|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రేవంత్ రెడ్డి సాక్షిగా చంద్రబాబుకు చిరు విజ్ఞప్తి! ఇంతకీ ఆ విన్నపంలో ఏముంది?

Published: 19-03-2026, 7:05 PM
రేవంత్ రెడ్డి సాక్షిగా చంద్రబాబుకు చిరు విజ్ఞప్తి! ఇంతకీ ఆ విన్నపంలో ఏముంది?
  • తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేడుకలో చిరంజీవి ప్రసంగం.
  • కళాకారులను గౌరవించే దేశం సుభిక్షంగా ఉంటుందని చిరంజీవి వ్యాఖ్య.
  • సినిమా రంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి.
  • హైదరాబాద్‌లో సినిమా అభివృద్ధికి సహకరించాలని ఏపీ సీఎంకు విజ్ఞప్తి చేసిన చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఒక విజ్ఞప్తి చేశారు. సినిమా అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో చిరంజీవి ప్రసంగం

Chiranjeevi: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముందే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)కు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన స్పీచ్ వీడియో వైరల్ అవుతోంది. గురువారం, హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 (Telangana Gaddar Film Awards 2025) వేడుకలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాట్లాడుతూ..

‘‘ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. దానిని సరిగా అర్థం చేసుకుని, ఒక సమయంలో ఆగిపోయిన ఈ అవార్డ్స్‌ను.. ఆ నానుడికి అర్థం, పరమార్థం గ్రహించి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ పునరుద్ధరించారు. కళాకారులను గౌరవించుకోవాలి, సినిమా ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుందని తెలుసుకుని, ఈ ఇండస్ట్రీలో ఎంత మందికి ఉద్యోగం ఉంది, ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందనే ఆంతర్యం గమనించి, ఈ రోజు ఇంత గొప్పగా, సజావుగా, హృద్యంగా, అద్భుతంగా సాగడానికి కారణమైన సీఎం రేవంత్‌కు ప్రత్యేకంగా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

సినిమా రంగానికి ప్రభుత్వం సహకారం

ఆయనతో నేను కలిసిన ప్రతిసారి సినిమా గురించి, సినిమాను ఎలా హైట్స్‌కు తీసుకు వెళ్లాలి, హైదరాబాద్‌లో అన్ని రకాల వాతావరణం ఉంటుంది కాబట్టి భారతదేశ సినిమాను ఇక్కడ కేంద్రంగా ఉంచాలని, భవిష్యత్‌లో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడకు ఆహ్వానించేలాగా ఇక్కడ అన్నీ అభివృద్ధి చేయాలని, దానికి కావాల్సిన విధంగా మేము సమాయుక్తం అయ్యామంటూ చాటి చెబుతున్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో కూడా ప్రత్యేకంగా సినిమాకు వారు అవకాశం కల్పించారు. మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీకు అండదండలు అందిస్తుంది.. సినిమాకు పెద్ద పీట వేయాలంటూ ప్రత్యేకంగా సినిమాకు ఇస్తున్న ప్రాముఖ్యతకు సినిమా వాళ్లందరం ఎంతగానో రుణపడి ఉన్నాం. ఎందుకంటే, దీని ఆంతర్యం, విలువ గ్రహించారు కాబట్టే.. కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అంటూ ప్రపంచ దేశాలకు మన సినిమాతో బాటు, ఇక్కడి సాంప్రదాయాలన్నింటి గురించి తెలియజెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. నన్ను, కమల్‌ను కూడా ఆహ్వానించారు. సినిమాయే కదా ఏముందిలే అని వదిలేయకుండా, దీని ద్వారా రాష్ట్ర ఎకానమీ కూడా పెంచుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకురావచ్చు. ఈ రోజున హాలీవుడ్ అంటే ఒక అగ్ర రాజ్యం గుర్తొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలనే ముఖ్య ఉద్దేశ్యంతోటి మన ముఖ్యమంత్రి చేపట్టిన బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ ఆయన వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. వారు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా, శిరసావహిస్తూ వాటిని ముందుకు తీసుకువెళతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

హైదరాబాద్ అభివృద్ధికి చిరు సూచనలు

ఇక్కడ సందర్భమో, అసందర్భమో తెలియదు కానీ, మన పక్క రాష్ట్రమైన మరో తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల ఉత్సాహపరిచే విధానంలో కొంచెం వెనుకంజ వేసి ఉందని అనుకుంటున్నాను. కాబట్టి, సినిమా వాళ్లకు అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దీనిని స్ఫూర్తిగా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరిచ్చే ఉత్సాహం తోటి ఎంతోమంది యంగ్ స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. తద్వారా రెవిన్యూ కూడా కంట్రిబ్యూట్ అవుతుంది. ఒక ఆలోచన పెట్టాలని ఈ వేదిక నుంచి విన్నవించుకుంటున్నాను. ఇక తెలంగాణ గద్దర్ అవార్డ్స్‌ను చూస్తే.. ఇది సీనియర్స్‌కు గౌరవం ఇచ్చే విధంగానూ, అలాగే యంగ్ స్టర్స్‌ను ఉత్సాహ పరిచే విధంగానూ, చాలా చక్కగా ఈ అవార్డుల ఎంపిక జరిగింది. అందుకుగానూ జ్యూరీ కమిటీకి, అందులోని సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

చిరంజీవి చేసిన ఈ విజ్ఞప్తి సినిమా పరిశ్రమకు మరింత మేలు చేస్తుందని ఆశిద్దాం. హైదరాబాద్‌లో సినిమా అభివృద్ధికి ప్రభుత్వాలు సహకరించాలని ఆయన కోరారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.