|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒకే చెట్టుపై 11 రకాల మామిడి పండ్లు: ఇది ఎలా సాధ్యమైంది?

Published: 18-07-2026, 2:05 PM

మామిడి పండ్లంటే ఇష్టపడని వారుండరు. కానీ ఒకే చెట్టుపై 11 రకాల మామిడి పండ్లను పండించడం సాధ్యమేనా? అనుప్ కుమార్ బజ్‌పాయ్ అనే వ్యక్తి ఈ అద్భుతాన్ని నిజం చేసి చూపించారు. బాల్యం నుంచీ మామిడి పండ్లపై ఆయనకున్న ప్రేమ, రిటైర్మెంట్ తర్వాత ఆయన సాధించిన ఈ అద్భుతమైన ప్రయోగం గురించి తెలుసుకుందాం.

Key Points

1

అనుప్ కుమార్ బజ్‌పాయ్ ఒకే మామిడి చెట్టుపై 11 రకాల పండ్లను విజయవంతంగా పండించారు.

2

తండ్రి నుంచి మామిడి పండ్లపై అపారమైన ప్రేమను పెంచుకున్న అనుప్, బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

4

యూట్యూబ్ ద్వారా గ్రాఫ్టింగ్ పద్ధతిని నేర్చుకుని, నిపుణుల సహాయంతో ఈ అద్భుతాన్ని సాధించారు.

బాల్యం నుంచీ మామిడి పండ్లపై ప్రేమ

వయసు 60.. కానీ మనసు మాత్రం బాల్యంలోనే ఉండిపోయింది. ఆ మామిడి చెట్ల చుట్టే తిరుగుతుంది. తండ్రి లాగే తను మామిడి పండ్ల పట్ల పెంచుకున్న ప్రేమ.. ఇప్పుడు అతన్ని వైరల్ చేసింది. ఒకే చెట్టుపై 11 రకాల మామిడి కాయలు పండించిన అనుప్ కుమార్ బజ్ పాయ్ కథ తెలుసుకుందాం.

అనుప్ కుమార్ ఉత్తరప్రదేశ్‌లోని తికరియా గ్రామంలో పుట్టినప్పటికీ.. తండ్రి ఉద్యోగం బదిలీ కారణంగా పలు నగరాల్లో పెరిగాడు. తండ్రి జైలు శాఖలో సూపరింటెండెంట్‌గా 1994లో రిటైర్ అయ్యారు. మిగిలిన రోజుల్లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి వేసవి సెలవుల్లో మాత్రం గ్రామానికి వెళ్లేవారు. అన్నాదమ్ములు, కజిన్స్ అందరూ గ్రామంలో చెట్లెక్కి.. మామిడి పండ్లు కోసి అక్కడే తినేవారు. రోజంతా బయటే గడిపేవాళ్లం. అవే తన జీవితంలోనే బెస్ట్ మెమొరీస్. నగర జీవితం భిన్నంగా ఉండేది. తోటలు లేవు, చెట్ల క్రింద సమయం గడపడం లేదు. చాలా మిస్ అయ్యేవాడు. తండ్రి నుంచి వచ్చిన మామిడి ప్రేమ కూడా ఇందులో పాత్ర పోషించింది. నాన్నకి రోజుకి కేజీ మామిడి తినడం సాధారణం. ఒక్క రకం కాకుండా అన్ని రకాలు తినాలని చూసేవారు. అందువల్ల అనుప్‌కు కూడా ఆసక్తి పెరిగింది. లక్నోలో సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు మొదటి పని రెండు దశేహరి మామిడి మొక్కలు నాటడం.

రిటైర్మెంట్ తర్వాత నెరవేరిన కల

32 ఏళ్ల ప్రభుత్వ సేవలో అనుప్ కుమార్ బజ్‌పాయ్‌కు ఇష్టమైన చెట్ల కోసం సమయం దొరకలేదు. లక్నోలో రిటైర్ అయిన తర్వాత.. గ్రామంలోని తోటలు, తండ్రి తెచ్చే మామిడి బుట్టలు, బాల్యపు జ్ఞాపకాలు.. ఇవన్నీ తిరిగి గుర్తుకు వచ్చాయి. దీర్ఘకాలంగా మనసులో ఉండిపోయిన తోట పని కలను సాకారం చేసుకున్నాడు. పైగా ఒక్కరోజు కిలో‌కు పైగా పండ్లు తినే తండ్రి వృద్ధాప్యంలో రోజుకు ఒక్క మామిడి మాత్రమే తినాలని వైద్యులు సూచించారు. దీంతో తండ్రి తినే ఒక్క పండు చాలా రుచికరంగా ఉండాలని.. అది కూడా ఇంట్లోనే పెరగాలని నిశ్చయించుకున్నాడు అనుప్.

