
జీ5 ఓటీటీలో విడుదలైన ‘కాళీధర్ లాపతా’ సినిమా ప్రేక్షకులను భావోద్వేగాలతో నింపుతుంది. అభిషేక్ బచ్చన్ నటన, కథాంశం ప్రత్యేక ఆకర్షణ. కుటుంబ బంధాల ప్రాముఖ్యతను ఈ సినిమా చాటుతుంది.
Key Points
అభిషేక్ బచ్చన్ అద్భుతమైన నటన
గుండెల్ని పిండేసే భావోద్వేగ కథ
జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
కాళీధర్ లాపతా: కథాంశం
ఓటీటీలోకి కొన్ని చిన్న సినిమాలు నేరుగా వస్తున్నాయి. కానీ ఇవి మన మనసుపై చెరగని ముద్ర వేస్తున్నాయి. అలాంటి సినిమానే జీ5 ఓటీటీలో వచ్చి కాళీధర్ లాపతా (Kaalidhar Laapata). 2019లో వచ్చిన తమిళ సినిమా కే.డీ సినిమాకు ఇది రీమేక్. రోజురోజుకీ పతనమవుతున్న కుటుంబ బంధాలు, మానవ సంబంధాల చుట్టూ తిరిగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది.
జీ5 ఓటీటీ లోకి జులై 4న నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమా కాళీధర్ లాపతా. అంటే కాళీధర్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడని అర్థం. ఈ సినిమాలో కాళిధర్ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించాడు. మతిమరుపుతో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి ఈ కాళిధర్. అతని పేరు మీద ఉన్న ఆస్తులను హాస్పిటల్ బెడ్ పై అచేతనంగా ఉన్న సమయంలో వేలి ముద్ర తీసుకొని తమ పేరిట రాయించుకునే సొంత తమ్ముళ్లు.. తర్వాత కాళిధర్ ను వదిలించుకోవాలని చూస్తారు.
దీనికోసం అతన్ని కుంభమేళాకు తీసుకెళ్లి వదిలేస్తారు. వాళ్లను వెతుక్కుంటూ వెళ్లే కాళీధర్ కు అతని మరదలి మాటలు విని మళ్లీ ఇంటికి వెళ్లకూడదనుకుంటాడు. కనిపించిన బస్ ఎక్కేసి వెళ్లిపోతాడు. ఓ ఊరికి వెళ్లిన అతడికి అక్కడ ఓ అనాథ పిల్లాడైన భల్లు కలుస్తాడు. ఒకరి జీవితంలోకి మరొకరు వచ్చిన తర్వాత వీళ్లిద్దరి జీవితాలు ఎలా మారిపోయాయి? ఒకరిని వదిలి మరొకరు ఉండలేని స్థాయికి వీళ్ల స్నేహం ఎలా ఎదిగింది అన్నదే ఈ కాళిధర్ లాపతా మూవీ స్టోరీ.
అభిషేక్ బచ్చన్ నటన
కాళీధర్ లాపతా ఓ గుండెల్ని పిండేసే ఎమోషనల్ స్టోరీ. దానిని తెరపైన కూడా అంతే హృద్యంగా చూపించారు డైరెక్టర్ మధుమిత. ప్రతి హ్యూమన్ ఎమోషన్ ను టచ్ చేస్తూ సాగిపోతుంది. ఇంట్లో వాళ్లే తనను వద్దని వదిలించుకున్న దుస్థితిలో ఓ అనాథ పిల్లాడు.. కాళీధర్ జీవితాన్ని ఎలా మార్చేస్తాడన్నది తెరపై చూపించిన విధానం అద్భుతం.
అందరూ ఉన్నా అనాథలా మిగిలిపోయిన వ్యక్తి, నాలుగు రోజుల వయసులోనే తల్లిదండ్రులు వదిలేయడంతో అనాథగా మారిన పిల్లాడి మధ్య బంధం మన మనసుల్ని తాకుతుంది. యంత్రాల్లాంటి జీవితాలు గడుపుతున్నా ఇప్పటికీ ఎక్కడో మన గుండె లోతుల్లో మిగిలిపోయిన తడిని తట్టి లేపేలా సాగిపోతుందీ సినిమా. 40 ఏళ్ల వయసులో ఇక జీవితమంతా అయిపోయిందనుకున్న పరిస్థితుల్లో ఆ వ్యక్తి తీరని కోరికలేంటో తెలుసుకొని ఆ అనాథ పిల్లాలు తీర్చే సీన్లు మనల్ని కంటతడి పెట్టిస్తాయి.
భావోద్వేగంతో నిండిన సినిమా
ఈ కాళీధర్ లాపతా మూవీ చూసిన తర్వాత హ్యాట్సాఫ్ అభిషేక్ బచ్చన్ అనకుండా ఉండలేము. తన కెరీర్లోనే బెస్ట్ పాత్రల్లో ఒకటని చెప్పొచ్చు. కాళిధర్ పాత్రలో అతడు జీవించేశాడు. ఈ సినిమాకు అతని నటనే సగం బలం. ఇక భల్లు అనే అనాథ పిల్లాడి పాత్ర పోషించిన దైవిక్ భగేలా నటన మరో లెవెల్. సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నా.. ప్రధానంగా ఈ ఇద్దరి చుట్టే తిరుగుతుంది.
వీళ్లిదరూ కలిసి కనిపించే ప్రతి సీన్ మన మనసును హత్తుకుంటుంది. ఇక సినిమా క్లైమ్యాక్స్ కూడా అంతే. ఎవరూ ఊహించనిదే. ఓ విషాదకర ముగింపు వస్తుందనుకునే వేళ.. డైరెక్టర్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల పెదాలపై ఓ చిరునవ్వును తీసుకొస్తుంది. జీవిత సారాంశాన్ని గంటా 50 నిమిషాల నిడివిలోనే అందించిన ఈ కాళిధర్ లాపతా సినిమా ఓ మస్ట్ వాచ్. జీ5 ఓటీటీలో ఉన్న ఈ మూవీని వెంటనే చూసేయండి.
కాళీధర్ లాపతా చూసిన తర్వాత, అభిషేక్ బచ్చన్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. ఈ సినిమా అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుంది.


