
📌 Key Points
- తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ఇకపై వాహన్ పోర్టల్ ద్వారా, జాతీయ డేటాబేస్‌లో నమోదు.
- చిరునామా మార్పు వంటి సేవలు ఆన్‌లైన్‌లోనే, ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
- రెండో వాహనం కొనుగోలుపై అదనపు ట్యాక్స్ ఉండదు, వాహనదారులకు ఊరట.
- ప్రతి సంవత్సరం 1.91 లక్షల మంది రెండో వాహనాల కొనుగోలుదారులకు ప్రయోజనం.
తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. ఇకపై కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. దీని ద్వారా వాహనదారులకు అనేక సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి రానున్నాయి.
వాహన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రవాణా శాఖ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా… ఇకపై కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి వాహనం కూడా వాహన్‌తో అనుసంధానమవుతుంది.
కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్ తో అనుసంధానం చేయడం వల్ల రాష్ట్రంలోని వాహనాల వివరాలు జాతీయ డేటాబేస్ లోకి వెళ్తాయి. ఫలితంగా వాహనాలకు సంబంధించిన అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందుబాటులోకి వస్తాయి. ఈ నిర్ణయంతో వాహనదారులకు గతంలో ఉన్న ఇబ్బందులు తప్పే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత విధానంతో వాహన యజమాని చిరునామా, పేరు మార్పు, వాహన RC డూప్లీకేట్ కాపీ వంటి సేవలు ఆన్ లైన్ లో అందుబాటులో లేవు. ఈ సేవల కోసం ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లాల్సి ఉండేది. కానీ వాహన్ పోర్టల్ అనుసంధానం ద్వారా…. ఈ తరహా సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోకి వస్తాయి. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా…. ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ లో వాహనాలకు సంబంధించిన పనులను పూర్తి చేసుకునే వీలు ఉంటుంది. ఫలితంగా దళారుల ప్రమేయం లేకుండానే పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో వాహన సేవలు
జాతీయ పోర్టల్ వాహన్ తో అనుసంధానంతో వాహనదారులకు మరో ప్రయోజనం ఉండనుంది. రెండో వాహనం కొనుగోలుపై అదనపు ట్యాక్స్ ఉండదు. సాధారణంగా ఒక వ్యక్తికి ఓ వాహనం ఉన్న తర్వాత… మరో వాహనం కొనుగోలు చేస్తే 2 శాతం అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అదనపు ట్సాక్స్ చెల్లించే వారి సంఖ్య ప్రతి ఏడాది ఎక్కువగానే ఉంటోంది. వాహన్ తో అనుసంధానమైతే…. ఈ ట్యాక్స్ జనరేట్ కాదు.
రవాణశాఖ గణాంకాల ప్రకారం….. తెలంగాణ రాష్ట్రంలో ఏటా సగటున 7 లక్షల కొత్త ద్విచక్రవాహనాలు, రెండున్నర లక్షలకుపైగా కార్లు కొనుగోళ్లు జరుగుతున్నాయి. వీటిల్లో 1.91 లక్షల వరకు రెండో వాహనాల కేటగిరి కిందనే ఉంటున్నారు. వీరంతా కూడా 2 శాతం అదనపు లైఫ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. ఫలితంగా రవాణా శాఖకు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఆదాయం వస్తోంది. పలు సమస్యలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం… ఈ తరహా ట్యాక్స్ ను ఎత్తివేయాలని భావిస్తూ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు సమీక్షించి… అధికారులకు పలు సూచనలు కూడా చేశారు.
ఈ ట్యాక్స్ రద్దు చేయటానికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫామ్ “వాహన్”లో రెండో వాహనం గుర్తించే ప్రత్యేక ఆప్షన్ లేదు. ఇది కూడా ఇబ్బందిగా మారింది. పైగా ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా పన్ను లేవని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. వీటన్నింటిని విశ్లేషించిన ప్రభుత్వం…. ఈ పన్నును పూర్తిగా ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంటే వాహన్ తో అనుసంధానం వల్ల రెండో వాహనం కొనుగోలు చేసే వారికి ఖర్చు తగ్గడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కాస్త సులభమవుతుంది.
రెండో వాహనంపై అదనపు ట్యాక్స్ రద్దు
ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తున్నవారు డీలర్ షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటున్నారు. గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను(టీఆర్) డీలర్ వద్ద చేసుకునే వారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో…. ప్రస్తుతం షోరూమ్ డీలర్ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం ఉండదు.
వాహనాన్ని విక్రయించిన డీలరే….. వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాలను సమర్పిస్తారు. వీటిని పరిశీలించిన తర్వాత ఆర్టీవో కార్యాలయం నుంచి నెంబర్ కేటాయిస్తారు. అవసరమనుకుంటే రవాణా శాఖ అధికారులు డీలర్ వద్ద షోరూంలోనే వాహనాన్ని తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.
రవాణా శాఖలో తీసుకువస్తున్న కొత్త సంస్కరణల అమలు నేపథ్యంలో ఆర్టీవో కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, క్యూ లైన్‌లో వెయిటింగ్, కార్డు కోసం తిప్పలు తప్పినట్లు అయింది. ఈ నిర్ణయంపై వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వాహన్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అందుబాటులోకి వస్తే…. చాలా సేవలు ఆన్ లైన్ లో ఉంటాయి.
ఈ నిర్ణయం వాహనదారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, అదనపు పన్ను భారం కూడా తగ్గనుంది. ఇది రవాణా శాఖలో ఒక ముందడుగు.


