
📌 Key Points
- సినీ, సాహిత్య కార్యక్రమాల్లో రాజకీయ ప్రభావం ఎక్కువైందని ప్రకాష్ రాజ్ ఆవేదన.
- పాలస్తీనా సినిమాల ప్రదర్శనను అడ్డుకోవడంపై కేంద్రంపై విమర్శలు.
- కేరళ తరహాలో కర్ణాటకలోనూ పాలస్తీనా చిత్రాల ప్రదర్శనకు విజ్ఞప్తి.
- సమాజ హితం కోరే సినిమాలకు సహకారం ఉంటుందని సిద్ధరామయ్య హామీ.
ప్రఖ్యాత నటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మాట్లాడుతూ సినీ రంగంలో రాజకీయ జోక్యం పెరుగుతున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల కారణంగా ఉత్సవాల స్వేచ్ఛ పరిమితమవుతోందని ఆయన అన్నారు.
సినీ రంగంలో రాజకీయ జోక్యంపై ప్రకాష్ రాజ్ ఆవేదన
Prakash Raj: బెంగళూరులో జరుగుతున్న 17వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (బీఐఎఫ్‌ఎఫ్‌ఈఎస్) సందర్భంగా నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నది. ఈ చిత్రోత్సవానికి ఈ ఏడాది ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ రంగంలో పెరుగుతున్న రాజకీయ జోక్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవలి కాలంలో సినిమా ఉత్సవాలు, సాహిత్య కార్యక్రమాల్లో రాజకీయ ప్రభావం ఎక్కువైందని ప్రకాష్ రాజ్ అన్నారు. అయితే కొంతమంది హీరోలు ఇప్పుడు రాజకీయ నాయకులు అయిన సంగతి తెలిసిందే. వాళ్ల కోసమే ఇలా ఇన్ డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ పంచ్ వేశారు అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఇదే వేదికపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..ఒకప్పుడు స్వేచ్ఛగా ఆలోచనలు పంచుకునే వేదికలుగా ఉన్న ఈ ఉత్సవాలు ఇప్పుడు రాజకీయ నిర్ణయాల వల్ల పరిమితమవుతున్నాయని చెప్పారు. ఇది కళలకు మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు.
పాలస్తీనా సినిమాలపై నిషేధం సరికాదన్న ప్రకాష్ రాజ్
అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాలస్తీనా సినిమాలను ప్రదర్శించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న బాధలు..భావోద్వేగాలు కూడా సినిమాల ద్వారా మనకు తెలిసే అవకాశం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి సినిమాలను అడ్డుకోవడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వం కేంద్ర నిర్ణయాన్ని కాదని పాలస్తీనా సినిమాలను ప్రదర్శించిందని గుర్తు చేశారు. అదే విధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ సినిమాలను ప్రదర్శించాలని కోరారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలబడితే మార్పు సాధ్యమవుతుందని అన్నారు.
చిత్రోత్సవాల అసలైన ఉద్దేశం విభిన్న సంస్కృతులు, ఆలోచనలు, జీవిత అనుభవాలను పంచుకోవడమేనని ప్రకాష్ రాజ్ తెలిపారు. కానీ రాజకీయాల వల్ల ఆ ఉద్దేశం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన కథలు విదేశాల్లో గుర్తింపు పొందితే ఆనందపడతాం. అలాగే ఇతర దేశాల కథలను కూడా మనం గౌరవించాలన్నారు.
సినిమా అభివృద్ధికి సహకారం: సిద్ధరామయ్య
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ..సమాజ హితం కోరే సినిమాలకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.
ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం గమనార్హం. ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


