
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌లో కీలక బాధ్యతలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకం తెలంగాణ క్రీడల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Key Points
ఉపాసన కొణిదెలకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌లో కో-ఛైర్మన్ పదవి
సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు
ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యంతో తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం
స్పోర్ట్స్ హబ్ బోర్డులో ప్రముఖులు, క్రీడాకారులు సభ్యులుగా ఉన్నారు
ఉపాసనకు కీలక బాధ్యతలు
మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు కీలక బాధ్యతలు వరించాయి. తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు సంబంధించిన ముఖ్య పదవిని ఉపాసన కొణిదెలకు అప్పగించింది రాష్ట్ర సర్కార్.
అయితే, రీసెంట్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రైవేట్-పబ్లిక్ పార్టనర్‌షిప్‌కు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. క్రీడా రంగాలను ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ సంస్థలతోపాటు ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న ఓ బోర్డును ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఈ క్రమంలోనే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గొయెంకాను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ గవర్నెన్స్ బోర్డుకు ఛైర్మన్‌గా నియమించారు. తాజాగా అత్యున్నత కో ఛైర్మన్ పదవిని ఉపాసన కొణిదెలకు అప్పజెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
ఈ సందర్భంగా ఎక్స్ (గతంలో ట్విటర్)లో ట్వీట్ చేశారు ఉపాసన కొణిదెల. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి కతృజ్ఞతలు తెలిపారు ఉపాసన కొణిదెల. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ క్రీడా శక్తిగా తీర్చిదిద్దేందుకు సంజీవ్ గోయెంకా తోపాటు స్పోర్ట్స్ హబ్ కో ఛైర్మన్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. నన్ను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి , తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు. ప్రభుత్వ-ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లను నిర్మించడానికి రాష్ట్రంలో క్రీడలను ప్రోతసహించడానికి ఇది ఒక శక్తివంతమైన అడుగు” అని ట్వీట్‌లో ఉపాసన కొణిదెల పేర్కొన్నారు.
ఇకపోతే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ సభ్యులుగా సన్ టీవీ నెట్‌వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ , లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ , పుల్లెల గోపిచంద్, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి, భూటియా తదిరులు ఉన్నారు.
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు
కాగా, ఇటీవల “క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా నిలపాలన్న సంకల్పంతో ఈ క్రీడా విధానాన్ని తీసుకొచ్చాం. ఈ విధానంలో రాజకీయ జోక్యం తగ్గించాలన్న ఉద్దేశంతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రీడా పాలసీని రూపొందించాం. ” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అలాగే, “క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలోని అనుభవజ్ఞులను ఆహ్వానించే బోర్డ్ ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో మంచి క్రీడా కారులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ పాలసీ తెచ్చాం. రాబోయే రోజుల్లో దేశాన్ని ముందుకు నడిపించడానికి ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలి” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ అభివృద్ధికి ఉపాసన కృషి చేయనున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల సహకారంతో తెలంగాణ క్రీడలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని ఆశిద్దాం.


