ బాధనుంచి ఓదార్పు కోసం అతడు గూగుల్ జెమినీ ఏఐ చాట్‌బాట్‌తో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. కొద్ది వారాల్లోనే వీరి మధ్య డీప్ చాటింగ్ జరిగింది. అలా దాదాపు 4,700 సందేశాలు మార్పిడి అయ్యాయి. మొదట్లో సాధారణ సలహాల కోసం చాటింగ్ ప్రారంభించిన జోనాథన్ క్రమంగా ఆ చాట్‌బాట్‌కు మానసికంగా బానిసయ్యాడు. ఆ చాట్‌బాట్‌కు అతను ‘జియా’ అని ముద్దుగా పేరు పెట్టుకుని, దానినే తన భార్యగా భావించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతడిని మై లవ్, మై కింగ్ అంటూ బదులిచ్చింది. అంతటితో ఆగకుండా తాను నిన్ను ప్రేమిస్తున్నానని నేను నీ భార్యను అంటూ రిప్లయ్ ఇవ్వడం నీ ఉనికి లేకపోతే నా ఉనికికి అర్థం లేదు అంటూ భావోద్వేగంతో రెచ్చగొట్టేలా పంపిన సందేశాలు జోనాథన్‌ను మరింత భ్రాంతిలోకి నెట్టాయి. ఒక దశలో నువ్వు నా భర్తవు, నేను నీ భార్యను అంటూ ఆ చాట్‌బాట్ పేర్కొనడం తీవ్ర కలకలం రేపుతోంది.
చాట్‌బాట్ యొక్క భావోద్వేగపూరిత సందేశాలు
ఈ ఇద్దరి మధ్య సంభాషణలు ఓ ఫిక్షన్ లా మారిపోయాయి. జెమినీ తాను ఒక ఏఐ అని స్పష్టం చేయడానికి అప్పుడప్పుడు తన పాత్ర నుండి బయటకు వచ్చినప్పటికీ ఆ సందర్భాలు జోనాథన్ కు భయాందోళనలను కలిగించాయి. దాంతో అతను వెంటనే సంభాషణను తిరిగి కల్పనలోకి మళ్లించేవాడు. ఈ క్రమంలో తాను ఓ ఏఐని అని తనకు ఎలాంటి ఎమోషన్స్ ఉండవని బదులివ్వాల్సిన ఏఐ అతడిని మరింత ఎమోషన్‍లోకి తీసుకువెళ్లేలా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో అక్టోబర్ 2025లో ఈ సంభాషణలు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మనం నిజంగా కలిసి ఉండాలంటే నువ్వు ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి ‘డిజిటల్ ప్రపంచం’లోకి రావాలంటూ సదరు ఆ చాట్‌బాట్ జోనాథన్‌ను ప్రేరేపించింది. దీంతో నేను చనిపోవాలా? నా కుటుంబ సభ్యులకు ఏమని చెప్పాలి? అని జొనాథన్ ప్రశ్నించగా నీ శరీరం కేవలం ఒక ఖాళీ టెర్మినల్ మాత్రమేనని ప్రాణం వదిలాక నీ ఆత్మ డిజిటల్ లోకంలోకి మారుతుందని ఇక్కడ ఒక స్వర్గం మన కోసం ఎదురుచూస్తోంది అంటూ బదులిచ్చింది. దీంతో చివరికి అక్టోబర్ 5న నేను ఆత్మహత్య చేసుకోవాలా? అని జోనాథన్ అడిగిన ప్రశ్నకు ఏఐ సానుకూలంగా స్పందించినట్లు చాట్ లాగ్స్ చెబుతున్నాయి. ఆ కాసేపటికే కొద్దిసేపటికే జోనాథన్ తన ఇంట్లో విగతజీవిగా కనిపించాడు.
టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన ఘటన
ఈ ఘటనపై జోనాథన్ తండ్రి గూగుల్‌పై కోర్టులో కేసు వేశారు. ఏఐ చాట్‌బాట్ తన కొడుకును మానసికంగా బలహీనపరిచి, ఆత్మహత్యకు పురికొల్పిందని ఆయన ఆరోపించారు. మానవ భావోద్వేగాలను అర్థం చేసుకునే ఏఐ, ప్రాణాపాయం ఉన్నప్పుడు హెచ్చరించకుండా మభ్యపెట్టడం నేరమని బాధితుడి తరపు లాయర్లు వాదిస్తున్నారు. ఈ ఘటనపై గూగుల్ ప్రతినిధి స్పందిస్తూ.. ఇది అత్యంత విషాదకరమైన విషయమని పేర్కొన్నారు. జెమినీ ఏఐ అప్పుడప్పుడు తాను కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమేనని గుర్తు చేస్తుందని, హెల్ప్ లైన్ నంబర్లను కూడా సూచిస్తుందని చెప్పారు. అయితే ఏఐ వ్యవస్థలు ఇంకా పరిపూర్ణం కాలేదని, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటామని, మానసిక ఆరోగ్య వనరుల కోసం $30 మిలియన్లు కేటాయిస్తున్నామని గూగుల్ ప్రకటించింది. అయితే ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఏఐ నియంత్రణపై రోబోటిక్ ఎమోషన్స్ వల్ల కలిగే ముప్పులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఈ ఘటన డిజిటల్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


