
📌 Key Points
- నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది.
- 31 ఏళ్లు వచ్చినా మోక్షజ్ఞ ఇంకా సినిమాల్లోకి అడుగు పెట్టలేదు.
- ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోవడం, ఆదిత్య 99 మ్యాక్స్ ప్రకటన తర్వాత నిలిచిపోవడం జరిగాయి.
- బడ్జెట్ సమస్యల కారణంగా మోక్షజ్ఞ సినిమాలు ఆలస్యం అవుతున్నాయని సమాచారం.
నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. 31 ఏళ్ళు గడిచినా, ఆయన ఇంకా వెండితెరపై కనిపించలేదు. దీనికి గల కారణాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూపులు
Mokshagna Debut: నందమూరి అభిమానులే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులు కూడా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈయన్ని స్క్రీన్ పైన చూస్తామా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ కుమారుడిగా ఆయన సినీ ఎంట్రీపై చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా మొదలుకాలేదు. అందుకే మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా తెరపైకి వస్తాడన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది.
సాధారణంగా హీరోల వారసులు 22–25 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చేస్తారు. మొదట లవ్ స్టోరీలు చేసి, తర్వాత యాక్షన్ సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తారు. కానీ మోక్షజ్ఞ మాత్రం 31 ఏళ్ల వయసు వచ్చినా.. ఇంకా కెమెరా ముందుకు రాలేదు. అనుకున్న ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒక కారణంతో ఆగిపోతోంది. ఆ కారణం కూడా బయటపడడం లేదు.
మొదట హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. ఫోటోలు కూడా విడుదలయ్యాయి. కానీ ఆ సినిమా సెట్స్‌పైకి రాకముందే క్యాన్సిల్ అయింది. తర్వాత బాలయ్య తన అన్‌స్టాపబుల్ షోలో ఆదిత్య 369 సీక్వెల్ – ఆదిత్య 99 మ్యాక్స్ అంటూ మరో పెద్ద అనౌన్స్‌మెంట్ చేశారు. ఇందులో మోక్షజ్ఞ లీడ్‌గా ఉంటాడని చెప్పారు. దీంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి.
ఆగిపోయిన మోక్షజ్ఞ ప్రాజెక్టులు
కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పటివరకు మొదలుకాలేదు. కథ, దర్శకుడు, బడ్జెట్ విషయాల్లో క్లారిటీ రాకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మొదట ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆయన కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. సోషియో ఫాంటసీ మూవీ కావడంతో భారీ బడ్జెట్ అవసరం అవుతుందని, ఆ రిస్క్ తీసుకోవడానికి నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారని టాక్.
ఇన్ని ఏళ్లుగా సినిమాలపై వార్తలు వచ్చినా ఒక్కటి కూడా వర్కవుట్ కాకపోవడంతో నందమూరి అభిమానులు కూడా మెల్లగా ఆసక్తి తగ్గించుకుంటున్నారు. యాక్టింగ్‌పై నిజంగా ఆసక్తి ఉంటే అవకాశాలు రావడం పెద్ద కష్టం కాదు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
నిరాశలో నందమూరి అభిమానులు
ఇప్పటికే 30 ప్లస్ వయసులోకి వచ్చిన మోక్షజ్ఞ అసలు ఏ వయసులో హీరోగా పరిచయం అవుతాడో అన్నది ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న పెద్ద ప్రశ్న. భవిష్యత్తులో అయినా స్పష్టమైన నిర్ణయం తీసుకుని అభిమానుల ఆశలు నెరవేర్చుతాడేమో చూడాలి.
మొత్తానికి మోక్షజ్ఞ ఎప్పుడు తెరంగేట్రం చేస్తాడో వేచి చూడాలి. అభిమానుల ఆశలు నెరవేరుతాయో లేదో కాలమే నిర్ణయిస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.


