
ఈ రోజు అక్షయ తృతీయ (Akshaya Tritiya) పర్వదినం. ఈ సందర్భంగా అన్ని ఆలయాల్లో అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. ‘అక్షయ’ అంటేనే తరగనిదని అర్థం కావడంతో, ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ పవిత్ర ఘడియల్లో ప్రముఖ ఆలయాలన్నీ భక్తజనసందోహంతో పోటెత్తాయి. పుణ్యక్షేత్రాల్లో లక్ష్మీదేవికి, కుబేరునికి విశేష అభిషేకాలు, అలంకారాలు, శాంతికళ్యాణాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజే ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోవడం, సింహాచలంలో అప్పన్న నిజరూప దర్శనం కలగడం వంటి ఆధ్యాత్మిక విశేషాలతో భక్తులు పులకించిపోతున్నారు.
అధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం ఒక ఆచారంగా మారింది. ఈ రోజు పసిడిని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందనే విశ్వాసంతో జ్యువెలరీ దుకాణాలన్నీ కొనుగోలుదారులతో సందడిగా మారాయి. కేవలం కొనుగోళ్లే కాకుండా, దానధర్మాలకు కూడా ఇది అత్యంత విశిష్టమైన రోజుగా పురాణాలు చెబుతున్నాయి. పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయడం ద్వారా అక్షయమైన పుణ్యఫలం దక్కుతుందని భావిస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు, భక్తులు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.


