|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రపంచ యుద్ధ భయం: సముద్రంలో 400 నౌకల దిగ్బంధం! ఏం జరుగుతోంది?

Published: 26-03-2026, 8:35 AM
ప్రపంచ యుద్ధ భయం: సముద్రంలో 400 నౌకల దిగ్బంధం! ఏం జరుగుతోంది?
  • హోర్ముజ్ జలసంధి మూతపడటంతో గల్ఫ్ దేశాల ఎగుమతులు నిలిచిపోయాయి.
  • ప్రపంచానికి 20% ఆయిల్, ఎల్ఎన్జీ ఈ జలసంధి నుంచే రవాణా అవుతోంది.
  • నెల రోజులుగా 400 ఓడలు, 40 వేల మంది నావికులు సముద్రంలో చిక్కుకుపోయారు.
  • సముద్రంలో ఓడల ట్రాఫిక్ జామ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వద్ద భారీగా నౌకలు నిలిచిపోయాయి. దీని కారణంగా గల్ఫ్ దేశాల నుంచి జరిగే ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది.

హోర్ముజ్ జలసంధి మూసివేత – కారణాలు

ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో విమాన సర్వీసులు సైతం నిలిచిపోయాయి. ఇదే క్రమంలో సముద్రంలో వందలాది ఓడలు సైతం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి దగ్గర ఓడలతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఓ నెటిజన్ విమానం విండో నుంచి తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రపంచంపై చమురు, గ్యాస్ ప్రభావం

ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ వారి దాడులను తిప్పికొడుతూనే అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి పెంచేందుకు తన ఆధీనంలో ఉన్న హోర్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఎగుమతులు మొత్తం ఆగిపోయాయి. ముఖ్యంగా ఈ జలసంధి నుంచి ప్రపంచ దేశాలకు 20శాతం ఆయిల్, 20శాతం ఎల్ఎన్జీ రవాణా అవుతుంది. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఎంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్ హోర్ముజ్ జలసంధి నుంచి ఏ ఒక్క నౌకను వెళ్లనీయకపోవడంతో పర్షియన్ గల్ఫ్ సముద్రంలో సుమారు 300 నుంచి 400 భారీ రవాణా షిప్స్ నిలిచిపోయాయి.

సముద్రంలో చిక్కుకున్న నావికులు

హోర్ముజ్ జలసంధి నుంచి రోజుకు వంద నుంచి 150 ఓడలు వెళ్తుంటాయి. కానీ ఇరాన్ ఆంక్షల నేపథ్యంలో గడిచిన నెల రోజుల నుంచి 100 నౌకలకు మించి ఈ మార్గం గుండా వెళ్లలేకపోయాయంటే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హోర్ముజ్ జలసంధిని బ్లాక్ చేయడం వల్ల నెల రోజులుగా 400 వరకు ఓడలు సముద్రంలోనే నిలిచిపోయాయి. వీటిల్లో 40 వేల మంది నావికులు సైతం చిక్కుకుపోయారు. తాజాగా విమానం విండో నుంచి ఓ ప్రయాణికుడు తీసిన ఫొటో సముద్రంలో ఏర్పడిన నౌకల ట్రాఫిక్‌ జామ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. చిన్నచిన్న బొమ్మల్లా సముద్రంలో తేలియాడుతున్న భారీ నౌకలను ఫొటోలో చూడవచ్చు. వీటిని చూసిన నెటిజన్స్ భూమి, ఆకాశమే కాదు.. ఇప్పుడు సముద్రంలో కూడా టాఫ్రిక్ జామ్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హోర్ముజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచ దేశాల దిగుమతులు, ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. యుద్ధం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.