
📌 Key Points
- సినిమా ట్రైలర్ గ్రాండియర్‌గా ఉండి, సినిమాలో తక్కువగా ఉంటే ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు.
- దర్శకులు ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకుంటే వారి నమ్మకాన్ని కోల్పోతున్నారు.
- సందీప్ రెడ్డి వంగా ట్రైలర్‌లో చూపించిందే థియేటర్‌లో చూపించి నమ్మకం నిలబెట్టుకున్నారు.
- మలయాళ సినిమాలు క్వాలిటీతో ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.
టాలీవుడ్ పరిశ్రమలో ప్రేక్షకుల నమ్మకంపై చర్చ జరుగుతోంది. ట్రైలర్లలో చూపించే గ్రాండియర్ సినిమా కంటెంట్‌లో లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. దీనివల్ల ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ పరిస్థితిని విశ్లేషిస్తూ కథనం.
ప్రేక్షకుల నమ్మకం కోల్పోతున్న దర్శకులు
Tollywood Industry: ప్రేక్షకుడికి కోపం వస్తే సోషల్ మీడియాలో తిడతాడు..నిరాశ చెందితే బాధపడతాడు. కానీ నమ్మకం పోతే… బుక్ మై షో యాప్‌నే డిలీట్ చేస్తాడు. ఇప్పుడున్న అతిపెద్ద జబ్బు ఇది. ట్రైలర్‌లో గ్రాండియర్ చూపిస్తారు, కానీ సినిమాలో అది ఒక 5 నిమిషాలు కూడా ఉండదు.
ఒకసారి ప్రేక్షకుల నమ్మకాన్ని దెబ్బతీసిన “బిగ్ ఫిషెస్” ని చూస్తె ‘ఆదిపురుష్’.. నేషనల్ వైడ్ హైప్ ఇచ్చారు. కానీ అవుట్‌పుట్ చూశాక, ప్రేక్షకుడు “మమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారా?” అని ఫీలయ్యాడు. ఫలితం? ఆ తర్వాత అదే డైరెక్టర్లు లేదా అదే కాంబినేషన్ అంటేనే జనం భయపడుతున్నారు.
చిరంజీవి ‘ఆచార్య’నే చూస్తె..స్టార్ పవర్ ఉంది, కానీ కంటెంట్‌లో ‘ఫ్రెష్‌నెస్’ లేదు. “మా హీరో సినిమా కదా, ఏదో ఒకటి తీస్తే చూస్తారులే” అనే అహంకారం మేకర్స్‌లో కనిపించినప్పుడు ప్రేక్షకుడు సైలెంట్ అయిపోతాడు. ఒక సామాన్యుడు తన వారం రోజుల సంపాదనను ఒక సినిమా మీద పెడతాడు. అక్కడ క్వాలిటీ లేకపోతే, అది కేవలం ఒక ఫ్లాప్ కాదు… ఆ ప్రేక్షకుడి నమ్మకం మీద పడ్డ దెబ్బ. ఇక సినిమా బాలేకపోయినా 400 టికెట్ పెడితే, సగటు ప్రేక్షకుడు “నెక్స్ట్ టైమ్ ఓటిటి లోనే చూద్దాం” అని ఫిక్స్ అవుతాడు. ఇది ఇండస్ట్రీకి స్లో పాయిజన్. నమ్మకం పోయిన చోట నమ్మకాన్ని తిరిగి సంపాదించిన వారు కూడా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా..యానిమల్ సినిమా మీద విమర్శలు ఉండొచ్చు..కానీ అతను ట్రైలర్‌లో ఏం చెప్పాడో థియేటర్లో అదే చూపించాడు. “వంగా సినిమా అంటే కచ్చితంగా ఏదో కొత్తగా ఉంటుంది” అనే నమ్మకాన్ని క్రియేట్ చేశాడు.
ప్రశాంత్ వర్మ …హనుమాన్ భారీ బడ్జెట్ లేదు, స్టార్ హీరో లేడు. కానీ “మేము ఒక మంచి సినిమా తీశాం, చూడండి” అని నిజాయితీగా చెప్పారు. ఆ క్వాలిటీ చూసి ప్రేక్షకుడు బ్రహ్మరథం పట్టాడు.
థియేటర్‌కి వెళ్లాల్సిన అవసరం ఉందా?