ఉత్తరప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో అదనపు మున్సిపల్ కమిషనర్‌గా రిటైర్ అయిన తర్వాత, చెట్లతో సమయం గడపాలన్న కోరికను పూర్తిగా తీర్చుకున్నాడు. ప్రకృతి వైపు మనసు మరల్చాడు. ఇప్పటికే 2010లో నాటిన దశేహరి చెట్లు పెద్దవి కావడంతో.. ఒకే చెట్టుపై వివిధ రకాల పండ్లు పండించాలని ఆలోచించాడు. గ్రాఫ్టింగ్ గురించి యూట్యూబ్ చూసి నేర్చుకున్నా.. పరిపక్వ చెట్టుపై ప్రయోగం చేయడానికి మాలిహాబాద్ నుంచి అనుభవజ్ఞులైన తోటమాలిని పిలిచాడు. కొత్త కొమ్మను జాగ్రత్తగా అతికించి.. తేమ లేకుండా కట్టి ఉంచాలి. మొదట్లో చాలా గ్రాఫ్టులు విఫలమయ్యాయి. కానీ అనుభవం పెరిగేకొద్దీ విజయం పెరిగింది.

ఒకే చెట్టుపై 11 రకాలు: గ్రాఫ్టింగ్ రహస్యం

ఇప్పుడు ఆ చెట్టు మీద .. అంబిక, సెన్సేషన్, దశేహరి, రామ్‌కేలా, మల్లిక, ఖాస్-ఉల్-ఖాస్, సుర్ఖా వర్మ, హుస్నారా, నీలం, కేసర్.. లాంటి పదకొండు రకాల పండ్లు ఉన్నాయి. ప్రతి రకం తన సమయంలో పండుతుంది. కొన్ని పండ్లు పసుపు రంగులో… కొన్ని పచ్చగా ఉంటాయి. రుచులు వేర్వేరుగా ఉంటాయి. జనాలు ఒకే చెట్టు మీద ఇన్ని రకాలు చూసి నమ్మలేకపోతారు అంటాడు అనుప్. తనకు మల్లిక ఇష్టమైన రకం. రుచి అద్భుతం, తీపి, కొంచెం పులుపు, ఎక్కువ కాలం గట్టిగా ఉంటుంది. ఈ చెట్టు సీజన్‌లో 800 కేజీల నుంచి 1 టన్ను వరకు పండ్లు ఇస్తుంది. 30-40 కుటుంబాలకు సరిపోయేంత ఉంటుంది.

వేసవి వచ్చేసరికి ఇంట్లో మాటలన్నీ మామిడి గురించే. 92 ఏళ్ల తండ్రికి ప్రతి రోజూ ఒక మామిడి కోసి ఇస్తారు. కుటుంబం మామిడి పార్టీలు ఏర్పాటు చేస్తుంది. మామిడి ఐస్‌క్రీమ్, హల్వా, పప్పడ్ వంటి వంటలు చేస్తారు. చెట్టు పక్షులకు ఆశ్రయం కూడా అయింది. రోజూ పక్షుల పాటలతో సందడి సందడిగా ఉంటుంది. తికరియాలోని వారసత్వ భూమిని కూడా మామిడి తోటగా మార్చాలని నిర్ణయించుకున్నాడు అనుప్. నేల సారవంతం చేసి మొక్కలు నాటారు.

అనుప్ కుమార్ బజ్‌పాయ్ కథ కేవలం మామిడి పండ్ల పెంపకం గురించి మాత్రమే కాదు, కలలను వెంబడించడం, వాటిని నిజం చేసుకోవడానికి కృషి చేయడం గురించి కూడా. ఆయన పట్టుదల, ప్రకృతి పట్ల ప్రేమ ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.