
📌 Key Points
- టర్కీకి 1 బిలియన్ డాలర్లు, అందమైన భార్యను ఇవ్వాలని ఉగాండా ఆర్మీ చీఫ్ డిమాండ్
- సోమాలియాలో ఉగాండా సైన్యం సేవలకు టర్కీ చెల్లించాలన్నది కైనెరుగాబా వాదన
- టర్కీ డిమాండ్లను నెరవేర్చకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక
- ఇజ్రాయెల్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ లక్ష సైనికులను పంపడానికి సిద్ధమని ప్రకటన
ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా టర్కీ దేశానికి ఒక వింత ప్రతిపాదన చేశారు. టర్కీ తమకు 1 బిలియన్ డాలర్లు చెల్లించడంతో పాటు ఆ దేశంలోని అందమైన మహిళను తనకు భార్యగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
టర్కీకి ఉగాండా ఆర్మీ చీఫ్ డిమాండ్ ఏమిటి?
ఏదైనా రెండు దేశాల మధ్య ఒప్పందాలు, పరస్పర సహకారం కోసం జరిగే సంప్రదింపులు చాలా డీసెంట్‍గా ఉంటాయి. ఈ చర్చల్లో పాల్గొనే నాయకులు, అధికారులు సైతం అంతే హుందాతనంతో వ్యవహరిస్తుంటారు. ఏ మాత్రం తేడా కొట్టినా అది ఆ రెండు దేశాల మధ్య వాతావరణాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కానీ తాజాగా ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా మాత్రం టర్నీ దేశం ముందు పెట్టిన వింతైన కోరికలు వివాదాస్పదం అయ్యాయి. టర్కీ దేశాన్ని టార్గెట్ చేస్తూ టర్కీ ప్రభుత్వం తమకు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లు) చెల్లించడంతో పాటు ఆ దేశంలోని అత్యంత అందమైన మహిళను తనకు భార్యగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
శనివారం కైనెరుగాబా ఎక్స్ వేదికగా వరుస పోస్టులు చేశారు. ఇందులో టర్కీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ సోమాలియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరాడటానికి ఉగాండా దశాబ్దాలుగా సైన్యాన్ని పంపి రక్షణ కల్పిస్తుంటే టర్కీ మాత్రం అక్కడ మౌలిక సదుపాయాల ఒప్పందాలు, ఓడరేవులు, విమానాశ్రయాల ద్వారా లాభాలు గడిస్తోందని ఆరోపించారు. ఈ రక్షణ సేవలకు ప్రతిఫలంగా “సెక్యూరిటీ డివిడెండ్” కింద టర్కీ 1 బిలియన్ డాలర్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా.. డబ్బుతో పాటు టర్కీలోని అత్యంత అందమైన మహిళను నాకు భార్యగా ఇవ్వాలి అంటూ కైనెరుగాబా పోస్టు చేశారు.
కైనెరుగాబా చేసిన ఆరోపణలు, హెచ్చరికలు
టర్కీ తమ డిమాండ్లను నెరవేర్చడానికి 30 రోజుల సమయం ఇస్తున్నట్లు కైనెరుగాబా ప్రకటించారు. ఒకవేళ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కంపాలాలోని టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని, ఉగాండా గగనతలంలోకి ‘టర్కిష్ ఎయిర్‌లైన్స్’ విమానాలను అనుమతించబోమని హెచ్చరించారు. అలాగే ఉగాండా ప్రజలు ఎవరూ టర్కీకి వెళ్లవద్దని, అక్కడ మీకు రక్షణ ఉండదని సూచించారు. టర్కీపై విమర్శలు చేస్తూనే మరోవైపు ఇజ్రాయెల్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పవిత్ర భూమిని కాపాడటానికి నా నేతృత్వంలో లక్ష మంది ఉగాండా సైనికులను పంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌కు ఉగాండా మద్దతు ప్రకటన
కైనెరుగాబా ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. ఇటువంటి వింత డిమాండ్లు గతంలోనూ చేశారు. 2022లో ఆయన ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని గురించి మాట్లాడుతూ.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్రతిఫలంగా 100 అంకోల్ ఆవులను ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ ఇటలీ ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తే, కేవలం కొద్ది రోజుల్లోనే తాము రోమ్ నగరాన్ని ఆక్రమిస్తామంటూ వ్యాఖ్యానించారు. ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవేని కుమారుడైన ముహూజీ కైనెరుగాబా గతంలో పొరుగు దేశమైన కెన్యాపై దాడి చేసి నైరోబీని ఆక్రమిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కైనెరుగాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ సమయంలో అధ్యక్షుడు ముసెవేని జోక్యం చేసుకుని, తన కుమారుడి తరపున ఇతర దేశాలకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి టర్కిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలపై అటు టర్కీ గానీ, ఇటు సోమాలియా గానీ స్పందించలేదు. ఇవి ఉగాండా ప్రభుత్వ అధికారిక నిర్ణయాలా లేక జనరల్ వ్యక్తిగత అభిప్రాయాలా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఉగాండా ఆర్మీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. టర్కీ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇది రెండు దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.


