|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ ట్విస్ట్.. జయం రవికి కోర్టులో చుక్కెదురు.. ఆర్తి వేసిన భరణం కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్!

Published: 09-06-2026, 4:47 PM
షాకింగ్ ట్విస్ట్.. జయం రవికి కోర్టులో చుక్కెదురు.. ఆర్తి వేసిన భరణం కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్!

Jayam Ravi Divorce Case: జయం రవి (రవి మోహన్)…కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో వ్యక్తిగత జీవితం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆయన,ఆయన భార్య ఆర్తి రవిల మధ్య నడుస్తున్న విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంలో మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్తి రవి దాఖలు చేసిన తాత్కాలిక భరణం కేసుపై విచారణను ఆలస్యం చేయాలంటూ జయం రవి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం నాడు పూర్తిగా కొట్టివేసింది.

జస్టిస్ అబ్దుల్ ఖుద్దోస్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పరిశీలించి, గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చేది లేదని స్పష్టం చేసింది. దీని ప్రకారం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ భరణం పిటిషన్‌పై తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది.

ఈ వివాదానికి సంబంధించిన విషయంలోకి వెళ్తే..గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు నడుస్తున్నాయి. ఆర్తి రవి దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, గత ఏడాది 2025 ఏప్రిల్ నెల నుంచి జయం రవి తనకు ఎలాంటి తాత్కాలిక భరణం చెల్లించడం లేదు. అంతేకాకుండా తమ పిల్లల స్కూల్ ఫీజుల బాధ్యతను కూడా ఆయన పూర్తిగా పట్టించుకోవట్లేదని ఆమె ఆరోపిస్తున్నారు.

పిల్లల భవిష్యత్తు, వారి చదువుల దృష్ట్యా ఈ కేసును వీలైనంత త్వరగా విచారించి న్యాయం చేయాలని కోరుతూ ఆర్తి గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, కేవలం రెండు వారాల్లోగా ఈ భరణం వ్యవహారాన్ని తేల్చేయాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. అయితే ఈ గడువును మరికొంత కాలం పొడిగించాలని, తనకు మరింత సమయం కావాలని కోరుతూ జయం రవి మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం మరింత ముదిరింది.

ఈ తాజా పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టులో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆర్తి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జె. రవీంద్రన్, జయం రవి కావాలనే సమయాన్ని వృధా చేస్తున్నారని, భరణం చెల్లించకుండా తప్పించుకునేందుకే ఈ రకమైన పిటిషన్లు వేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి రవి విజ్ఞప్తిని తోసిపుచ్చారు. సమయం పొడిగింపు కుదరదని తేల్చి చెబుతూ, తదుపరి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫ్యామిలీ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించారు. 2009 జూన్ నెలలో ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట, దాదాపు 15 ఏళ్ల బంధం తర్వాత ఇలా కోర్టు మెట్లు ఎక్కడం కోలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, జయం రవి తన సినీ కెరీర్‌ను మాత్రం ఎక్కడా తగ్గించడం లేదు. వరుస పెట్టి భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే ఆయన స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సమర్పణలో, రాఘవ లారెన్స్ మరియు నివిన్ పౌలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బెంజ్’ చిత్రంలో కీలక పాత్ర కోసం జాయిన్ అయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో పాటు జయం రవి ‘ఆన్ ఆర్డినరీ మ్యాన్’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారనున్నాడు జయం రవి.

ప్రస్తుతం ఈ డెబ్యూ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఏది ఏమైనా కోర్టు వివాదాలు ఒకవైపు, బ్యాక్ టు బ్యాక్ షూటింగులు మరోవైపు చూస్తుంటే జయం రవికి ఈ ఏడాది చాలా కీలంగా మారేలానే కనిపిస్తుంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.