
📌 Key Points
- బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్‍ను కలిశారు.
- గతంలో జనసేనలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన తోట చంద్రశేఖర్.
- బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు ప్రతిపాదనతో అసంతృప్తి?
- తోట చంద్రశేఖర్ రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మళ్లీ జనసేన గూటికి చేరుతారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తోట చంద్రశేఖర్ జనసేనతో భేటీ: అసలేం జరిగింది?
తెలుగు రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలో బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ (Thota Chandra Sekhar) మళ్లీ జనసేన గూటికి చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన మంగళగిరిలోని జనసేన (Janasena Party) కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్‍ను (Pawan Kalyan) కలిశారు. గతంలో జనసేనలో కీలకంగా వ్యవహరించి ఆ పార్టీని వీడిన తోట చంద్రశేఖర్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పవన్‍తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ వర్గాలు దీనిని కేవలం మర్యాదపూర్వక భేటీగా చెబుతున్నప్పటికీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తోట చంద్రశేఖర్ తిరిగి జనసేన గూటికి చేరబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ (BRS) తిరిగి టీఆర్ఎస్‍గా మార్పుపై ఇటీవల కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ పేరు నుంచి ‘తెలంగాణ’ అనే పదాన్ని తొలగించడం వల్ల ప్రజలకు ఆ పార్టీకి గ్యాప్ ఏర్పడిందని అందువల్ల పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలనే ప్రతిపాదనపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో సంచలనంగా మారాయి. ఇంతలో ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ అనూహ్యంగా పవన్ వద్ద ప్రత్యక్షం కావడం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పార్టీ పేరు మార్చే ఉద్దేశంలో అధిష్టానం ఉందనే ఆలోచనతోనే తోట చంద్రశేఖర్ పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారా లేక మరేదైనా కారణంతో పవన్‍ను కలిశారా అనేది సస్పెన్స్ గామారింది.
బీఆర్ఎస్ భవితవ్యంపై నీలినీడలు.. పార్టీ మారుతున్నారా?
నాడు కేసీఆర్‍ను నమ్మి జంప్:
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ 2008లో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో కీలకపాత్ర పోషించిన ఆయన జనసేన పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించారు. చంద్రశేఖర్ మెగా బ్రదర్స్‌కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. కానీ 2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీలో చేరిన చంద్రశేఖర్ ఏలూరు ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో తిరిగి జనసేనలో చేరగా ఆయనకు పవణ్ కల్యాన్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ముడేళ్ల క్రితం టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారగా కేసీఆర్ ను నమ్మి అందులోకి జంప్ అయ్యారు. దాంతో ఆయనకు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.
గతంలో జనసేనతో అనుబంధం.. మళ్ళీ మొదలు?
కానీ 2023 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ తర్వాత నుంచి చంద్రశేఖర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ కావడం పొలిటికల్ కారిడార్‍లో హాట్ డిస్కషన్ గా మారింది. అయితే కేసీఆర్ రాజకీయాంగా ఏదో చేస్తారని ఆశించి కారెక్కిన తోట చంద్రశేఖర్ రాజకీయ జీవితం పూర్తిగా సందిగ్ధంలో పడిపోయింది. ఓ వైపు తెలంగాణలోనే బీఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఏపీలో గులాబీ పార్టీ రాజకీయం అంటే ఎడారిలో ఎండమావిలాంటిది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక రాజకీయంగా తన దారి తాను వెతుక్కోక తప్పదనే నిర్ణయానికి వచ్చే తోట చంద్రశేఖర్ తిరిగి పవన్ కల్యాన్ వద్దకు వెళ్లారా అనే చర్చ జరుగుతోంది.
మొత్తానికి తోట చంద్రశేఖర్ నిర్ణయం ఏమవుతుందో వేచి చూడాలి. ఆయన జనసేనలో చేరితే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు నష్టం చేస్తుందో చూడాలి.