మలయాళ ఇండస్ట్రీ… ఇక్కడ బడ్జెట్ తక్కువ, కానీ నమ్మకం ఎక్కువ. “మలయాళం సినిమా అంటే మినిమం గ్యారెంటీ బాగుంటుంది” అనే బ్రాండ్ ఇమేజ్ వల్ల నేడు తెలుగు ప్రేక్షకులు కూడా వాళ్ళ సినిమాలు విరగబడి చూస్తున్నారు ప్రేక్షకుడు ఇప్పుడు “సినిమా బాగుందా?” అని అడగట్లేదు… “ఈ సినిమాకి థియేటర్‌కి వెళ్లాల్సిన అవసరం ఉందా?” అని అడుగుతున్నాడు. స్టార్ల రెమ్యూనరేషన్లు పెరగడం కాదు, కథల క్వాలిటీ పెరగాలి. ప్రేక్షకుడి జేబులో డబ్బుల కంటే, అతని మనసులో మీ సినిమా పట్ల ఉన్న రెస్పెక్ట్ ‘ ముఖ్యం. అది పోతే… ఇండస్ట్రీ షట్టర్లు పడిపోయినట్టే!
నమ్మకాన్ని నిలబెట్టుకున్న దర్శకులు
మెగాస్టార్ కంటెంట్ సెలక్షన్ అవుట్ డేటెడ్
ముఖ్యంగా చిరంజీవి ,పవన్ కళ్యాణ్ లు ఒకప్పుడు వీరు కొత్త ట్రెండ్స్ సెట్ చేసేవారు. కానీ ఇప్పుడు కేవలం ‘రీమేక్’ల మీద ఆధారపడటం ప్రేక్షకులను ఫుల్ డిసప్పాయింట్ చేసేసింది . చిరంజీవి ‘ఖైదీ No.150’ నుండి ‘భోళా శంకర్’ వరకు ఆయన ఎక్కువగా రీమేక్‌లనే నమ్ముకున్నారు. ప్రేక్షకులు బాస్ నుండి ‘జగదేకవీరుడు’ వంటి ఒరిజినాలిటీ కోరుకుంటే, ఆయన పక్క భాషల్లో హిట్టైన పాత కథలను వడ్డించారు. ముఖ్యంగా ‘భోళా శంకర్’ డిజాస్టర్ తర్వాత, “మెగాస్టార్ కంటెంట్ సెలక్షన్ అవుట్ డేటెడ్ అయిపోయింది” అనే నెగెటివ్ టాక్ బలంగా వినిపించింది. పవన్ కళ్యాణ్: ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’.. అన్నీ రీమేక్ లే. ఫ్యాన్స్ తప్ప సామాన్య ప్రేక్షకుడు “ఈ సినిమాలు ఆల్రెడీ వేరే భాషలో చూశాం కదా, మళ్ళీ ఎందుకు?”అని థియేటర్‌కు రావడం మానేశాడు.
ఒకప్పుడు పూరీ అంటే ఒక సెన్సేషన్
స్టార్ పవర్‌ను కేవలం రీమేక్‌ల కోసం వాడటం వల్ల పూరి బ్రాండ్ మీద ఉన్న ‘నమ్మకం’ తగ్గింది. ఒకప్పుడు పూరీ అంటే ఒక సెన్సేషన్. కానీ ‘లైగర్’ తో ఆయన ప్రేక్షకుల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీశారు. పాన్ ఇండియా అని చెప్పి, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ను తీసుకొచ్చి, ఒక అర్థం లేని సినిమా తీశారు. ‘డబుల్ ఇస్మార్ట్’ తో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది పోయి, మరింత పాత చింతకాయ పచ్చడి ఫార్ములాతో రావడం ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ. ఇక హరి హర వీరమల్లు/ఏజెంట్ నిర్మాతలు ఏళ్ల తరబడి షూటింగ్ వాయిదా వేస్తూ, మేకింగ్‌లో క్లారిటీ లేకుండా, చివరికి నాసిరకం అవుట్‌పుట్ ఇవ్వడం వల్ల ప్రొడక్షన్ హౌస్‌ల మీద నమ్మకం పోయింది.
