|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు సంచలన లేఖ

Published: 27-05-2026, 5:01 PM
తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు సంచలన లేఖ

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో అడుగు ముందుకు వేశారు. ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజ్ (Tummidihetti Barrage) ఎత్తు పెంపు వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓ అధికారిక లేఖ రాశారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు అంశాన్ని మరోసారి ఉమ్మడిగా సమీక్షించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక ప్రతినిధుల బృందానికి తగిన సమయం ఇవ్వాలని, ఇరు రాష్ట్రాల సమావేశ తేదీని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని మహారాష్ట్ర సీఎంను కోరారు. తెలంగాణ నీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. గతంలో అంగీకరించిన 148 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) తెలంగాణ అవసరాలకు ఏమాత్రం సరిపోదని సీఎం రేవంత్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. కేవలం ఒక ప్రాంతానికే కాకుండా.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌తో పాటు మెదక్ జిల్లాల సాగునీటి, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యారేజ్ ఎత్తును పెంచాల్సి ఉందని తెలిపారు.

ఒకవేళ బ్యారేజ్ ఎఫ్‌ఆర్‌ఎల్ (FRL) పెంచితే పంపులు, కరెంట్ అవసరం లేకుండా నేరుగా గ్రావిటీతో తెలంగాణకు నీటిని తరలించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎత్తు పెంచినప్పటికీ మహారాష్ట్ర వైపు ముంపు ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని అన్నారు. అయితే, తెలంగాణ నీటి హక్కుల సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాజకీయ, నీటిపారుదల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.