
తెలుగు సినిమా రంగంలో ఒక దిగ్గజ నటిగా పేరుగాంచిన సిల్క్ స్మిత, నిర్మాతగా మారిన తర్వాత ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు మరియు ఆమె జీవితంలోని ఆ కీలక మలుపు గురించి తెలుసుకుందాం.
Key Points
సిల్క్ స్మిత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి కోట్లు పోగొట్టుకుంది.
ప్రేమించి చూడు, నా పేరు దుర్గ వంటి చిత్రాలను నిర్మించింది.
ఆమె పర్సనల్ సెక్రెటరీ మోసం చేయడం వల్ల ఆమె ఆర్థికంగా నష్టపోయింది.
సినిమా నిర్మాణం వల్ల ఆమె జీవితంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి.
సిల్క్ స్మిత కెరీర్ పీక్
సిల్క్ స్మిత వ్యాంప్ రోల్స్ తో సౌత్ సినిమాని శాసించిన నటి. కేవలం ఐటెమ్ సాంగ్స్ కే పరిమితం కాకుండా నటిగానూ, హీరోయిన్ గానూ మెప్పించింది. చాలా సినిమాల్లో ఆమె మెయిన్ లీడ్‌గా నటించడం విశేషం. స్టార్ హీరోలకు దీటుగా స్టార్ ఇమేజ్ ని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది సిల్క్ స్మిత.
చిరంజీవి అయినా, రజనీకాంత్ అయినా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. ముందు సిల్క్ స్మితని బుక్ చేసుకున్న తర్వాతనే హీరోలను ఫైనల్ చేసేవారట దర్శక, నిర్మాతలు, అప్పట్లో ఆమెకి అంతటి డిమాండ్ ఉండేది. ఆమె ఉంటే జనం థియేటర్లకి క్యూ కట్టేవారు. అందుకే ఆమెకి అంత డిమాండ్.
అయితే నా అనేవారు లేక, నమ్మిన వాడు మోసం చేయడంతో ఆమె జీవితం తలక్రిందులైంది. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆమె సూసైడ్ చేసుకుంది.
సిల్క్ స్మిత ఆర్థికంగా చితికిపోవడానికి ఓ కారణం ఆమె నిర్మాతగా మారడమే. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఒక్కో పాటకి ఆమె హీరోయిన్లకి ఇచ్చే పారితోషికం తీసుకునేదట. అయితే తన క్రేజ్ తగ్గుతున్న సమయంలో ఆమె నిర్మాణంలోకి దిగింది.
నిర్మాణ రంగంలోకి ప్రవేశం
మొదట `వీర విహారం` అనే చిత్రంతో నిర్మాతగా మారింది. ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించింది. ఇందులో శ్రీహరి భార్య డిస్కో శాంతి హీరోయిన్ రోల్ చేసింది. ఈ మూవీ విడుదల కాలేదు. అనేక కారణాలతో ఆగిపోయింది. ఇది కొంత నష్టమే తెచ్చింది.
కొంత గ్యాప్‌తో ఏకంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది సిల్క్ స్మిత. ఎస్సార్ సినీ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభి తొలి ప్రయత్నంగా `ప్రేమించి చూడు` అనే చిత్రాన్ని నిర్మించింది.
రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ హీరోలుగా నటించిన ఈ చిత్రలో సిల్క్ స్మిత హీరోయిన్. ముందుగా దీనికి `బ్రహ్మ నీ తలరాత తారుమారు` అనే పేరు అనుకున్నారు, కానీ ఈ టైటిల్‌కి అభ్యంతరం వ్యక్తం కావడంతో `ప్రేమించిచూడు` అనే పేరుని ఖరారు చేశారు.
ఆర్థిక నష్టం మరియు పతనం
తాను నటిగా అడపాదడపా సినిమాలు చేస్తుండటం, ప్రొడక్షన్ గురించి తెలియకపోవడంతో ఈ మూవీని చూసుకునే బాధ్యతలు తన పర్సనల్ సెక్రెటరీకి అప్పగించింది. కానీ అతను మోసం చేశాడు. సినిమాకి బాగా ఖర్చు పెట్టించాడు, తను చాలా వరకు కాజేశాడు. అంతేకాదు సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఈ మూవీ కోసం చేసిన అప్పులను తన నగలు తాకట్టు పెట్టి తీర్చాల్సి వచ్చింది. ఇది ఆర్థికంగా సిల్క్ స్మితకి పెద్ద దెబ్బ.
ఆ తర్వాత `నా పేరు దుర్గ` పేరుతో మరో మూవీని నిర్మించింది. దీనికి త్రిపురనేని మహారథి దర్శకుడు. ఓపెనింగ్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. దీంతో సినిమాకి పెట్టిన డబ్బులంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
ఇలా నిర్మాతగా మారి చేసిన ఆమె ప్రయత్నం బెడిసికొట్టింది. సంపాదించిందంతా పోగొట్టుకుంది. దీనికితోడు ప్రేమించిన వాడు మోసం చేశాడు, నమ్మిన వాడూ మోసం చేశాడు. డబ్బులు పోగొట్టుకుంది. దీంతో ఆడిప్రెషన్ తట్టుకోలేక మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుందని అంటుంటారు. ఏది నిజమనేది తెలియదు.
సిల్క్ స్మిత నిర్మాణ రంగంలోని అనుభవం ఆమె జీవితంలో ఒక విషాదకరమైన అధ్యాయంగా మిగిలిపోయింది. ఆమె ఆర్థిక నష్టం ఆమె జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది.