డబ్బు కోసం సినిమాలు చుట్టేస్తున్నాడనే టాక్
ఇక మాస్ మహారాజ్ ఏడాదికి 3-4 సినిమాలు తీస్తాడు ..బట్ నో క్వాలిటీ . అందుకే ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘మిస్టర్ బచ్చన్’,మాస్ జాతర అంటూ వరుస ఫ్లాపులు. “రవితేజ సినిమా అంటే కనీసం సాంగ్స్ అయినా బాగుంటాయి” అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ లాంటి సినిమాలతో ఆ నమ్మకం కూడా పోయింది. కేవలం డబ్బు కోసం, స్పీడ్ కోసం సినిమాలు చుట్టేస్తున్నాడనే టాక్ పడిపోయింది .
ఓటిటి వేదికల వైపు అడుగులు
ఇంట్లో కూర్చుని వరల్డ్ సినిమా
ఈరోజుల్లో ప్రేక్షకుడు ఇంట్లో కూర్చుని వరల్డ్ సినిమా చూస్తున్నాడు. అలాంటిది పాత చింతకాయ పచ్చడి లాంటి ‘ఇంటర్వెల్ బ్యాంగ్స్’, ‘అనవసరమైన సాంగ్స్’ ఇస్తే థియేటర్ కిక ఎందుకొస్తాడు . మరో వైపు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నంబర్స్ మీద ఫోకస్ పెడుతున్నాయ్ తప్ప కంటెంట్ క్వాలిటీ మీద కాదు. ఒక పెద్ద హీరో + ఒక ఫ్లాప్ డైరెక్టర్ + ఒక రీమేక్ కథ = బిజినెస్ క్లోజ్. ఈ ఫార్ములాతో వాళ్ళు అప్పుడప్పుడు సేఫ్ అవుతున్నారేమో కాని కానీ, ప్రేక్షకుడికి మాత్రం విరక్తి కలుగుతుంది సినిమా అట్టర్ ఫ్లాప్ అని అందరికీ తెలుసు.కానీ 100 కోట్లు, 200 కోట్లు అని పోస్టర్లు వేస్తారు. ఈ అబద్దాల ప్రమోషన్స్ వల్లే మేకర్స్ మాట మీద నమ్మకం సున్నా అయిపోయింది. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, అది ఒక “ఎక్స్ పీరియన్స్”. ఆ ఎక్స్ పీరియన్స్ బాగుంటుందని మేకర్స్ భరోసా ఇచ్చినప్పుడే థియేటర్లు నిండుతాయి. “మేము కోట్లు ఖర్చు పెడుతున్నాం కాబట్టి మీరు చూడాలి” అనే తలపోగరు పోయి”మేము ఒక మంచి కథను మీకు అందిస్తున్నాం” అనే చెప్పగలిగినప్పుడే ప్రేక్షకుడు మళ్ళీ నమ్మకంతో థియేటర్ మెట్లు ఎక్కుతాడు.
ప్రేక్షకుడు ఒక ‘ATM మెషిన్’ మాత్రమేనా ?
చూస్తుంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో “క్యాష్ అండ్ క్యారీ” పద్ధతి నడుస్తోంది. హీరోకి తన రెమ్యూనరేషన్ ముఖ్యం. డైరెక్టర్‌కి తన కమిషన్ ముఖ్యం. ప్రొడ్యూసర్‌కి తన టేబుల్ ప్రాఫిట్ ముఖ్యం. మరి ప్రేక్షకుడు? కేవలం వీళ్లందరికీ డబ్బులు సమకూర్చే ఒక ‘ATM మెషిన్’ మాత్రమే అయిపోయాడు. అందుకే ఇప్పుడు ప్రేక్షకుడు తిరగబడుతున్నాడు. “మీరు మమ్మల్ని నమ్మించలేనప్పుడు, మేము మీ టికెట్లు కొనలేం” అని ముఖం మీద కొట్టినట్టు చెబుతున్నాడు. “సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత పోతాడు, కానీ నమ్మకం పోతే ఇండస్ట్రీనే పోతుంది.”చూస్తుంటే ఇప్పుడు మనం ఆ స్టేజ్ లోనే ఉన్నట్టున్నాం !!
ప్రేక్షకుడి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ద్వారానే సినిమా పరిశ్రమ మనుగడ సాధ్యమని గుర్తించాలి. మంచి కథలను అందించడం ద్వారా మాత్రమే ప్రేక్షకుల ఆదరణ పొందగలమని మేకర్స్ తెలుసుకోవాలి.


