
📌 Key Points
- చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం రూ. 400 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది.
- ఈ సినిమా జీ5 ఓటీటీలో 500 మిలియన్ల వ్యూవర్‌షిప్‌ను పొందింది.
- 40 రోజుల తర్వాత కూడా 70కి పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
- నైజాం, వైజాగ్, రాయలసీమ ప్రాంతాల్లో ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా 40 రోజులు పూర్తి చేసుకుని, 70 కి పైగా థియేటర్లలో ఇంకా విజయవంతంగా నడుస్తోంది. అంతేకాకుండా, జీ5 ఓటీటీలో కూడా విశేష ఆదరణ పొందుతోంది.
400 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన MSG మూవీ
MSG Movie: ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి (Megastat Chiranjeevi) తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టి, రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలోకి కూడా వచ్చేసింది. జీ5 ఓటీటీలో కూడా ఈ సినిమా (MSG Movie) ట్రెమండస్ స్పందనను రాబట్టుకుని 500 మిలియన్లకు పైగా వ్యూవర్‌షిప్‌ని రాబట్టినట్లుగా ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఓటీటీలోకి వచ్చినా కూడా ఈ సినిమా ఇంకా థియేటర్లలో ప్రదర్శింపబడుతూనే ఉంది. 40వ రోజు ఈ సినిమా దాదాపు 70కి పైగా డైరెక్ట్ థియేటర్లలో రన్నింగ్ అవుతుండటం విశేషం.
జీ5 ఓటీటీలో ట్రెమండస్ రెస్పాన్స్
ఈ సినిమా 40 రోజుల డైరెక్ట్ రన్నింగ్ సెంటర్స్ లిస్ట్ అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లిస్ట్‌లో ఈ సినిమా ఏయే ఏరియాల్లో, ఏయే థియేటర్‌లో ప్రదర్శింపబడుతుందో వివరంగా ఉంది. నైజాం, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, రాయలసీమలోని దాదాపు 75కి పైగా డైరెక్ట్ సెంటర్స్‌లో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అంతేకాదు, ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఓ థియేటర్‌లో ఈ సినిమా ఇంకా రన్ అవుతుండటం విశేషం. వాస్తవానికి ఈ మధ్యకాలంలో రెండు వారాలు థియేటర్లలో రన్ అయితే, పెద్ద హిట్ అయినట్టే భావించాల్సిన పరిస్థితి. అలాంటిది 6 వారాలుగా దాదాపు 100 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుండటం, నిజమైన సక్సెస్‌కు కొలమానంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో మళ్లీ పాత రోజులను గుర్తుకు తెచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
40 రోజుల తర్వాత కూడా థియేటర్లలో రన్ అవుతున్న సినిమా
ఈ సినిమా రిలీజైన తొలిరోజు నుంచి పాజిటివ్ టాక్‌తో మొదలై జైత్రయాత్రను కొనసాగిస్తూ వస్తుంది. అందులో ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా థియేటర్లలో రన్ అవడమంటే మాములు విషయం కానే కాదు. ముఖ్యంగా నైజాం, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ వంటి అన్ని ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల జాబితాను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ జాబితాను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది కదా సక్సెస్ అంటే అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డెన్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
మొత్తానికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికీ థియేటర్లలో కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతూ, చిరంజీవి కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది.


