
తిరుపతికి సమీపంలో ఉన్న నారాయణవనం, పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్న పవిత్ర క్షేత్రం. ఈ ఆలయం, దాని ప్రాముఖ్యత, చరిత్ర గురించి తెలుసుకుందాం.
Key Points
నారాయణవనంలో పద్మావతి-శ్రీనివాసుల వివాహం జరిగింది.
ఈ ఆలయంలో వేంకటేశ్వరుని వక్షఃస్థలంలో లక్ష్మీదేవి మాత్రమే కనిపిస్తుంది.
ఆలయంలో శ్రీనివాసుడు వేటకు వెళ్ళినపుడు ఉపయోగించిన వేటఖడ్గం ఉంది.
పారిజాత వృక్షం శ్రీకృష్ణుడు సత్యభామ కోసం నాటాడని ప్రతీతి.
నారాయణవనం: పద్మావతి-శ్రీనివాసుల పరిణయ క్షేత్రం
పద్మావతిని వివాహం చేసుకోడానికి నారాయణుడు వరుడిగా వచ్చిన ఆ పవిత్రక్షేత్రమే తిరుపతికి సమీపంలోని నారాయణవనం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కుడిచేతికి కల్యాణ కంకణం, నడుముకు దశావతార వడ్డాణంతో అలరారే శ్రీవేంకటేశ్వరుణ్ణి చూస్తే కల్యాణశోభ ఉట్టిపడుతుంది.
కలియుగ ప్రత్యక్షమైన వేంకటేశ్వరుడు ‘కల్యాణ వేంకటేశ్వరుడు’గా వెలసిన ఆ క్షేత్రమే ‘నారాయణవనం’. పద్మావతీ–శ్రీనివాసుల పరిణయం వైశాఖ మాస శుక్లపక్ష దశమి నాడు (శుక్రవారం) నారాయణవనంలో జరిగింది. ఐదు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకల్లో చివరి రోజున కల్యాణం నిర్వహించారు.
శ్రీనివాసుడు తన కల్యాణానికి కుబేరుడి దగ్గర అప్పు చేశాడని పురాణ వాక్యం. ఈ ఋణం ఇప్పటికీ వడ్డీతో సహా చెల్లిస్తున్నాడని నమ్మకం అని బ్రహ్మశ్రీ చిలకమర్తి తెలిపారు. నారాయణుడు ఈ ప్రాంతంలో వరుడిగా అడుగుపెట్టాడు కాబట్టి దీనికి నారాయణవరం అనే పేరు వచ్చింది. వివాహం జరిగిన ప్రాంతంలో అప్పట్లో ఆకాశరాజు చిన్న గుడిని నిర్మించాడనీ, ఆ తరువాత యాదవరాజులు, కార్వేటినగర సంస్థానాధీశులు, శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారనీ చెబుతారు.
ఆలయ ఆవరణలో పద్మావతి అమ్మవారి సన్నిధి, గోదాదేవి సన్నిధి, రామాలయం ఉన్నాయి. ఆలయ ముఖద్వారంలో ఎత్తయిన గోపురం ఉంది. దీన్ని శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు నిర్మించారు. తిరుత్తణి దేవస్థానం ఆధీనంలో ఉన్న ఈ ఆలయం 1967లో తిరుమల తిరుపతి దేవస్థానం కిందికి వచ్చింది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి తెలిపారు.
ఆలయంలోని ప్రత్యేకతలు మరియు చరిత్ర
తిరుమల తిరుపతి అనుబంధ ఆలయాల్లో ఉన్న వేంకటేశ్వర స్వామికన్నా ఇక్కడి స్వామి భిన్నంగా కనిపిస్తాడు. సాధారణంగా వేంకటేశ్వరస్వామికి వక్షఃస్థలంలో ఓ వైపు లక్ష్మీదేవి, మరోవైపు పద్మావతీ అమ్మవారు కనిపిస్తారు. కానీ, ఈ ఆలయంలో స్వామి వక్షఃస్థలంలో లక్ష్మీదేవి మాత్రమే కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో పద్మావతి అమ్మవారు వేంచేసి ఉన్నందున స్వామివారి వక్షఃస్థలంలో ఆమె కనిపించదు. శ్రీనివాసుడు వేట కోసం వచ్చినప్పుడు తెచ్చినట్లుగా చెప్పే వేటఖడ్గాన్ని ఈ ఆలయంలో చూడవచ్చు అని బ్రహ్మశ్రీ తెలిపారు.
ఆలయ ఆవరణలో ఓ తిరగలి ఉంది. కల్యాణం సందర్భంగా అమ్మవారికి నలుగు పెట్టడానికి పిండికోసం దీన్ని ఉపయోగించినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న పారిజాత వృక్షం అలనాడు సత్యభామ కోసం శ్రీకృష్ణుడు తీసుకొచ్చి నాటిందని ప్రతీతి. సాధారణంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం జరుగుతుంది. కానీ, ఇక్కడ ద్వాదశి రోజున జరుగుతుంది. పెళ్లి కానివారు పద్మావతి అమ్మవారి గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే వెంటనే పెళ్లి జరుగుతుందని భక్తుల విశ్వాసం అని తెలిపారు.
పద్మావతీ–శ్రీనివాసుల కల్యాణం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో నారాయణవనం
స్వామి–అమ్మవార్ల కల్యాణానికి గుర్తుగా ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ మాసంలో వారి పరిణయం జరిగినందున ఏటా ఆ నెలలోనే (సౌరమానం ప్రకారం) ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారు పుట్టిన శ్రవణ నక్షత్రానికి పదిరోజుల ముందుగా వీటిని ప్రారంభిస్తారు. ఎనిమిదో రోజున పద్మావతీ–శ్రీనివాసుల కల్యాణం నిర్వహిస్తారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి తెలిపారు.
నారాయణవనం తిరుపతికి 40 కి.మీ. దూరంలో ఉంది. తిరుపతి–చెన్నై బస్సుల్లో వెళ్లొచ్చు. రైలు ద్వారా రేణిగుంట చేరుకుని, అక్కడినుంచి పుత్తూరు వెళ్లి ఐదు కి.మీ. దూరంలో ఉన్న నారాయణవనం చేరుకోవచ్చు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ-9494981000
నారాయణవనం భక్తులకు పవిత్రమైన స్థలం. శ్రీనివాసుని కల్యాణం జరిగిన ఈ క్షేత్రం యొక్క మహిమను తెలుసుకోవడం మనందరికీ ఆధ్యాత్మిక ప్రేరణనిస్తుంది.


