
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు. టికెట్ రేట్ల పెంపులో కార్మికులకు వాటా, ఉచిత విద్య, వైద్యం, రూ.10 కోట్ల వెల్ఫేర్ ఫండ్ వంటి వరాలు ప్రకటించారు. భవిష్యత్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
Key Points
టికెట్ రేట్ల పెంపులో 20% వాటా సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కు తప్పనిసరి.
రాష్ట్ర ప్రభుత్వం నుండి సినీ కార్మికుల సంక్షేమ నిధికి రూ.10 కోట్లు అందించనున్నట్లు ప్రకటన.
సినీ కార్మికుల పిల్లలకు నర్సరీ నుండి ఇంటర్ వరకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య.
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సినీ కార్మికులకు, వారి కుటుంబాలకు ఉచిత వైద్యం.
టికెట్ రేట్ల పెంపు, కార్మికుల వాటాపై సీఎం కీలక ప్రకటన
Revanth Reddy: సినీ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
“సినిమా నుంచి వచ్చే ఆదాయంలో కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలి. భవిష్యత్‌లో ఎంత పెద్దవారైనా అదనంగా టికెట్ల ధరలు పెంచాలనుకుంటే… అందులో 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కు అందిస్తేనే అనుమతి జీవో అందించేలా నిబంధనలు సడలిస్తాం” అని చెప్పారు.
సినీ కార్మికులకు 10 కోట్ల రూపాయల ఫండ్ తాను ఇస్తానని చెప్పారు. డిసెంబర్ 9న సినిమా ఇండస్ట్రీ కోసం మరిన్ని వరాలు ప్రకటిస్తానని అన్నారు.
సినీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం హామీ
“సినీ కార్మికుల సంక్షేమానికి ఒక వెల్ఫేర్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లు ఫండ్ అందిస్తాం. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుంది. మీరంతా అండగా నిలబడండి.. హాలీవుడ్ ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. కృష్ణా నగర్ లో ఒక మంచి స్థలాన్ని చూడండి. నర్సరీ నుంచి 12గా తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను” అని తెలిపారు.
సినీ కార్మికుల పిల్లలకు కార్పొరేట్ స్థాయి స్కూల్ నిర్మిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. నర్సీరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. ఇక భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యం
“తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కృషి చేశారు. ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు, కృష్ణలాంటి వాళ్లను సంప్రదించి హైదరాబాద్ కు తరలి రావడానికి ప్రోత్సహించారు. ఆనాడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల కోసం మణికొండలో తన 10 ఎకరాల సొంత స్థలాన్ని ఇచ్చారు. సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు.
చిత్ర పరిశ్రమలో కళాకారులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్న మీ శ్రమ, కష్టం నాకు తెలుసు. మీ సమస్యలు తెలుసుకునేందుకే మిత్రుడు దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించా.
ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటారని దిల్ రాజుకు ఆ బాధ్యతలు అప్పగించాం. నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డులను అందిస్తున్నాం. తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లడం వెనుక సినీ కార్మికుల కష్టం ఉంది” అని రేవంత్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటనలు సినీ కార్మికుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో హైదరాబాద్ సినీ పరిశ్రమకు మరింత ప్రాధాన్యం లభించనుంది.


