
ఫిలిం ఫెడరేషన్ నాయకులతో చర్చలు విఫలమైన నేపథ్యంలో తెలుగు సినిమా కార్మికులు 7వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు ర్యాలీలో పాల్గొంటున్నారు. వేతన పెంపుపై తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.
Key Points
24 సినీ క్రాఫ్ట్ విభాగాల సభ్యులు 7 రోజుల సమ్మెలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు.
వేతనాల పెంపుపై నిర్మాతలు, కార్మికుల మధ్య చర్చలు విఫలమయ్యాయి.
నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ యూనియన్ పై కేసు వేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి కోమటి రెడ్డి నేడు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరపనున్నారు.
7 రోజుల సినీ కార్మికుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఫిలిం ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలం అయిన నేపథ్యంలో సినీ కార్మికులు నేడు (ఆగస్టు 10) నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నిరసనలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొననున్నారు. అన్నపూర్ణ 7 ఎకర్స్ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయనున్నారు.
కార్మికులపై విమర్శలు చేస్తూ కేసులు పెడుతున్న నిర్మాత టి.జి విశ్వప్రసాద్ తీరుపై నిరసన తెలపడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఫిలిం ఫెడరేషన్ ప్రకటించనుంది. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో మంత్రి కోమటి రెడ్డి నేడు చర్చలు జరపనున్నారు. కాగా పీపుల్స్ మీడియా అధినేత విశ్వ ప్రసాద్ సిటీ సివిల్ కోర్టులో యూనియన్‌పై కేసు వేశారు. ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాటి వెంకటకృష్ణకు లీగల్ నోటీసు పంపారు. ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 30% వేతనాల పెంపు డిమాండ్ చేస్తున్న కార్మికుల సమ్మె నేడు ఏడో రోజుకు చేరింది.
చర్చలు విఫలం తెలుగు సినీ కార్మికుల వేతనాల పెంపు విషయమై కార్మికుల సంఘం – నిర్మాతల మండలి మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగడం లేదు. శనివారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్‌లో నిర్మాతల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సినీ కార్మికుల వేతనాల పెంపుపై తమ నిర్ణయాలను నిర్మాతలు వెల్లడించారు. మూడు విడతలుగా కార్మికుల వేతన పెంపును అమలు చేయనున్నట్లుగా తెలిపారు.
వేతన పెంపుపై చర్చలు విఫలం
జీతాన్ని బట్టి పెంపు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి దామోదరప్రసాద్ మాట్లాడుతూ– ‘‘రోజుకి రూ. 2000 లేదా అంతకన్నా తక్కువ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంపు ఉంటుంది. రోజుకి రూ. 1000 రూపాయలు లేదా అంతకన్నా తక్కువ వేతనం తీసుకుంటున్న కార్మికులకు స్ట్రయిట్‌గా 20 శాతం పెంపుదల చేస్తాం. మళ్లీ మూడో ఏడాది 5 శాతం పెంపుదల ఉంటుంది. మేము ఇప్పటికే కార్మికుల సంఘం ముందు ఉంచిన నాలుగు ప్రతిపాదనలను వారు అంగీకరిస్తేనే ఇవి అమలు అవుతాయి. అలాగే చిన్న బడ్జెట్ సినిమాలకు పాత వేతనాలనే చెల్లిస్తాం. అయితే చిన్న సినిమా బడ్జెట్ పరిమితి… తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ఇప్పటికే రోజుకి రూ. 4 వేలు, రూ. 5 వేలు తీసుకుంటున్న కార్మికులకు వేతనాలు పెంచమనడం సరైంది కాదు’’ అని పేర్కొన్నారు.
వారి ప్రతిపాదనలు ఒప్పుకోలేదు కార్మికుల సంఘం అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. ‘‘మా చర్చలు విఫలమైనట్లుగా మేం భావిస్తున్నాం. చర్చలంటూ పిలిచారు. పర్సెంటేజ్ విధానం చెప్పారు. కానీ అందరికీ ఇస్తే అంగీకరిస్తాం అని చెప్పాం. అయితే ఫెడరేషన్‌ను విభజించాలనుకున్నట్లుగా పర్సెంటేజ్‌లను క్రియేట్ చేశారు. అది మేం అస్సలు ఒప్పుకోలేదు. 30 శాతం పెంపుదల విభజన (ఒక్కో ఏడాది కొంచెం కొంచెంగా)కు మేం సిద్ధం. కానీ వాళ్లు ఫెడరేషన్‌లోని కొన్ని యూనియన్లకు పెంచుతామని, మరికొన్ని యూనియన్లకు పెంచమని చెప్పారు. ఇందుకు ఒప్పుకునేది లేదు.
టి.జి. విశ్వప్రసాద్‌పై కార్మికుల ఆగ్రహం
అందరికీ సమానంగా పెంచాలి రోజువారీ వేతనాలు తీసుకునే యూనియన్స్ 13 ఉన్నాయి. అందరికీ సమానంగా పెంచాలని చెప్పాం. తక్కువ, ఎక్కువలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదామన్నాం. కానీ వాళ్ళు ఒక ఫిగర్ చెప్పుకుండానే వెళ్లిపోయారు. అక్కడ జరిగింది వేరు… బయటికి వచ్చి మాట్లాడింది వేరు. ఫైటర్స్, డ్యాన్సర్స్, టెక్నిషియన్స్.. ముఖ్యంగా కెమెరా టెక్నిషియన్స్ గురించి మాట్లాడలేదు. మేం 24 యూనియన్స్ ఉన్నాం. యూనియన్లను విడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు’’ అని అనిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడంతో ఆదివారం నుంచి తమ నిరసనలను తీవ్రతరం చేస్తామని కార్మికుల సంఘం నాయకులు అంటున్నారు.
సినిమా కార్మికుల సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. వేతన పెంపుపై చర్చలు విఫలమవడంతో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తు కార్యాచరణను ఫిలిం ఫెడరేషన్ ప్రకటించనుంది.


