|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్‌లో పెను ప్రకంపనలు! మళ్లీ షూటింగ్‌లు బంద్ అయ్యేనా? సమ్మె సైరన్ మోగిందా?

Published: 09-02-2026, 2:05 PM
టాలీవుడ్‌లో పెను ప్రకంపనలు! మళ్లీ షూటింగ్‌లు బంద్ అయ్యేనా? సమ్మె సైరన్ మోగిందా?
  • టెక్నీషియన్లు, ప్రొడక్షన్ యూనియన్ల సమ్మె హెచ్చరికతో టాలీవుడ్‌లో మళ్లీ ఆందోళన.
  • వేతనాల పెంపు, పని వేళలపై స్పష్టత, కార్మికుల సంక్షేమం డిమాండ్లతో యూనియన్ల లేఖలు.
  • మార్చి 1 నుంచి షూటింగ్‌లు నిలిపివేస్తామని టెక్నీషియన్లు, ప్రొడక్షన్ యూనియన్ల అల్టిమేటం.
  • సమ్మె జరిగితే భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు నష్టపోయే ప్రమాదం ఉంది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మళ్ళీ సమ్మె వాతావరణం నెలకొంది. టెక్నీషియన్లు, ప్రొడక్షన్ యూనియన్లు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమవుతున్నారు. వేతనాల పెంపుదల మరియు పని పరిస్థితుల మెరుగుదల వారి ప్రధాన డిమాండ్లు.

టెక్నీషియన్ల సమ్మె హెచ్చరిక

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో (Tollywood) మళ్లీ సమ్మె హారన్ మోగనున్నట్లుగా టాక్ నడుస్తోంది. గతేడాది సమ్మె (Strike) సెగలు చల్లారి, ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందనుకుంటున్న తరుణంలో.. టెక్నీషియన్లు, ప్రొడక్షన్ యూనియన్లు మరోసారి ‘సమ్మె’ అస్త్రాన్ని బయటకు తీశాయి. తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని మండిపడుతూ, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడికి ఘాటుగా లేఖలు రాశారు. ఇప్పుడు లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇలాగే కార్మికులు రోడ్డెక్కితే, షూటింగ్‌లన్నీ ఆగిపోయి టాలీవుడ్ స్తంభించిపోయింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి, ఇరు పక్షాలతో చర్చలు జరిపి, ఒక మధ్యేమార్గం చూపింది. దాంతో అంతా సద్దుమణిగింది అని ఊపిరి పీల్చుకునేలోపే.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు గానీ, ఫెడరేషన్ చేసిన వాగ్దానాలు గానీ ఆచరణలోకి రాలేదన్నది టెక్నీషియన్ల ప్రధాన ఆరోపణ.

యూనియన్ల డిమాండ్లు ఏమిటి?

ప్రధానంగా టెక్నీషియన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్లు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరో 11 యూనియన్లు కూడా ఇదే అసంతృప్తితో ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. వేతనాల పెంపు, పని వేళల్లో స్పష్టత, కార్మికుల సంక్షేమం, బీమా సౌకర్యాలు వంటి డిమాండ్లతో టెక్నీషియన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్లు లేఖలు సంధించాయి. ఈ ఫిబ్రవరి ఆఖరులోపు చర్చలు ఫలించకపోతే, మార్చి 1 నుంచి కెమెరాలకు విశ్రాంతి ఇచ్చేస్తామని, షూటింగ్‌లను బహిష్కరిస్తామని వారు అల్టిమేటం జారీ చేశారు. అదే జరిగితే మరోసారి టాలీవుడ్‌కు సంక్షోభం తప్పదు.

టాలీవుడ్‌పై సమ్మె ప్రభావం

ప్రస్తుతం టాలీవుడ్‌లో సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న భారీ బడ్జెట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ మార్చిలో సమ్మె మొదలైతే, నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. రోజుకు కోట్లలో వడ్డీలు, కాల్షీట్ల సమస్యలు ఇండస్ట్రీని కుదిపేసే ప్రమాదం ఉంది. ‘సినీ కార్మికుడు బాగుంటేనే సినిమా బాగుంటుంది. కానీ, అదే కార్మికుడు పస్తులుంటే ఇండస్ట్రీకి కళ ఉండదు’ అని అంటారు. మళ్లీ అలాంటి రోజులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా సినీ పెద్దలు, ఛాంబర్ ప్రతినిధులు, ప్రభుత్వం కలిసి కూర్చుని ఒక శాశ్వత పరిష్కారాన్ని వెతకాలి. సమ్మె అనేది సమస్యకు పరిష్కారం కాకపోయినా, కార్మికుల ఆకలి కేకలను వినాల్సిన బాధ్యత ఉంది కదా. మరి ఈ నెలాఖరులోపు చర్చలు సఫలమై ‘లైట్స్.. కెమెరా.. యాక్షన్..’ అని వినిపిస్తుందో లేక స్టూడియోలు నిశ్శబ్దంగా మారిపోతాయో వేచి చూడాలి.

టెక్నీషియన్లు, నిర్మాతల మధ్య సయోధ్య కుదిరితేనే టాలీవుడ్ మళ్లీ కళకళలాడుతుంది. లేదంటే పరిశ్రమకు నష్టాలు తప్పవు. ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.