
📌 Key Points
- ప్రభాస్ సినిమా ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
- సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్లకు, వీఎఫ్ఎక్స్ టీమ్‌లకు ఇంకా పేమెంట్స్ అందలేదని సమాచారం.
- నిర్మాత ఓటీటీ డీల్ ద్వారా వచ్చిన డబ్బులతో బాకీలు తీరుస్తానని హామీ ఇచ్చారు, కానీ స్పందించడం లేదు.
- బాధిత టెక్నీషియన్లు ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల తరువాత వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, వీఎఫ్ఎక్స్ టీమ్‌లకు ఇంకా పేమెంట్స్ అందలేదని తెలుస్తోంది. దీంతో వారు ఫిలిం ఛాంబర్ తలుపు తట్టేందుకు సిద్ధమయ్యారు.
‘ది రాజా సాబ్’ సినిమా ఫలితం
The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) క్రేజ్‌ను నమ్ముకుని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడమే కాకుండా, ఇప్పుడు తీవ్ర వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. సినిమా ఫ్లాప్ అవ్వడంతో నిర్మాతలతో పాటు బయ్యర్లు కూడా భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన టెక్నీషియన్లు, వీఎఫ్ఎక్స్ (VFX) టీమ్‌లు, వివిధ స్టూడియోలకు రావాల్సిన పేమెంట్లు ఇంకా క్లియర్ కాలేదని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమా బడ్జెట్ పరంగా చాలా అవకతవకలు జరిగాయనేలా టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో నిర్మాత కూడా చాలా సీరియస్‌గా ఉన్నారని, ఏదో ఒక రోజు బరస్ట్ అవుతారనేలా ఇండస్ట్రీ అంతా కోడై కూస్తుంది. ఇప్పుడు మరో కొత్త పంచాయితీ.
పేమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న టెక్నీషియన్లు
వాస్తవానికి సినిమా రిలీజ్ సమయంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, ఓటీటీ (OTT) డీల్ పూర్తి కాగానే వచ్చిన డబ్బులతో అందరి బాకీలు తీర్చేస్తామని నిర్మాత హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ, ఇప్పుడు సినిమా ఫలితం తేడా కొట్టడం, ఓటీటీ ఆదాయం వచ్చినా నిర్మాత స్పందించకపోవడంతో పనులు చేసిన వర్కర్లు ఆందోళన చెందుతున్నారు. ఫోన్లు చేసినా, నేరుగా కలవాలని ప్రయత్నించినా సరైన సమాధానం రాకపోవడంతో, విసిగిపోయిన బాధిత టెక్నీషియన్లు ఇప్పుడు ఫిలిం ఛాంబర్‌లో పంచాయితీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఆ సంస్థ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుంది. మొదటి నుంచి ఈ సంస్థ అందరినీ అతిగా నమ్మడం, చివరకు ఇలా మోసపోవడం జరుగుతూ వస్తుంది. వంద సినిమాలు తీయాలనే డ్రీమ్ కంటే, చేసిన పది సినిమాలైనా ఎప్పటికీ గుర్తుండిపోవాలని సదరు నిర్మాత ఎప్పటికి తెలుసుకుంటారో..
ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదుకు సిద్దం అవుతున్న వర్కర్లు
సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, దాని కోసం పని చేసిన కింది స్థాయి కార్మికులకు, టెక్నీషియన్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఆపడం సరికాదనే చర్చ టాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని నిర్మాతలు చెబుతుంటే, తమ రెక్కల కష్టానికి ఫలితం దక్కలేదని వర్కర్లు వాపోతున్నారు. ఈ వివాదం మరిన్ని మలుపులు తిరగకముందే పెద్దలు జోక్యం చేసుకుని ఈ పేమెంట్ పంచాయితీని సర్దుబాటు చేస్తారో లేదో చూడాలి. ఏదేమైనా, ఒక భారీ ప్రాజెక్టు ఇలా పేమెంట్ వివాదాల్లో చిక్కుకోవడం అటు ప్రభాస్ ఫ్యాన్స్‌ను, ఇటు ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. చూద్దాం.. ఫైనల్‌గా ఈ పంచాయితీ ఎలా ముగుస్తుందో..
సినిమా ఫలితం ఎలా ఉన్నా, కింది స్థాయి కార్మికులకు డబ్బులు చెల్లించకపోవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం మరింత ముదరకుండా పెద్దలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


