
📌 Key Points
- తెలంగాణలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను ప్రారంభించనున్న ప్రభుత్వం.
- సంగారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం అమలు.
- మొత్తం 64 ప్రభుత్వ వైద్యశాలల్లో డిజిటల్ హెల్త్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
- ప్రతి రోగికి డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయనున్న ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయనున్నారు. దీని ద్వారా వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అంటే ఏమిటి?
రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.
సంగారెడ్డి జిల్లా ఎంపిక వెనుక కారణం?
గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన, అమలు పై రాష్ట్ర, జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమన్వయ సన్నాహాక సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు పైలెట్ జిల్లాగా ఎంపిక చేసిన నేపథ్యంలో…. ప్రాజెక్ట్ అమలు విధానం, ముందస్తు ఏర్పాట్లు, అవసరమైన సాంకేతిక సదుపాయాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు అమలులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ వైద్యశాలల్లో (జీజీహెచ్–1, ఏరియా ఆసుపత్రులు–4, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు–5, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు–4, ప్రైమరీ హెల్త్ సెంటర్లు–31, బస్తీ దవాఖానాలు–19) సేవలు ప్రారంభిస్తారు. వచ్చే ప్రతి రోగికి సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయడానికి కసరత్తును ప్రారంభించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.
సంగారెడ్డి జిల్లాలో విజయవంతం అయితే, రాష్ట్రమంతటా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇది వైద్య రంగంలో ఒక గొప్ప ముందడుగు కానుంది.


