
తరుణ్ హీరోగా పరిచయం అయిన బ్లాక్ బస్టర్ ‘నువ్వే కావాలి’ విడుదలై 25 ఏళ్లు పూర్తయ్యాయి. పవన్ కళ్యాణ్, సుమంత్ వంటి స్టార్లు రిజెక్ట్ చేసిన ఆఫర్‌తో తరుణ్ కెరీర్‌కు పునాది పడింది. ఈ చిత్రం విశేషాలు, బాక్సాఫీస్ విజయం గురించి తెలుసుకుందాం.
Key Points
తరుణ్ హీరోగా మారిన తొలి చిత్రం 'నువ్వే కావాలి'కి నేటితో 25 ఏళ్లు.
పవన్ కళ్యాణ్, సుమంత్ రిజెక్ట్ చేయడంతో తరుణ్‌కు హీరోగా అవకాశం వచ్చింది.
వర్షం పడే సన్నివేశాన్ని సహజసిద్ధంగా చిత్రీకరించడానికి వరుణ దేవుడు కరుణించాడు.
కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 19 కోట్ల గ్రాస్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ అయ్యింది.
తరుణ్ దశ తిప్పిన ‘నువ్వే కావాలి’
చైల్డ్ యాక్టర్ గా అనేక చిత్రాల్లో నటించిన తరుణ్ 2000 సంవత్సరంలో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే తరుణ్ బాక్సాఫీస్ వద్ద విస్ఫోటనం సృష్టించాడు. ఆ మూవీ ఏంటో ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది.. అదే నువ్వే కావాలి చిత్రం. తరుణ్, రిచా పల్లోడ్ జంటగా నటించిన ఈ మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకుడు విజయభాస్కర్ కాగా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. రామోజీ రావు, స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ విడుదలై నేటితో 25 ఏళ్ళు పూర్తయింది. దీనితో ఈ చిత్ర విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మలయాళంలో సూపర్ హిట్ అయిన నీరం అనే చిత్రానికి నువ్వే కావాలి రీమేక్ గా తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ కథలో మార్పులు చేశారు. ముందుగా ఈ చిత్రంలో హీరోగా పవన్ కళ్యాణ్, సుమంత్ లని అనుకున్నారట. వారిద్దరూ రిజెక్ట్ చేయడంతో తరుణ్ కి అవకాశం వచ్చింది. తాను ఒకసారి రోజా రమణి గారి ఇంటికి వెళ్ళినప్పుడు తరుణ్ బుక్స్ పట్టుకుని కాలేజ్ కి వెళుతున్నాడు. తరుణ్ ని చూసిన క్షణమే నా మూవీలో ఇతడే హీరో అని ఫిక్స్ అయినట్లు విజయ భాస్కర్ తెలిపారు.
స్టార్స్ రిజెక్ట్ చేసిన ఛాన్స్
ఈ మూవీలో ఇంటర్వెల్ సన్నివేశం గురించి విజయభాస్కర్ గుర్తు చేసుకున్నారు. అది వర్షం పడే సన్నివేశం. హైదరాబాద్ పోలీస్ అకాడమీ గ్రౌండ్ లో ఆ సన్నివేశాన్ని షూట్ చేయాలి. వర్షం పడేలా చూపించడం కోసం నాలుగు ఫైర్ ఇంజన్లని ఏర్పాటు చేశాం. నటీనటులు, నేను, సినిమాటోగ్రాఫర్ అందరం షూటింగ్ కి బయలుదేరాం. ఇంతలో ఫైర్ ఇంజన్లు అందుబాటులో లేవని ప్రొడక్షన్ టీమ్ చెప్పింది. చాలా నిరాశగా అనిపించింది.
మేము పోలీస్ గ్రౌండ్స్ కి చేరుకునే సమయానికి వర్షం నిజంగా పడడం ప్రారంభం అయింది. దీనితో చిత్ర యూనిట్ మొత్తం పరుగులు పెట్టి నిజమైన వర్షంలో ఆ సీన్ ని సహజసిద్ధంగా చిత్రీకరించాం. మంచి పని తలపెడితే ప్రకృతి కూడా సహకరిస్తుంది అని అంటారు. ఆరోజు మాపై వరుణ దేవుడు కరుణ చూపించాడు. నాలుగు గంటల పాటు వర్షంలో ఆ సీన్ పూర్తి చేసినట్లు విజయ భాస్కర్ తెలిపారు.
వరుణ దేవుడు కరుణించిన వర్షం సీన్
నువ్వే కావాలి చిత్రం విడుదలై సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 30 సెంటర్లలో 100 రోజులు.. 30 సెంటర్లలో 200 రోజులు.. 6 సెంటర్లలో 365 రోజులు ప్రదర్శించబడింది. కేవలం కోటి రూపాయల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం 19 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఈ మూవీతో తరుణ్ తెలుగులో తిరుగులేని యంగ్ హీరోగా మారిపోయాడు.
‘నువ్వే కావాలి’ చిత్రం కేవలం తరుణ్‌కు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. వరుణ దేవుడి ఆశీస్సులతో సహా ఎన్నో అద్భుతాలు ఈ సినిమా విజయానికి దోహదపడ్డాయి.


