|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జక్కన్న మాటల్లో ‘ధురంధర్ 2’.. ఆ సీన్ చూసి ఫిదా అయ్యానన్న రాజమౌళి!

Published: 21-03-2026, 9:05 AM
జక్కన్న మాటల్లో ‘ధురంధర్ 2’.. ఆ సీన్ చూసి ఫిదా అయ్యానన్న రాజమౌళి!
  • ‘ధురంధర్ 2’ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని రాజమౌళి ప్రశంసించారు.
  • సినిమాలోని ఎమోషన్స్, ట్విస్ట్‌లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని జక్కన్న అన్నారు.
  • రణవీర్ సింగ్ నటన ఒక మాస్టర్ క్లాస్ అని రాజమౌళి కొనియాడారు.
  • దర్శకుడు ఆదిత్య ధర్ ధైర్యాన్ని రాజమౌళి మెచ్చుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ‘ధురంధర్ 2’ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమాలోని నటీనటుల నటన, దర్శకత్వం అద్భుతంగా ఉందని కొనియాడారు.

‘ధురంధర్ 2’పై రాజమౌళి ప్రశంసలు

SS Rajamouli: ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ విన్నా అంతా ‘ధురంధర్’ (Dhurandhar) గురించే. ‘ధురంధర్’ పార్ట్ 2 (Dhurandhar Part 2)గా వచ్చిన ఈ సినిమాకు జనాలు నీరాజనాలు పడుతున్నారు. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, రికార్డులను బద్దలు కొడుతూ.. థియేటర్లలో ఈ సినిమా ఊచకోత కోస్తోంది. ఈ సినిమా చూసిన వారంతా, దర్శకుడిపై, సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్‌లో ప్రశంసలు దక్కుతున్నాయి. మహేష్ బాబు మొదలుకుని.. విజయ్ దేవరకొండ వరకు స్టార్ హీరోలందరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన వారే. తాజాగా ఈ లిస్ట్‌లోకి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కూడా చేరారు. ఈ సినిమా చూసిన జక్కన్న.. దర్శకుడిపై, సినిమాపై చాలా గొప్పగా స్పందించారు.

‘‘నాకు ‘ధురంధర్-1’ బాగా నచ్చింది. ఇప్పుడొచ్చిన ‘ద రివెంజ్’ సినిమా స్కేల్ పరంగానూ, ఎమోషన్ పరంగానూ అంతకు మించి ఉంది. రచన, నటీనటుల ఎంపిక, టెక్నికల్ ఎగ్జిక్యూషన్, సంగీతం, వరల్డ్ డిజైన్, దర్శకత్వం.. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. ముఖ్యంగా ఈ కథలోని ఎమోషన్సే సినిమాను నిలబెట్టాయని నేను భావిస్తున్నాను. సినిమాలోని ట్విస్ట్‌లు కేవలం ఉత్కంఠను మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్‌ను కూడా పండించాయి. ఆదిత్య ధర్.. మీరు సిక్సర్ కొట్టారు. నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాను తీసి, విడుదల చేయడం అంటే అది మీ ధైర్యానికి నిదర్శనం. ఫస్ట్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా చేశారు. రణవీర్ సింగ్.. నీ పెర్ఫార్మెన్స్ అద్భుతం! ఆ షెడ్డులో చెల్లెలితో వచ్చే సీన్ నటనకు ఒక మాస్టర్ క్లాస్.. నిజంగా అదిరింది. సినిమా ప్రారంభం నుండి గుండెను పిండేసే ఆ క్లైమాక్స్ వరకు.. హమ్జా మరియు జస్క్రీత్ పాత్రల్లో మీరు మమ్మల్ని మంత్రముగ్ధులను చేశారు. మాధవన్ జీ, ఒక దేశం యొక్క నిస్సహాయతను, ఆవేదనను మీ నటనలో చాలా గొప్పగా చూపించారు. మీ విజయం మా విజయంలా అనిపించింది. ఈ అద్భుత విజయాన్ని అందుకున్న చిత్ర బృందానికి అభినందనలు..’’ అని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

దర్శకుడు ఆదిత్య ధర్‌కు జక్కన్న అభినందనలు

ఈ ట్వీట్‌కు స్పందించిన దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) తన సంతోషాన్ని తెలియజేశారు. ‘‘సార్.. మీ ప్రశంసలు నాకు ఎంతటి సంతోషాన్ని ఇచ్చాయో మాటల్లో చెప్పలేను. మీలాంటి వారి నుంచి ఇలాంటి మాటలు రావడం ఒక ఆశీర్వాదంగా, అదే సమయంలో ఒక బాధ్యతగా కూడా అనిపిస్తోంది. మేమంతా మీరు సృష్టించే అద్భుత ప్రపంచాలను, మీరు పండించే భావోద్వేగాలను చూస్తూ పెరిగాం. అలాంటిది, ‘ధురంధర్’ సినిమా మిమ్మల్ని ఈ స్థాయిలో మెప్పించినందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. మేము కేవలం పూర్తి నిజాయితీతో, నమ్మకంతో ఒక కథను చెప్పడానికి ప్రయత్నించాం. సినిమా స్కేల్ పరంగానే కాకుండా, అంతకంటే ముఖ్యంగా ఎమోషన్ పరంగా మమ్మల్ని మేము మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాం. భారతీయ సినిమా పెద్ద కలలు కనగలదని, లోతైన భావోద్వేగాలను పండించగలదని, మన మూలాలను మర్చిపోకుండానే ప్రపంచంతో మాట్లాడగలదని మీ మాటలు మరోసారి రుజువు చేశాయి. మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తాం. లాట్స్ ఆఫ్ లవ్ సార్!’’ అంటూ ఆదిత్య ధర్ ఎంతగానో పొంగిపోయారు.

Dearest Sir, this means more than I can put into words. Coming from you, it feels like both a blessing and a responsibility. As filmmakers, we grow up learning from the worlds you build and the emotions you make us feel, so to see Dhurandhar resonate with you at this level is…

రణవీర్ సింగ్ నటనను కొనియాడిన రాజమౌళి

— Aditya Dhar (@AdityaDharFilms) March 21, 2026

రాజమౌళి ప్రశంసలతో ‘ధురంధర్ 2’ చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంటోంది. మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.