|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైష్ణవి హత్య మరువకముందే మరో విషాదం: కడుపులోని బిడ్డతో సహా భార్యను చంపిన భర్త!

Published: 20-03-2026, 8:35 AM
వైష్ణవి హత్య మరువకముందే మరో విషాదం: కడుపులోని బిడ్డతో సహా భార్యను చంపిన భర్త!
  • జగిత్యాలలో వైష్ణవి హత్య ఘటన మరవకముందే మరో దారుణం జరిగింది.
  • పశ్చిమ బెంగాల్‌లో ఆరు నెలల గర్భిణిని భర్త దారుణంగా హత్య చేశాడు.
  • కట్నం కోసం వేధించాడని, డబ్బు కోసమే హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ.
  • నిందితుడిని, అతని తల్లిని, మరో కుటుంబ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జగిత్యాల జిల్లాలో వైష్ణవి హత్య కేసు సంచలనం సృష్టించిన వేళ, పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం జరిగింది. ఆరు నెలల గర్భిణిని ఆమె భర్తే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కట్నం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలుస్తోంది.

ఆర్థిక వివాదాలే హత్యకు కారణమా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మాదాపూర్‌లో యూట్యూబర్ వైష్ణవిని నాలుగు నెలల గర్భవతి అని కూడా చూడకుండా.. ఆమె భర్త హత్య చేసిన ఘటన రాష్ట్రమంతటినీ కుదిపేసింది. 15 మంది అన్నలకు ఒక్కగానొక్క చెల్లెలు కావడంతో.. ఆ కుటుంబం తీవ్రవిషాదంలో మునిగిపోయింది. వైష్ణవి హత్యకు కట్నమే కారణమన్న విషయాన్ని పోలీసులు వెల్లడించారు. తాజాగా.. అలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లాడిన అతను.. భార్య ఆరునెలల గర్భిణీ అని కూడా ఆలోచించకుండా డబ్బు పిచ్చితో అతి కిరాతకంగా చంపేశాడు. ఆపై మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి మంచం కింద దాచిపెట్టాడు. నార్త్ 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్లాస్టిక్ కవర్‌లో మృతదేహం, పోలీసుల అదుపులో నిందితులు

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజా మోండల్ (24), రిషి హరిచంద్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని మొదట్లో ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. అయితే.. పూజ గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమె పుట్టింటి వారు వీరిని అంగీకరించి మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ.. పెళ్లయినప్పటి నుండి భర్త, అత్తమామలు పూజను డబ్బు కోసం వేధిస్తూనే ఉన్నారు. రిషి ఎలాంటి పని చేయకుండా ఖాళీగా ఉంటూ, భార్యను డబ్బులు తీసుకురావాలని వేధించేవాడని బాధితురాలి మేనమామ గౌతమ్ బిస్వాస్ తెలిపారు. బుధవారం (మార్చి18) ఉదయం డబ్బు విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన రిషి, గర్భిణి అని కూడా చూడకుండా పూజను గుడ్డతో ఉరివేసి చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, బెడ్ కింద దాచిపెట్టాడు.

స్థానికంగా కలకలం రేపిన ఘటన

పూజకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం అత్తగారింటికి వెళ్లారు. అక్కడ పూజ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తనిఖీ చేయగా, మంచం కింద పూజ మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త రిషి హరిచంద్, అతని తల్లి, మరో కుటుంబ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తెలంగాణలో యూట్యూబర్ వైష్ణవి హత్య వెలుగుచూసిన రోజునే పూజా కూడా హత్యకు గురవ్వగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒకవైపు వైష్ణవి హత్య కేసు ఇంకా కొనసాగుతుండగానే, మరోవైపు ఇలాంటి ఘోరాలు జరుగుతుండటం సమాజంలో మహిళల భద్రతపై ప్రశ్నార్థకంగా మారుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.