
‘బాహుబలి’ రీ-రిలీజ్ తో భారీ వసూళ్లు సాధించగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాజమౌళి ‘బాహుబలి’ని రెండు భాగాలుగా తీయడం వల్లే తాను ‘పొన్నియిన్ సెల్వన్’ తీయగలిగానని ఆయన తెలిపారు. ఈ పాత వీడియో ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Key Points
'బాహుబలి' రీ-రిలీజ్‌కి రూ.25 కోట్ల భారీ కలెక్షన్లు వచ్చాయని వార్తలు.
రీ-రిలీజ్ అయిన సినిమాలకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే తొలిసారని సినీ విశ్లేషకుల అభిప్రాయం.
'బాహుబలి' లేకపోతే తాను 'పొన్నియిన్ సెల్వన్' తీసేవాడిని కాదని మణిరత్నం గతంలో చెప్పిన వీడియో వైరల్.
రాజమౌళి తన సినిమాను రెండు భాగాలుగా తీయడం వల్లనే తాము 'పొన్నియిన్ సెల్వన్' తీయగలిగామని మణిరత్నం అన్నారు.
‘బాహుబలి’ రీ-రిలీజ్ సంచలనం
పదేళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ‘బాహుబలి’ని ఇప్పుడు రీరిలీజ్ చేశారు. రెండు భాగాల్ని కలిపి ఒక్కటిగా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వీకెండ్ అయ్యేసరికి ఏకంగా రూ.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. ఇది నిజమైతే మాత్రం రికార్డే. ఎందుకంటే రీ రిలీజ్ మూవీస్‌కి ఈ రేంజు వసూళ్లు ఎప్పుడూ రాలేదు. మరోవైపు ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. ‘బాహుబలి’ లేకపోతే తాను ఆ సినిమాల్ని తీసేవాడిని కాదని చెబుతున్నా ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మణిరత్నం సంచలన వ్యాఖ్యలు
ఏంటి విషయం? ‘బాహుబలి’ సినిమా మన దేశంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. తెలుగు మూవీకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేయడంతో పాటు ఓ కథని రెండు భాగాలుగా కూడా చెప్పొచ్చనే దారిని దర్శకులకు చూపించింది. గతంలో అంటే 2022లో ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ పేరుతో ఓ సదస్సు జరిగింది. ఇందులో మాట్లాడిన డైరెక్టర్ మణిరత్నం.. ‘బాహుబలి’ లేకపోయింటే తాను ‘పొన్నియిన్ సెల్వన్’ తీసేవాడిని కాదని అన్నారు.
‘పొన్నియిన్ సెల్వన్’ వెనుక రాజమౌళి స్ఫూర్తి
”బాహుబలి’ లేకపోతే ‘పొన్నియిన్ సెల్వన్’ లేదు. రాజమౌళి తన సినిమాను రెండు భాగాలుగా తీయకపోతే నేను ఈ చిత్రాన్ని తీసేవాడిని కాదు. ఇదే విషయాన్ని నేను రాజమౌళిని కలిసినప్పుడు చెప్పాను. రాజమౌళి మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా చేశారు. ఆయన అలా చేయడం వల్లే మేము కూడా ఒక సినిమాను రెండు భాగాలుగా తీయగలిగాం’ అని మణిరత్నం చెప్పారు. పాత వీడియోనే అయినప్పటికీ అది ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
మణిరత్నం వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మరోసారి పెద్ద చర్చకు దారితీశాయి. ఒక గొప్ప సినిమా మరో అద్భుత చిత్ర నిర్మాణానికి ఎలా స్ఫూర్తినిస్తుందో ఇది నిరూపించింది. రాజమౌళి కృషికి ఇది నిజమైన గుర్తింపుగా నిలుస్తోంది.


