|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ సంచలనం! సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటనతో టాలీవుడ్‌కు కొత్త ఊపిరి!

Published: 12-03-2026, 4:05 AM
హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ సంచలనం! సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటనతో టాలీవుడ్‌కు కొత్త ఊపిరి!
  • హైదరాబాద్ హైటెక్ సిటీలో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ వీఎఫ్ఎక్స్ స్టూడియో ప్రారంభం
  • 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక హబ్ ఏర్పాటు
  • దక్షిణ భారత చలనచిత్ర, ఏవీజీసీ సూపర్‌హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి
  • సృజనాత్మక, సాంకేతిక ప్రతిభ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో తమ స్టూడియోను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై, స్థలం కేటాయింపుపై ప్రకటన చేశారు. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు ఒక మైలురాయి కానుంది.

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభం

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ‘నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్’ గ్లోబల్ వీఎఫ్ఎక్స్ (VFX), వర్చువల్ ప్రొడక్షన్ హబ్‌ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు​ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

​హైటెక్ సిటీలోని క్యాపిటలాండ్ ఐటీపీహెచ్ (ITPH)లో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెట్ ఫ్లిక్స్ ఈ అత్యాధునిక హబ్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇది నైపుణ్యం కలిగిన నిపుణులకు ఎన్నో కొత్త అవకాశాలను కల్పిస్తుంది.

ఏవీజీసీ రంగానికి తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం

హైదరాబాద్‌ను దక్షిణ భారత చలనచిత్ర, AVGC సూపర్‌హబ్‌గా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ వీఎఫ్ఎక్స్ హబ్ AVGC స్టార్టప్‌ల కోసం పెట్టుబడులు, ప్రపంచ సహకారాలను ఒకచోట చేర్చుతుంది. AI-ఆధారిత VFX సామర్థ్యాలు, పార్టనర్‌షిప్ స్టూడియోలను నిర్మిస్తుంది. వీఎఫ్ఎక్స్ రంగంలో ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌ నుంచి పని చేస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ముంబైలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లో ఇది రెండో కార్యాలయం(హైదరాబాద్) అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ ఏర్పాటుతో సృజనాత్మక, సాంకేతిక ప్రతిభ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

ఉపాధి అవకాశాలు, సాంకేతిక అభివృద్ధికి ఊతం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. చాలా మంది ఎంతో కాలంగా ఈ సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇవాళ్టితో నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని… హైదరాబాద్ వేదికగా నెట్ ఫ్లిక్స్ స్టూడియోస్ ను ఏర్పాటు చేయటాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

“నాకు సినిమాలంటే చాలా ఇష్టం. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇవాళ వీఎఫ్ఎక్స్ వరకు సాంకేతిక అభివృద్ధి చెందుతూ వస్తోంది. చెన్నైలో ఉండే సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ఆనాటి హీరోలు కృషి చేశారు. నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ కు వచ్చిందంటే హాలీవుడ్ కూడా హైదరాబాద్ కు వచ్చినట్లే. నెటిఫ్లిక్స్ ఇక్కడ నెలకొల్పిన విషయాన్ని గర్వంగా చెబుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ కార్పొరేట్ ఆఫీస్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తే… ప్రభుత్వపరంగా ఫ్యూచర్ సిటీలో భూమిని కూడా కేటాయిస్తాం” అని ప్రకటించారు.

నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ఏర్పాటుతో హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది తెలంగాణ భవిష్యత్తుకు ఒక శుభసూచకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.