
📌 Key Points
- 2026 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు భారతీయులకు హెచ్చరిక.
- భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య 2019-2024 మధ్య 2.5 లక్షల నుంచి 3.5 లక్షలకు పెరిగింది.
- పర్మినెంట్ రెసిడెన్సీకి ఐదేళ్ల కాలాన్ని 10 ఏళ్లకు పెంచాలని బ్రిటన్ ప్రతిపాదన.
- వర్క్ వీసా కోసం కనీస వార్షిక జీతం సుమారు రూ. 44 లక్షలకు పెంచారు.
భారతీయ విద్యార్థులు, నిపుణుల కలల సౌధం బ్రిటన్. అయితే, 2026 నుంచి కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అమల్లోకి రానుండటంతో పరిస్థితులు మారనున్నాయి. ఈ కొత్త నిబంధనలు భారతీయులకు గట్టి హెచ్చరికలు పంపుతున్నాయి.
భారతీయులకు బ్రిటన్ గుడ్ న్యూస్.. గుడ్ బై?
బ్రిటన్ అంటే భారతీయ విద్యార్థులకు, నిపుణులకు దశాబ్దాలుగా ఒక కలల సౌధం. కానీ, 2026లో మారుతున్న భౌగోళిక రాజకీయాలు, ఆ దేశ అంతర్గత పరిస్థితులు ఆ సౌధానికి గట్టి తాళాలు వేస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ 2026 నుంచి అమలులోకి రానున్న నూతన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు భారతీయులకు గట్టి హెచ్చరికలు పంపుతున్నాయి. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి చూస్తుంటే, ‘వలసలను నియంత్రించడం’ కంటే ‘భారతీయులను దూరం పెట్టడమే’ వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, 2019 నుండి 2024 మధ్య కాలంలో భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య సుమారు 2.5 లక్షల నుండి 3.5 లక్షల వరకు పెరిగింది. 2023 నాటికి బ్రిటన్ స్టూడెంట్ వీసాలు పొందిన వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. అప్పట్లో నిబంధనలు చాలా సరళంగా ఉండేవి. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత రెండేళ్ల పాటు అక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కునేందుకు ‘పోస్ట్ స్టడీ వర్క్’ వీసా వెసులుబాటు ఉండేది. అలాగే, కేర్ వర్కర్లు తమ కుటుంబ సభ్యులను (డిపెండెంట్స్) వెంట తీసుకువెళ్లే అవకాశం ఉండేది. ఈ వెసులుబాటు వల్లే మధ్యతరగతి భారతీయులు వేల సంఖ్యలో బ్రిటన్ బాట పట్టారు.
అయితే, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. 2026 కొత్త నిబంధనల ప్రకారం, పర్మనెంట్ రెసిడెన్సీ పొందాలంటే ఇప్పటివరకు ఉన్న ఐదేళ్ల కాలపరిమితిని 10 ఏళ్లకు పెంచాలని బ్రిటన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది భారతీయుల స్థిరనివాస కలలపై నీళ్లు చల్లడమే. దీనికి తోడు, గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితిని 2 ఏళ్ల నుండి 18 నెలలకు తగ్గించబోతున్నారు. అంటే, లక్షల రూపాయలు ఖర్చు చేసి చదువుకున్న విద్యార్థికి అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడటానికి ఇచ్చే సమయం చాలా తక్కువ. అలాగే, వర్క్ వీసా పొందాలంటే ఉండాల్సిన కనీస వార్షిక జీత పరిమితిని కూడా £41,700 (సుమారు 44 లక్షల రూపాయలు) కు పెంచారు. ఇంత భారీ ప్యాకేజీ ప్రారంభంలోనే రావడం సాధారణ ఉద్యోగులకు దాదాపు అసాధ్యం.
కొత్త నిబంధనలతో భారతీయులపై పెనుభారం
ఏ క్రీడలో అయినా రూల్స్ ముందుగా అనుకున్నాకే ఆడటం మొదలుపెడతారు.. కానీ, ఆట మధ్యలో రూల్స్ మార్చేస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలాగే ఉంటుంది. పీఆర్‌పై 2026 తీసుకున్న నిర్ణయాన్ని 2021లోనే బ్రిటన్‌కు వచ్చినవాళ్లకు కూడా అమలు చేస్తామని చెప్పడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. ఈ నిర్ణయం అక్కడి భారతీయులకు ఊహించని దెబ్బలా మారిందని చెప్తున్నారు. కొత్త విధానంతో చాలామంది బ్రిటన్ లో ఉండే అవకాశమే కోల్పోతుండగా.. ఉన్నవాళ్లకు వీసా ఎక్స్ టెన్షన్ కోసం మరో రెండు సార్లు లక్షల్లో చెల్లించాల్సి వస్తుంది. ఒక కుటుంబంలో భార్యా, భర్త, కూతురు ఉంటే వాళ్లు ఒకసారి వీసాకు 12లక్షలకుపైగా కట్టాల్సి వస్తుంది. ఇది వారి పెనుభారం కానున్నది. అయితే, గతంలో ఇలాంటి చట్టమే తీసుకువచ్చినప్పుడు అక్కడి కోర్టులు చెల్లవని తీర్పునిచ్చాయి. ఈసారి ఏం జరుగుతుందో వేచిచూడాలి.
భారతీయుల కలలపై నీళ్లు చల్లిన బ్రిటన్
ఈ కఠినమైన మార్పుల వల్ల భారతీయులకు బ్రిటన్ ప్రత్యామ్నాయం ఏది కాబోతున్నది? ఇప్పుడు అందరి కళ్లు జర్మనీ, జపాన్, మరియు ఆస్ట్రేలియా వైపు మళ్లుతున్నాయి. జర్మనీ తన ‘ఆపర్చునిటీ కార్డ్’ ద్వారా నైపుణ్యం కలిగిన భారతీయులను ఆహ్వానిస్తోంది. మరోవైపు జపాన్ తన ఐటి రంగానికి భారతీయ టెకీలను కోరుకుంటోంది. బ్రిటన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయుల వంటి నైపుణ్యం కలిగిన శ్రమశక్తిని కోల్పోవడం వల్ల అక్కడి ఆసుపత్రులు, ఐటి కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఏదేమైనా, 2026లో బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే, అప్పులు చేసి వెళ్లిన వారికి ఆ దేశం కేవలం నిరాశను మాత్రమే మిగిల్చే ప్రమాదం ఉంది.
మొత్తానికి బ్రిటన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అక్కడ స్థిరపడాలనుకునే భారతీయులకు ఒక పెద్ద సవాలుగా మారనున్నాయి. కొత్త నిబంధనలు వారి భవిష్యత్తు ప్రణాళికలను మార్చేసే అవకాశం ఉంది.


